అయ్యో ‘పాప’ం | - | Sakshi
Sakshi News home page

అయ్యో ‘పాప’ం

Aug 8 2024 11:48 PM | Updated on Aug 8 2024 11:48 PM

అయ్యో ‘పాప’ం

అయ్యో ‘పాప’ం

రాజానగరం: నవమాసాలు మోసి కన్న పాపను పుట్టిన పది రోజులకే ఆ తల్లి దూరం చేసుకుంది. బిడ్డ దూరమైన బాధతో నిద్రలేని రాత్రిళ్లు గడిపింది. చివరకు నాలుగేళ్ల తర్వాత కలెక్టర్‌ను కలిసి తన గోడు విన్నవించింది. అధికారులు విచారణ చేసి తన బిడ్డను అప్పగించాలని కోరింది. వివరాల్లోకి వెళితే.. రాజానగరం మండలం తూర్పుగానుగూడెం గ్రామానికి చెందిన కొర్రేపు ఆదిలక్ష్మి, అప్పారావు భార్యభర్తలు. 2019 అక్టోబరు 30న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఆదిలక్ష్మి ఆడపిల్లకు జన్మనిచ్చింది. వారం రోజుల తరువాత బిడ్డతో ఇంటికి తిరిగివచ్చింది. అప్పారావుకు మద్యం తాగే అలవాటు బాగా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కొందరు అతడికి మద్యం ఆశ చూపి, బిడ్డకు తమకివ్వాలని అడిగారు. అంగీకరించిన అప్పారావు తన పది రోజుల బిడ్డను వేరొకరికి అప్పగించేశాడు. ఈ విషయంపై ఆదిలక్ష్మి తన భర్తను గట్టిగా నిలదీసింది. దీంతో అతడు ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన నాలుగేళ్లు పూర్తయ్యింది. పరారైన అప్పారావు మళ్లీ తిరిగి తన భార్య దగ్గరకు వచ్చాడు. బిడ్డ సంగతి ఆదిలక్ష్మి మర్చిపోయి ఉంటుందని భావించాడు. కానీ ఆమె మళ్లీ తన భర్తను నిలదీసింది. మద్యం మత్తులోనే బిడ్డను వేరొకరికి అప్పగించానని అప్పారావు ఒప్పుకున్నాడు. ఎలాగైనా పాపను తిరిగి దక్కించుకోవాలని ఆ భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ప్రశాంతిని కలిసి తమ సమస్యను తెలిపి, న్యాయం చేయాలని కోరారు.

స్పందించిన కలెక్టర్‌

భార్యాభర్తల వేదనను అర్థం చేసుకున్న కలెక్టర్‌ ప్రశాంతి వెంటనే స్పందించారు. ఆమె ఆదేశాలపై జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయకుమారి ఆధ్వర్యంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ సునీత, పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ ఉదయ్‌ ఏంజిల్‌, ఏఎస్సై వెంకటేశ్వర్లు గురువారం తూర్పుగానుగూడెంలో విచారణ నిర్వహించారు. పాపను వేరొకరికి అప్పగించడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నర్సులను పిలిచి వివరాలు అడిగారు. మొదట తెలియదన్నప్పటికీ తర్వాత నిజాన్ని అంగీకరించారు. ఆ పాపను తీసుకున్న టీచర్‌కు బదిలీ అయిపోయిందని, ఎక్కడ ఉందో తమకు తెలియదని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు వచ్చిన ఒక అధికారి మాట్లాడుతూ పాప ఆచూకీపై విచారణ కొనసాగుతోందని, పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు.

పది రోజుల బిడ్డను

వేరొకరికి ఇచ్చేసిన తండ్రి

నాలుగేళ్లుగా తల్లి ఎదురుచూపులు

కలెక్టర్‌ ఆదేశాలతో అధికారుల విచారణ

Advertisement
 
Advertisement
Advertisement