‘ఇందిరమ్మ’ పనులు అడ్డుకోవద్దు
కై లాస్‌నగర్: ఆదివాసీల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అటవీశాఖ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ.. దుబ్బగూడ గ్రామానికి 11 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, గ్రామానికి చెందిన లేతుబాయి ఎకరం భూమిని దానం చేసినట్లు తెలిపారు. తహసీల్దార్ రెవెన్యూ భూమిగా నిర్ధారిస్తూ అఫిడవిట్ జారీ చేశారని పేర్కొన్నారు. అందులో నిర్మాణ పనులు ప్రారంభించగా, అటవీశాఖ అధికారులు అడ్డుపడటం సరికాదన్నారు. నిర్మాణాలు కొనసాగేలా చూడాలన్నారు. అనంతరం శిక్షణ ఐపీఎస్ చిన్నబూస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో లంకా రాఘవులు, సాజిదొద్దీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
‘అనవసర రాద్ధాంతం సరికాదు’
సాత్నాల మండలం దుబ్బగూడలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట చేపట్టిన ఆందోళనకు సంబంధించిన స్థలం సాత్నాల రిజర్వు ఫారెస్ట్‌లోకి వస్తుందని డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్ ప్రకటనలో తెలిపారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అటవీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాన్ని చూపించడం జరిగిందని తెలిపారు. దీనిపై ఒక కుటుంబం మాత్రమే అభ్యంతరం చెప్పి రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలో ఇంటి నిర్మాణానికి యత్నిస్తుందని పేర్కొన్నారు. వారిపై అటవీ నేరం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. అటవీ, పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేస్తూనే ఆదివాసీలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.


