కలెక్టరేట్‌ను ముట్టడించిన బీఆర్‌ఎస్
కై లాస్‌నగర్: రంగుమారిన సోయా కొనుగోలుతో పాటు పత్తి కొనుగోళ్లలో ఆంక్షలు లేకుండా చూడాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ర్యాలీగా వచ్చిన పార్టీ శ్రేణులు ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. సీఎం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినదించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ, రైతులు పండించిన పంటల కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. సోయా కొనుగోళ్లు చేపట్టే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ ద్వారా నియమించబడిన త్రీమెన్ కమిటీ చూసిన పంటలు కూడా గోదాంల నుంచి వెనక్కిరావడం విచారకరమన్నారు. ఇందులో పార్టీ నాయకులు నర్సింగ్‌రావు, నారాయణ, అక్బానీ, సాజిదొద్దీన్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


