కళ్ల ‘కలక’లం! రోజురోజుకు పెరుగుతున్న కేసులు! | - | Sakshi
Sakshi News home page

కళ్ల ‘కలక’లం! రోజురోజుకు పెరుగుతున్న కేసులు!

Jul 31 2023 12:32 AM | Updated on Jul 31 2023 7:21 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: కళ్లకలక.. ప్రజలను కలవరపెడుతుంది. వర్షాకాలం ప్రారంభంలో ఏటా ఇది ప్రబలడం మామూలే అయినా ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

కంటి ఆసుపత్రుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఐదు రోజులుగా పాఠశాలలకు సెలవు ఉండటంతో దీని ప్రభావం అంతగా కనిపించలేదు. సంక్షేమ వసతి గృహాల్లో మాత్రం ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నేటి నుంచి బడులు తిరిగి ప్రారంభం కానుండగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణ మార్పులతోనే ...

ఏటా వర్షాకాలం ప్రారంభంలో సంభవించే వాతావరణ మార్పులతో కళ్లకలక ప్రబలుతుండటం సాధారణమేనని వైద్యులు చెబుతున్నారు. బ్యాక్టీరియా, వైరస్‌, అలర్జీతో ఇది వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు.

రెండు, మూడేళ్లుగా జిల్లాలో దీని ప్రభావం అంతగా కనిపించలేదు. ఈ ఏడాది మాత్రం గడిచిన వారం వ్యవధిలోనే తీవ్రత అధికమైంది. ఈ లక్షణాలతో వచ్చే వారితో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్‌ కంటి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి.

లక్షణాలు.. చికిత్స

బ్యాక్టీరియా, వైరస్‌ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. కళ్లలో నీరు కారడం, ఎరుపెక్కడం, దురద లక్షణా లు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉంటే కళ్లు ఉబ్బ డం, కంటి రెప్పలు అతుక్కుంటాయి. వెలుగును చూసేందుకు ఇబ్బందులు పడుతుంటారు.

ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారం రోజుల్లో తగ్గే అవకాశముంటుంది. రెండు, మూడు రోజుల పాటు తీవ్రమైన లక్షణాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.

ఇంటి వద్ద ఉండటం శ్రేయస్కరం

వాతావరణ మార్పులతో కంజెక్టివాకు వైరస్‌, బ్యాక్టీరియా సోకడం ద్వారా కళ్లకలక వ్యాపిస్తుంది. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా త్వరగా బయటపడవచ్చు. చిన్న పిల్లలకు వేగంగా వ్యాప్తి చెందే అవకాశమున్నందున బాధితులు ఇంట్లో ప్రత్యేకంగా ఉండాలి.

వారు ఉపయోగించిన దుస్తులు, వస్తువులు మరొకరు వాడకూడదు. పరిశుభ్రత పాటించాలి. కళ్లలో ఏ మాత్రం నలతగా అనిపించినా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం శ్రేయస్కరం. – డా.చంపత్‌రావు, కంటి వైద్య నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement