రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రతిఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నం.1లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అతివేగం ప్రమాదకరమని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్, అధికారులు, విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, ఎంఈవో సోమయ్య, ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, కోఆర్డినేటర్ తిరుపతి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


