ఒంగోలు సిటీ: పీఎం శ్రీ నవోదయ విద్యాలయంలో రీజినల్ స్థాయి బాక్సింగ్ పోటీలు ఈ నెల 22 నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డీవీఆర్ మూర్తి పాల్గొని విజేతలైన విద్యార్థులకు బహుమతులు, పతకాలను అందజేశారు. పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అండమాన్–నికోబార్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి నవోదయ విద్యాలయాల్లో చదువుతున్న మొత్తం 128 మంది బాల, బాలికలు పాల్గొనగా వారిలో 55 మంది జాతీయ స్థాయిలో పాల్గొనడానికి అర్హత సాధించారు. జాతీయ స్థాయి పోటీలు గుజరాత్‌లో వడ్ నగర్ నవోదయ పాఠశాలలో ఆగస్టు 18 నుంచి 21 తేదీల్లో జరుగుతాయని నవోదయ విద్యాలయ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఆకెళ్ల రఘు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రొఫెసర్ డాక్టర్ డీవీఆర్ మూర్తి మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థుల్లో ఒత్తిడిని అధిగమించవచ్చని, స్పోర్ట్స్ కోటాలో పైచదువులకు, ఉద్యోగావకాశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. అనంతరం విజేతలను అభినందించారు. కార్యక్రమంలో విద్యాలయ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఆకెళ్ల రఘు, వ్యాయమ ఉపాధ్యాయులు ఆర్.కిషోర్ కుమార్, విద్యాలయ సీనియర్ టీచర్ తాతయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు ఆర్.కిషోర్ కుమార్, బాక్సింగ్ కోచ్ వేణు, విద్యాలయ సిబ్బంది, వివిధ విద్యాలయాల ఎస్కార్ట్ టీచర్లు, కార్యాలయ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.


