ఇంటి నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి
ఆదిలాబాద్‌రూరల్: పీఎం జన్‌మన్ కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ఆటంకం లేకుండా త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ కోరారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను హైదరాబాద్‌లో గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలపై అటవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కలెక్టర్, ఐటీడీఏ పీవో, అటవీ అధికారులను కలిసి సమస్యను వివరించినట్లు తెలిపారు. అలాగే ఐటీడీఏ ఎదుట ఆందోళనలు సైతం చేపట్టామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. అయితే సమస్యపై సానుకూలంగా స్పందించిన కమిషన్ చైర్మన్ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారరం కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాందాస్, సూరు, టేకం భీం, సొనేరావ్, వివిధ గ్రామాల పటేళ్లు చిన్ను, రమేశ్, మాణిక్ రావ్, రవి తదితరులున్నారు.


