రహదారి భద్రత నియమాలు పాటించాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రతిఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి హీలియం బెలూన్‌ను గాలిలోకి ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రహదారి భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడొద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు అప్పగించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే హాట్‌స్పాట్‌లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, సీఐ సునీల్, ఇన్‌స్పెక్టర్లు హరీంద్ర కుమార్, ప్రదీప్, రవాణా, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘సహకార’ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కై లాస్‌నగర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సేవలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ బ్యాంకు ప్రత్యేకాధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాంకు ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించి న ఆయన సోమవారం సాయంత్రం బ్యాంకును సందర్శించారు. బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరు, ఖాతాదారులకు కల్పి స్తు న్న సౌకర్యాలు, ఇతర పాలన సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి మోహన్, డీసీసీబీ సీఈవో రవి, డీజీఎంలు సూర్యప్రకాశ్, వెంకటస్వామి, భీమేందర్ పాల్గొన్నారు.


