
ప్రమాదం జరిగినా పట్టించుకోరా..?
కాగతిచెరువులో ప్రమాదకరంగా వాలిన 20 విద్యుత్ స్తంభాలు ఆందోళనలో రైతులు, ప్రజలు డ్రైవర్ మృతిచెందినా పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు
చౌడేపల్లె: మండలంలోని బోయకొండ–పుంగనూరు రోడ్డులోని కొలింపల్లె సమీపంలోని ఒడ్డోళ్ల తోట సమీపంలో మూడు రోజుల క్రితం టెంపోలో జేసీబీను తరలిస్తుండగా 11 కేవీ విద్యుత్ లైను తగిలి డ్రైవర్ సుబ్రమణ్యంరెడ్డి మృతిచెందాడు. ఇక్కడ విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో వున్నాయి. అంతేగాక మండలంలోని కాగతి విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి కాగతి చెరువు మీదుగా యనమసామనపల్లె, పలగార్లపల్లె, పొన్నిపెంట ప్రాంతాలకు 11 కేవీ లైను వెళుతోంది. చెరువులో నాటిన విద్యుత్ స్తంభాలు 20 వరకు ఒక పక్కకు వాలిపోయి ప్రమాదకరంగా వున్నాయి. ఇటీవల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులోకి నీరు చేరితే పెద్ద ప్రమాదం ఏర్పడే ప్రమాదం వుందని పరిసర ప్రాంతంలోని పంటలు సాగుచేసిన రైతులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మృతిచెందినా ట్రాన్స్‌కో అధికారుల్లో చలనం రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రమాదం జరిగినా పట్టించుకోరా..?