పరాయిపంచన చెడుగూడు
దేవీపట్నం: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల నుంచే బాట పడుతోంది.. అలాంటి కార్యాలయాలకూ సొంత గూడు కరవైంది.. ఎవరూ పట్టించుకోక ఇప్పటికీ అద్దె భవనాలు, ఇరుకు గదుల్లోనే నెట్టుకురావాల్సి వస్తోంది.. పోలవరం నిర్మాణంతో దేవీపట్నం మండలంలో 43 గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో మండల కేంద్రం దేవీపట్నం నుంచి ప్రభుత్వ కార్యాలయాలను 2016–17లో ఇందుకూరుపేటకు తరలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణం జరగక వేరే ఇతర కార్యాలయాల్లో, ఇరుకు గదుల్లో నిర్వహించాల్సి వస్తుంది. దాదాపు ఎనిమిది ఎనిమిదేళ్లు గడుస్తున్నా భవన నిర్మాణాలు మాట అటుంచి కనీసం స్థల సేకరణ కూడా పూర్తి చేయలేదు. ముంపునకు గురవుతున్న దేవీపట్నంలోని పాత భవనాలకు రావాల్సిన సొమ్ము కూడా ఆయా శాఖల ఖాతాల్లో జమ కాలేదు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు.
ఏ కార్యాలయం.. ఎక్కడికంటే
ఎ.వీరవరంలోని మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఇందుకూరుపేట సాయిబాబా కొండ వద్ద ఉన్న మూతపడిన సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలోకి తరలించారు. అదే గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని ఇందుకూరుపేట సచివాలయం భవనంలో పైఅంతస్తులోకి మార్చారు. తొయ్యేరులో ముంపునకు గురైన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇందుకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇరుకు గదుల్లో సర్దుకోవాల్సి వస్తుంది. ఈ కళాశాలకు భవన నిర్మాణాన్ని ఆ పాఠశాల ఆవరణలో చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. నేటి వరకూ ఆ పనులు ప్రారంభం కాలేదు. దేవీపట్నంలోని పోలీస్ స్టేషన్‌ను ఇందుకూరు, ఫజుల్లాబాదు గ్రామాల మధ్య పరగసానిపాడు కాలనీలోని పంచాయతీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఎ.వీరవరంలోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ఇందుకూరుపేట ఎంపీపీ పాఠశాల భవనంలోని ఒక గదిలోకి తరలించారు. అదే గ్రామంలోని మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇందుకూరుపేట రైతుభరోసా కేంద్రంలోకి తీసుకువచ్చారు. ఇందులో మండల పరిషత్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఫజుల్లాబాదులోని సుబ్రహ్మణ్యస్వామి కొండ ఎదురుగా ఉన్న సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ భూమి కొంత ఆక్రమణకు గురైంది. ఇందుకూరుపేటలో బస్టాండ్‌ను ఆనుకుని సుమారు రెండెకరాల భూమి ఉన్నా ఆక్రమణకు గురైంది. ఈ ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు సాహసించడం లేదు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు పరాయి పంచన అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు దృష్టి సారించి ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
‘పోలవరం’తో
ముంపునకు గురైన మండల కేంద్రం
దేవీపట్నం నుంచి ఇందుకూరుపేటకు కార్యాలయాల తరలింపు
ఇప్పటికీ సమకూరని సొంత భవనాలు
ఎన్నిసార్లు విన్నవించినా..
దేవీపట్నం నుంచి ఇందుకూరుపేటకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించి ఎనిమిదేళ్లు కావొస్తుంది. అయినా ఇంత వరకూ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణం జరగక అసౌకర్యాల నడుమ సిబ్బంది విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
–కుంజం మురళీ, ఎంపీపీ, దేవీపట్నం
ఉన్నతాధికారులకు తెలిపాం
ప్రభుత్వం కార్యాలయాల నిర్వహణలో వస్తున్న ఇబ్బందులను ఉన్నతాధికారులకు తెలిపాం. నూతన భవన నిర్మాణాల గురించి వివరించాం. వారి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. భవనాల నిర్మాణానికి చొరవ చూపుతున్నాం.
– సాల్మన్‌రాజ్, ఎంపీడీఓ, దేవీపట్నం
పరాయిపంచన చెడుగూడు
పరాయిపంచన చెడుగూడు


