కై లాస్‌నగర్: జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న హత్తిఘాట్ ఇండస్ట్రియల్ కారిడార్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన భూసేకరణకు వడివడిగా అడుగులు వేస్తోంది. 2062.01 ఎకరాల భూ సేకరణకు ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన సర్కారు నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారంపై ఫోకస్ పెంచింది. గ్రామసభల నిర్వహణకు సన్నద్ధమవుతుంది.
భూ సేకరణ వేగవంతం
ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధి భోరజ్ మండలంలోని హత్తిఘాట్ ప్రాంతాన్ని ఆనుకుని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. అయితే ఈ ప్రాంతం అనువుగా ఉందా లేదా అనేదానిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించి భూములను పరిశీలించారు. అనుకూలమని నిర్ధారించడంతో భూ సేకరణ కోసం ఇటీవల పేపర్ నోటిఫికేషన్ జారీ చేశారు. హత్తిఘాట్, గూడ, రాంపూర్–టి, గిమ్మ–బి గ్రామాల్లోని నీటి ఆధారిత పంటల సాగుకు అనుకూలంగా ఉన్న సారవంతమైన భూమలను సేకరించనున్నారు. ఆయా గ్రామాల్లోని పట్టా భూములు, వివాదాస్పద, సాదాబైనామా, ఈడీ అటాచ్‌లో ఉన్న భూముల వివరాలన్నింటిపై ఇప్పటికే అధికారులు పూర్తి వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేశారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతమైనందున ఆయా భూముల్లో ఈ సారి పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఒకవేళ సాగు చేస్తే స్వల్పకాలిక రకాలకు ప్రాధాన్యం ఇచ్చేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారు.
19 నుంచి గ్రామసభలు
భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈనెల 19నుంచి గ్రామసభలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ సభల్లో రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖలతో పాటు భూములు సేకరించనున్న టీజీఐఐసీ అధికారులు పాల్గొనున్నారు. పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు, మండల సర్వేయర్లతో కూడిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయనున్నారు. వీరు ఆయా గ్రామాల్లోని సర్వేనంబర్ల వారీగా పట్టాదారులు, వారికున్న భూవిస్తీర్ణం, సాగుభూమి స్థితి వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూ హక్కుదారులే కాస్తులో ఉన్నారా లేక ఇతరులేవరైనా సాగు చేస్తున్నారా అనే అంశాలను పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరాకు రూ.3.40 లక్షలు పలుకుతుంది. దీని ఆధారంగా ఎకరాకు ఎంత పరిహారం చెల్లించాలనే దానిపై ఈ సభల్లో నిర్ణయించనున్నారు. భూ వివరాలన్నీ సక్రమంగా ఉన్నట్లయితే పరిహారం నిర్ణయించి తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అనంతరం మండల సర్వేయర్లు, టీజీఐఐసీ నుంచి వచ్చే అధికారులతో కలిసి భూముల సర్వే చేపట్టి తుది నివేదిక సిద్ధం చేస్తారు. దాని ఆధారంగా తగు చర్యలు చేపట్టనుంది. ఈ కారిడార్ ఏర్పాటు ద్వారా అభివృద్ధిపరంగా జిల్లా రూపురేఖలు మారనున్నాయి.
కసరత్తు చేస్తున్నాం
హత్తిఘాట్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు సంబంధించి భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే భూ యజమానులు, వారి పేరిట ఉ న్న భూ విస్తీర్ణం, సర్వేనంబర్లు తెలిపిలా నోటిఫికేషన్ ప్రకటించాం. గ్రామసభలు నిర్వహించి సమగ్ర వివరాలు సేకరిస్తాం. వాటి ఆధారంగా అవార్డు ప్రకటించి తుది జాబితా సిద్ధం చేస్తాం. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్‌ఎస్ చిత్రు, అదనపు కలెక్టర్
గ్రామాల వారీగా సేకరించనున్న
భూముల వివరాలు


