భైంసాలో పిచ్చికుక్క కలకలం..!
గంటన్నర వ్యవధిలో 50 మందిపై దాడి ఏరియాస్పత్రిలో బాధితుల హాహాకారాలు పరామర్శించిన సబ్ కలెక్టర్ సంకేత్‌కుమార్
భైంసాటౌన్: భైంసా పట్టణంలో సోమవారం ఓ పిచ్చికుక్క కలకలం రేపింది. గంటన్నర వ్యవధిలో దాదాపు 50 మందిపై దాడి చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గాయపడ్డారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పట్టణంలోని పంజేషా చౌక్ మీదుగా, బట్టిగల్లి, చౌదరిగల్లి, నయాబాది, మదీనాకాలనీ, రాజీవ్‌నగర్, కప్‌డా మార్కెట్, బస్టాండ్ రోడ్, తదితర ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించినవారిపై దాడి చేసింది. తానూరుకు చెందిన అంజనాబాయి అనే వృద్ధురాలు భైంసాలో జీడిపండ్లు విక్రయించేందుకు రాగా, నర్సింహానగర్ ప్రాంతంలో ఆమైపె దాడి చేసింది. బోయిగల్లికి చెందిన మేఘమాల అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా దాడి చేసింది. వీరిద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేగాక కుక్కకాటుతో 50 మంది ఆస్పత్రికి వచ్చినట్లు ప్రభుత్వ ఏరియాస్పత్రి వైద్యులు తెలిపారు. కుక్కకాటు బాధితుల హాహాకారాలతో ఆస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్, సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని, యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్‌లోని తన కార్యాలయంలో జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి బాలిక్ అహ్మద్, మండల పశువైద్యుడు విఠల్‌తో సమీక్షించారు. అనంతరం బాలిక్ అహ్మద్ మాట్లాడుతూ కుక్కకాటు బాధితులు తప్పనిసరిగా ఆరు డోస్‌ల వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. తీవ్ర జ్వర లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. పిచ్చికుక్కను బంధించామని మున్సిపల్ అధికారులు తెలిపారు.


