
అధికారికంగా పొలాల పండుగ
● ఈ నెల 23న తాంసిలో నిర్వహణ
● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
తాంసి: జిల్లాలో రైతులు సంప్రదాయంగా భావించే పొలాల అమావాస్య పండుగను ఈ సారి అధికారికంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 23న పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లను అధికారులు, గ్రామస్తులతో కలిసి కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. స్థానిక వాగు, మందిరం స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పొలాల అమావాస్యకు సంబంధించిన లఘు చిత్రాన్ని ఎంపీడీవో కార్యాలయంలో వీక్షించారు. పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఏటా పొలాల పండుగను రైతులు ఘనంగా నిర్వహించుకుంటారని, ఈ సారి రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చేలా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. గ్రామస్తులు ఐక్యతగా ఉంటూ ఏర్పాట్లలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారు ప్రొఫెసర్ తిరుమల్‌రావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి రవి, డీఆర్టీవో రాథోడ్ రవీందర్, డీపీవో రమేశ్, మండల ప్రత్యేకాధికారి వెంకటరమణ, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
పొన్నారిలో ఇళ్ల నిర్మాణాలు పరిశీలన..
మండలంలోని పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక కోసం రూ.7వేలు చెల్లిస్తున్నామని వారు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకను అధిక ధరకు విక్రయిస్తుంటే ఏం చేస్తున్నారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అవసరమైన వారికి కూపన్‌లు అందించి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీడీవో మోహన్‌రెడ్డి, తహసీల్దార్ లక్ష్మికి సూచించారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ నజీర్, పంచాయతీ కార్యదర్శి గంగన్న, గ్రామస్తులు ఉన్నారు.