
రాజ్యాధికార సాధనే లక్ష్యం
పుంగనూరు: రాజ్యధికారాన్ని సాధించుకునేందుకు బహుజనులంతా ఐకమత్యంతో పోరాటం చేద్దామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగరాజు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవనంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రబాబుతో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ బుక్‌లెట్లను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇందుకోసం రాజ్యాధికారం తప్పనిసరని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. బహుజనులను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారాన్ని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.