పోలీసులకు క్రమశిక్షణ తప్పనిసరి
ఆదిలాబాద్‌టౌన్: సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు విధుల్లో నిజాయతీ తప్పనిసరి అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్థానిక పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని బుధవారం పరిశీలించారు. ముందుగా హెడ్‌క్వార్టర్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటి పూలమొక్క అందజేసి ఎస్పీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యాలయంలోని ప్రతీ ఆయుధాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ సంరక్షించాలని తెలిపారు. యువ పోలీసులకు సాంకేతికపరమైన విధులు కేటాయిస్తామని, ఉత్సాహం కలిగిన వారికి సంబంధిత విభాగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం హోంగార్డ్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు రాకేశ్, గోపి, విజయ్, సాయుధ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ–పరిపాలన సౌలభ్యం కోసం
స్టేషన్ ఆధునికీరణ
ఆదిలాబాద్‌టౌన్: పాలనా సౌలభ్యం దృష్ట్యా పోలీస్ స్టేషన్‌ను ఆధునికీకరించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నవీకరించిన ఎస్‌హెచ్‌ఓ కార్యాలయం, సిబ్బంది విశ్రాంతి గదిని బుధవారం ప్రారంభించారు. ప్రజలతో మరింత సత్సంబంధాలు ఏర్పడేలా, సిబ్బందికి విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం జోడించి కార్యాలయాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్ కుమార్, ప్రేమ్‌కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, రమ్య, ఇసాఖ్, హరూన్ అలీతో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


