పకడ్బందీగా ‘నాగోబా’ ఏర్పాట్లు
ఇంద్రవెల్లి: ఈనెల 18 నుంచి 25 వరకు నిర్వహించే నాగోబా జాతర ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతర ముందు లేదా తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నారని తెలిపారు. సోమవారం ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్‌తో కలిసి నాగోబా ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో నివేదిక ఇవ్వాలన్నారు. అనంతరం మెస్రం వంశీయులతో కలిసి నాగోబా జాతర వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. గోవాడ్, మర్రిచెట్టు పరిసర ప్రాంతాలు సందర్శించి ఏర్పాట్ల పనులు పరిశీలించారు. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్ల నిధులు, నాగోబా ఆలయాభివృద్ధికి రూ.6 కోట్లు, ప్రత్యేక గెస్ట్‌హౌజ్, డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.కోటి పనుల నివేదిక, పెండింగ్ పనుల వివరాల నివేదించాలన్నారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్ మాట్లాడుతూ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావ్, సర్పంచ్ తుకారం, ఐటీడీఏ డీఈ తానాజీ, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, దేవదాయ శాఖ ఈవో ముక్త రవి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, మెస్రం వంశీయులు నాగ్‌నాథ్, బాదిరావ్‌పటేల్ ఉన్నారు.
పకడ్బందీగా ‘నాగోబా’ ఏర్పాట్లు


