రిమ్స్ డాక్టర్, సిబ్బందిపై కొరడా
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రి లోని ప్రసూతి విభాగంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇటీవల బాలింత, శిశువు మృతి చెందింది. ఈ పరిస్థితిని వివరిస్తూ ‘సాక్షి’లో ‘ప్రసవం.. ప్రాణాంతకం’ శీర్షికన గత నెల 12న కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ప్రొఫెసర్లతో విచారణ చేపట్టి కలెక్టర్ రాజర్షి షాకు నివేదిక అందించారు. వైద్య సిబ్బంది నిరక్ష్యం స్పష్టం కావడంతో శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ప్రసూతి విభాగం వైద్యురాలు క్రాంతికి చార్జీ మెమో జారీ చేశారు. తదుపరి చర్యలు చేపట్టేలా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు సిఫారసు చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏఎన్‌ఎం కె.సంతోషమ్మను సస్పెండ్ చేశారు. అలాగే ముగ్గురు స్టాఫ్ నర్సులు గౌలన్‌బాయిని గాదిగూడకు, కే శాంతను నార్నూర్ కు, కే సౌమ్యను ఇచ్చోడకు డిప్యూటేషన్‌పై పంపించారు. వార్డులో పనిచేసే ఆయాలు సుమ, లక్ష్మిని మరో వార్డుకు కేటాయించారు. కాగా, రిమ్స్‌లోని మెటర్నిటీ వార్డు అస్తవ్యస్తంగా తయారైంది. ప్రస వం కోసం వస్తున్న గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ప్రసూతి విభాగంలో ఆరుగురు బాలింతలు మృతిచెందడం గమనార్హం. వైద్యుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రిమ్స్ డాక్టర్, సిబ్బందిపై కొరడా


