కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
దండేపల్లి: కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దండేపల్లి మండలం ద్వారక గ్రామానికి చెందిన మునిమడుగు గంగన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు దండేపల్లిలో తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండేకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గంగన్న మాట్లాడుతూ.. 2020సెప్టెంబర్ 19న తన సోదరుడు శ్రీనివాస్‌తో గొడవ జరిగింది. ఈ సమయంలో తన కూతురు మానస తలకు గాయం కావడంతో వెంటనే పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పట్లో పోలీసులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. కాగా ఈ గొడవ విషయంలో తమ కుల పెద్దలు వారిని కాదని పోలీస్టేషన్‌లో కేసు పెడతావా, అంటూ ఐదేళ్లుగా తనును, తన కుటుంబాన్ని ఆ కులంలో జరిగే శుభ, అశుభ కార్యాలకు రానివ్వకుండా బహిష్కరిస్తున్నారు. దీనిపై ఈ నెల 2న కుల పెద్దలను మళ్లీ కలిశాను. నీవు పోలీస్టేషన్‌లో శ్రీనివాస్‌పై పెట్టిన కేసు వాపస్ తీసుకుంటేనే కులంలోకి రానిస్తామని చెప్పారు. సూటి పోటీ మాటలతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన కుంటుంబాన్ని కులస్తులెవరు పలకరించవద్దని, పనులకు పిలవద్దని, ఒక వేళ పిలిస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని కులపెద్దలు కులస్తులను బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ విషయమై తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండేను సంప్రదించగా, దీనికి సంబంధించి ఈ రోజే ఫిర్యాదు అందింది. ఎస్సై, ఎంపీడీవోతో కలిసి గ్రామానికి వెళ్లి దీనిపై గ్రామస్తులతో మాట్లాడి, కులబహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


