ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లో గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ఎంపీ గోడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసూతి విభాగంలో గర్భిణులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని సమయానుకూలంగా పరిశీలించి, తగిన చికిత్స అందించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అంతకుముందు రిమ్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు, ఇంకా మెరుగుపరచాల్సిన వసతులపై విస్తృతంగా చర్చించారు. ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించిన రూ.6 కోట్ల 33 లక్షల ప్రతి పాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ పోషకాహారంతో చిన్నారుల్లో ఎదుగుదల
చిన్నపిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం కీలకమని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. అంబేద్కర్ భవన్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 8వ పోషణ్ పక్వాడ్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. గర్భి ణులు, బాలింతలు, చిన్నారులు రక్తహీనత బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. అంగన్‌వాడీ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించా రు. ఇందులో డీడబ్ల్యూవో మిల్కా, సెక్టోరియల్ అధికారి ప్రత్యూష, వివిధ ప్రాజెక్టుల సీడీపీవో లు, అంగన్‌వాడీ టీచర్లు, అధికారులు పాల్గొన్నారు.
గ్రామస్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు
నేరడిగొండ: గ్రామస్తుల భద్రతకు ప్రాధాన్యతని స్తూ ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కిష్టాపూర్ పంచాయతీ పరిధిలో గల రోల్‌మామడ టోల్ ప్లాజా వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు. సర్వీస్ రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రవేశం వద్ద త్వరలోనే అన్ని వసతులతో కూడిన సర్వీస్ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ జితేందర్ సింగ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపా రు. ఆయన వెంట తహసీల్దార్ ఎంఏ కలీం, కేఎన్‌ఆర్సీ మేనేజర్ సూర్యనారాయణ, ఇన్‌చార్జి రాంమోహన్ రెడ్డి, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


