ఎక్స్‌ప్రెస్ హైవేతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు గ్రామాలు, కాలనీల వద్ద నిర్మించని అండర్‌పాస్‌లు కిలోమీటర్ల మేర చుట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి
ఏదైనా రోడ్డు వస్తుందంటే గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారు. రవాణా సౌకర్యం పెరగడంతోపాటు తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమ జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని భావిస్తారు. అందువల్ల తమకు జీవనాధారమైన భూములను సైతం రోడ్డుకు ఇస్తారు. పలమనేరు నియోజకవర్గం మీదుగా సిక్స్ ట్రాక్ ఎక్స్‌ప్రెస్ హైవే వస్తుందనగా ప్రజలు సంతోషించారు. తీరా రోడ్డు నిర్మాణం అయ్యాక తమ గ్రామాలు, పొలాలు, కాలనీలకు వెళ్లడానికి గతంలో వుండే రోడ్లు సైతం మూసుకుకోవడంతో ఎంత పనిచేసిందిరా సామీ అని బాధపడుతున్నారు. రోడ్డు దాటేందుకు వీలులేకపోవడం, పొలాల వద్దకు వెళ్లేందుకు కిలోమీటర్లు చుట్టి రావాల్సి వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
పలమనేరు: పలమనేరు నియోజకవర్గం మీదుగా సిక్స్ ట్రాక్ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మిస్తున్నారు. దీనికి రెండు వైపులా సిమెంట్‌తో ఎవరూ వెళ్లకుండా ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు. అవరసమైన చోట అండర్‌పాస్‌లు నిర్మించలేదు. ఫలితంగా నియోజకవర్గంలో 60 వరకు గ్రామాలు, కొన్ని కాలనీలు, పొలాల వద్దకు వెళ్లే దారులు లేకుండా పోయాయి. ఈ సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబందిత రెవిన్యూ అధికారులకు విన్నవిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళుతున్నామంటున్నారే గానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. దీంతో గ్రామాలు, పొలాలకు, పశువులను మేతకు తీసుకెళ్లడానికి ఆయా ప్రాంత వాసులకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల ఎక్కడ చూసినా ఎక్స్‌ప్రెస్ హైవే సమస్యలపై బాధిత గ్రామస్తులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూనే ఉన్నారు.
ఎక్స్‌ప్రెస్ హైవేలోకి వెళ్లేందుకు అసలుకాదు
ఎక్స్‌ప్రెస్ హైవేలోకి మనుషులు, కుక్కలు, మూగ జీవాలు, ఇతర వాహనాలు వెళ్లకుండా చేయడంలో భాగంగానే కాంట్రాక్టర్లు రోడ్డుకు ఇరువైపులా సిమెంట్‌తో అడ్డుగా ఫెన్సింగ్‌ని నిర్మిస్తున్నారు. ఇతర రోడ్లకు కనెక్టింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ తప్ప ఎవరూ దీనిపైకి వెళ్లడం సాధ్యం కాదు. అవసరమైన చోట్లలో మాత్రం అండర్‌పాస్‌లు నిర్మించకపోవడం సమస్య మొదలైంది.
కాలనీ ఇళ్లకు దారేది
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గడ్డూరు, బోడిరెడ్డిపల్లి ఇందిరమ్మ, జగనన్న కాలనీల్లో సుమారు నాలుగువేల కుటుంబులున్నాయి. ఎక్స్‌ప్రెస్ హైవే రాకముందు ఇక్కడి ప్రజలు కూర్మాయి రోడ్డు, 80 అడుగుల రోడ్డులో వెళ్లేవారు. ఈ రోడ్ల మధ్య ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ హైవే రావడంతో కాలనీకి దారిలేకుండా పోయింది. వీరు తావడపల్లి రోడ్డులోగాని, అటు కౌండిన్య వైపు నుంచి వెళ్లేందుకు అవకాశం లేకుండా అష్ట దిగ్బంధంలో చిక్కుకున్నారు. మరోవైపు గడ్డూరు వద్ద అండర్‌పాస్ నిర్మాణం లేకుంటే కూర్మాయి మార్గం ద్వారా పలమనేరు రూరల్ మండలంలోని 20 గ్రామాలకు ఇబ్బందులు తప్పవు. అదే విధంగా మండల కేంద్రమైన బైరెడ్డిపల్లిలో నిర్మించిన జగనన్న కాలనీకి దారి లేకుండా పోయింది. వీరు మెయిన్ రోడ్డు నుంచి కాలనీలోకి వెళ్లాలంటే నాలుగైదు కిలోమీటర్ల చుట్టాల్సి వస్తోంది.
ఎన్నో గ్రామాలు, కాలనీలకు ఇదే పరిస్థితి..
ఎక్స్‌ప్రెస్ హైవే కర్ణాటక రాష్ట్రంలోని హుల్కూర్ నుంచి వీకోట మండలంలో ప్రవేశిస్తోంది. అక్కడి నుంచి బైరెడ్డిపల్లి, పలమనేరు, బంగారుపాళెం, గుడిపాల మండలాల మీదుగా తమిళనాడుకు వెళుతోంది. ఈ మార్గాల్లోని పదుల సంఖ్యలో గ్రామాలు, పొలాల వద్దకు వెళ్లే దారులు ఇప్పుడు లేకుండా పోయాయి. పలమనేరు మండలంలోని దిగువకల్లాడు, ఎగువ కల్లాడు, నడిమికల్లాడు, గజ్జలవారిపల్లి మీదుగా పకీరుపల్లికి దారి లేకుండా పోయింది. మరోవైపు ఎక్స్‌ప్రెస్ హైవే గ్రామాల నుంచి పొలాల వద్దకు వెళ్లే వందలాది కాలి బాటలు లేకుండా పోయాయి. దీంతో పొలం పనులకు, పశువుల మేతకు ఎలా వెళ్లాలో దిక్కుతోచక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలు, దారులు, కాలనీలున్న చోట అండర్‌పాస్‌లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. అండర్ పాస్‌ల విషయం అప్పట్లో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్వాహకులు ప్రతిపాదించకపోవడం ప్రజలకు శాపంగా మారింది. దీనిపై ఎన్‌హెచ్ అధికారులను అడిగినా తమకు సంబంధం లేదని చెబుతున్నారు.
మూసుకుపోయిన రోడ్లు
మూసుకుపోయిన రోడ్లు