World Hyper Tension Day
-
బీపీ చిక్కును తట్టుకునేది ఇలా!
బీపీ ఎక్కువగా ఉంది అని తెలియడం ఆలస్యం. ఉప్పు తగ్గించండి అనేస్తూంటారు డాక్టర్లు. ఏళ్లుగా వింటున్నామీ సలహాను. సరైందే కానీ... ఈ ఒక్క చర్యతోనే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుందా? ఊహూ సాధ్యం కాదంటున్నారు... డాక్టర్ ఎరం రావు, డాక్టర్ జమునా ప్రకాశ్‌లు! .మరి... ఏం చేయాలి? ఏది సరైన మార్గం?... ప్రపంచ హైపర్‌టెన్షన్ డే (మే-17) నేపథ్యంలో ఈ విషయాలు తెలుసుకోవడం మీకు ఎంతైనా అవసరం.. దేశంలో రక్తపోటు బాధితుల సంఖ్య ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు ఇందుకు ముఖ్య కారణం. చాలామందికి చిన్నప్పుడే ఏర్పడే రుచి, అభిరుచులు సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం పెద్దలైతే రోజుకు రెండు వేల మిల్లీగ్రాముల సోడియం మాత్రమే తీసుకోవాలి. అంటే సుమారు ఐదు గ్రాముల ఉప్పు. అంతే. కానీ మన దేశంలో సగటు వినియోగం ఎనిమిది గ్రాముల వరకూ ఉన్నట్లు ఇటీవలి లెక్కలు చెబుతున్నాయి. కొందరిలో ఇది మరింత ఎక్కువగానూ ఉండే అవకాశం ఉంది. అయితే “ఉప్పు తగ్గించండి” అనే సలహా ఎందుకు రక్తపోటును తగ్గించడంలో పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు?ఇంటి వంటతోనూ చిక్కే...భారతీయులు తీసుకునే సోడియంలో 80 శాతం కంటే ఎక్కువ వంట లేదా భోంచేసేటప్పుడు వేసే అదనపు ఉప్పుతోనే వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ బయట తినే అలవాట్లు పెరుగుతున్నప్పటికీ, ఇంటి వంట ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ద్వారా సోడియం ఎక్కువగా అందుతున్న దేశాల్లో ఉప్పు మోతాదును నియంత్రించడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు కానీ... దేశంలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ కుటుంబ సభ్యుల రుచులు, వయసు, అలవాట్లు అన్నీ కలిసి ఉంటాయి. అందుకే కేవలం “ఉప్పు తగ్గించండి” అనే సలహా సరిపోదు.అవగాహన పెరగాలి..ప్రజారోగ్య ప్రచారాలు సాధారణంగా ప్రజలకు ప్రమాదం తెలుసు, గుర్తు చేస్తే మార్పు వస్తుందని భావిస్తాయి. కానీ వాస్తవం అంత సులభం కాదు. ఒక జాతీయ సర్వే ప్రకారం, అధిక ఉప్పు ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన పెద్దలు మూడో వంతు కన్నా తక్కువ. అవగాహన తక్కువగా ఉన్నప్పుడు “ఉప్పు తగ్గించండి” అనే సందేశం పట్టించుకునేలా ఉండటం లేదు. కారణం పూర్తిగా అర్థం కాకపోతే అలవాట్లను మార్చడం కష్టం.రుచిని పట్టించుకోవడం లేదు...రక్తపోటును నియంత్రించేందుకు ఉప్పు తగ్గించాలని చాలామంది చెబుతారు. ఏమేం తినకూడదో కూడా చెబుతూంటారు. కానీ... రుచిని మాత్రం పట్టించుకోరు. ఉప్పు తక్కువగా ఉన్న చప్పిడి ఆహారం చాలామందికి రుచిగా అనిపించదు. అందుకే వారు తక్షణ సంతృప్తినిచ్చేందుకు మనకు బాగా పరిచయమైన ఉప్పును మళ్లీ మళ్లీ వాడుతూంటారు. అందుకే... ఉప్పు వాడుతూనే రుచిని కాపాడటం ఎలా? అన్నదానిపై దృష్టి పెట్టి... క్రమేపీ సోడియం మోతాదును తగ్గించాల్సి ఉంటుంది. అంటే.. ఆహారం రుచిగా ఉండేలా చూసుకుంటూ, సోడియాన్ని నెమ్మదిగా తగ్గించడం.