ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అడుగులు
మొదలైన ఓఎల్‌ఎస్ సర్వే
ఏవియేషన్ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
కై లాస్‌నగర్: జిల్లాకేంద్రంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ ప్రాంతవాసుల కల సాకారం దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. మంగళవారం ఓఎల్‌ఎస్ సర్వే ప్రారంభమైంది. విమానాయాన శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
పారదర్శకంగా భూసేకరణ ప్రక్రియ : కలెక్టర్
ఆదిలాబాద్ జాయింట్ యూజర్ (డిఫెన్స్–సివిల్) ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేపడతామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్, బెంగళూరు కు చెందిన ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు, రాష్ట్ర సి విల్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డితో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయ భూసేకరణ చర్యలు వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే 700 ఎకరా ల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అదనంగా డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎయి ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్) కోసం 1,500 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలు కేటాయించేందుకు ప్రాథమిక ఆమోదం లభించిందన్నారు. జియో కోఆర్డినేట్ల ఆధారంగా భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామ ని సీఎంవో కార్యాలయం, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీకి భూములు అప్పగిస్తామని తెలిపారు. ఎంపీ నగేశ్ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన లొకేషన్ల పరిశీలన పూర్తయిందన్నారు. రక్షణశాఖ కోరిన 1,500 ఎకరాల భూసేకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లా అధికారులతో కలిసి మ్యాప్‌ల ఆధారంగా మైక్రో లెవెల్ సమీక్ష నిర్వహించామని, ప్రాజెక్టు వేగవంతానికి ఈ సమావేశంతో కీలక ముందడుగు పడినందన్నారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, జా యింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై స్ప ష్టత వచ్చిందన్నారు. గతంలో జారీ చేసిన 700 ఎకరాల జీవో ప్రకారం పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 800 ఎకరాల అనుమతుల ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు. తదుపరి విధానపరమైన నిర్ణయాల కోసం త్వరలో ఎంపీ నేతృత్వంలో ఢిల్లీలో ఉమ్మడి సమావేశం జరగనుందన్నారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుతో ఆదిలాబాద్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోందని, జిల్లా అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్.చిత్రు, ఎస్.రాజేశ్వర్, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు జేపీ సబర్వాల్, ఎస్.జి.హెడ్గే, ఎస్.కె.రెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్, ల్యాండ్ సర్వే ఏడీ ప్రభాకర్, తహసీల్దార్లు శ్రీనివాస్, గోవింద్ పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన ..
ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర అధికారులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో మైక్రో లెవల్ సర్వే చేపట్టారు. ఎరోడ్రమ్‌తో పాటు ఇందిరమ్మకాలనీ, అనుకుంట, సీసీఐ, ఇందిరమ్మ కాలనీ వంటి ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించారు. రన్‌వే విస్తరణతో పాటు ఇతరత్రా సాంకేతిక అంశాల ఆధారంగా మ్యాపుల ప్రకారం భూములను పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు.


