ఒంగోలు టౌన్: బ్యాటరీ మారుస్తున్న క్రమంలో టెంపో ట్రావెల్స్ మినీ బస్సు దగ్ధమైంది. నగరానికి చెందిన పెద్దిరాజు స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల షాదీఖానా సమీపంలో హేమలక్ష్మి ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఒక టెంపో ట్రావెల్స్ మినీ బస్సు, ఒక ట్రావెల్స్ బస్సు ఉన్నాయి. రెండు రోజుల క్రితం టెంపో మినీ బస్సు బ్యాటరీ డౌనైంది. శుక్రవారం దాన్ని మార్చేక్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీ పగులుతుందన్న భయంతో అక్కడున్న వారంతా పరుగులు తీశారు. దీంతో బస్సు లోపల సీట్లకు మంటలంటుకుని బస్సు పూర్తిగా దగ్ధమైంది. దాని వెనకాలే నిలిపి ఉంచిన ట్రావెల్స్ బస్సు ముందు భాగం, అద్దాలు తగలబడ్డాయి. స్థానికులు అగ్నిమాపకదళం కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే ఫైరింజన్ వచ్చి మంటలార్పింది. ఈ ప్రమాదంతో భారీగా నష్టం వాటిల్లినట్లు పెద్దిరాజు తెలిపారు.
ఒంగోలు సబర్బన్: ప్రముఖ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సరుకు రవాణాను మరింత సులభతరం, వేగవంతంగా తక్కువ వ్యయంతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కనెక్ట్ అనే డిజిటల్ యాప్‌ను ప్రవేశపెడుతోందని ఉమ్మడి ప్రకాశం జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆర్.సుశీల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాప్‌ను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