ఇక మనం ఏమి చేయాలి?1) దేశీ వ్యూహం... WHO లక్ష్యాలకు అనుగుణంగా, 2030 నాటికి భారతదేశం ప్రజల సోడియం వినియోగాన్ని 30% తగ్గించేందుకు వంటగదులు, పాఠశాలలు, మార్కెట్ వ్యవస్థలు — అన్నింటినీ కలిపే సమగ్ర ప్రణాళిక అవసరం. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు తగ్గించడం మాత్రమే కాకుండా, కుటుంబాలకు ఉపయోగపడే ఆచరణాత్మక మార్గదర్శకాలు కూడా అవసరం.2) సంస్థలతో ప్రారంభించాలి...పాఠశాలలు, హాస్టళ్లు, కాంటీన్లు, ప్రభుత్వ ఆహార పథకాలు వంటి సంస్థల ద్వారా అందించే ఆహారాన్ని ఒకేరకమైన మార్గదర్శకాల ద్వారా తయారు చేసి పంపిణీ చేయాల్సిన అవసరముంది. తద్వారా ఇక్కడ ఉప్పును క్రమంగా తగ్గిస్తే, ప్రజల “సాధారణ రుచి” భావన కూడా మారుతుంది. అప్పుడు ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం తగ్గుతుంది.3) తక్కువ ఉప్పుతో కూడా రుచిగా ఉండే పరిష్కారాలు ఇవ్వాలిఈ సందర్భంలో MSG (మోనోసోడియం గ్లూటామేట్) గురించి శాస్త్రీయంగా చర్చించాలి. MSGలో సుమారు 12% సోడియం మాత్రమే ఉంటుంది, కానీ సాధారణ ఉప్పులో 39% సోడియం ఉంటుంది. MSG “ఉమామి” అనే రుచిని ఇస్తుంది. తక్కువ ఉప్పుతో పాటు MSG వాడితే రుచి తగ్గకుండా సోడియాన్ని 40% వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. CSIR–CFTRI నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం, ఉప్పు–MSG మిశ్రమాలను ఉపయోగించడం ద్వారా వెజ్ బిర్యానీ, దాల్ సాంబార్, పనీర్ కర్రీ, మురుకు, సేవ్, ఆలూ భుజియా, బ్రెడ్, బన్స్, బిస్కెట్లు వంటి భారతీయ ఆహారాల్లో సోడియం ను 22–32% వరకు తగ్గించవచ్చు. బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే, MSG వాడకం ఫుడ్ ఇండస్ట్రీకి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది.4) సోడియం గురించి చెప్పే విధానాన్ని మార్చాలి“ఉప్పు తగ్గించండి” అన్నదాని బదులుగా, “నెమ్మదిగా తగ్గించండి, రుచి అలాగే ఉంచండి” అనే సందేశం ఇవ్వాలి. చిన్నచిన్న మార్పులు ఎలా చేయాలి? ఉప్పు మళ్లీ వేసే ముందు రుచి చూసే అలవాటు ఎలా చేసుకోవాలి? సహజమైన రుచులను ఎలా పెంచుకోవాలి? ఇలాంటి ఆచరణాత్మక సూచనలు ఎక్కువకాలం కొనసాగుతాయి.5) అయోడైజ్డ్ ఉప్పు వాడకం.. భారతదేశంలో అయోడైజ్డ్ ఉప్పు వినియోగం చాలా విజయవంతమైంది. 2020–21 గణాంకాల ప్రకారం, 94.3% కుటుంబాలు సరైన అయోడిన్ కలిగిన ఉప్పును వాడుతున్నాయి. కాబట్టి లక్ష్యం- మొత్తం ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, కానీ అయోడిన్ లోపం రాకుండా చూసుకోవడం. మొత్తమ్మీద... రక్తపోటును నివారించాలంటే, సోడియం తగ్గింపును చూసే విధానాన్ని మార్చాలి. “ఉప్పు తగ్గించండి” అనే సాధారణ సలహాను దాటి, ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రజలకు సులభంగా అనుసరించగల విధంగా చేయాలి. దానికి నెమ్మదిగా ఉప్పు తగ్గించే విధానాలు, సంస్థల ద్వారా మార్పుకు నాయకత్వం, రుచిని కాపాడే పరిష్కారాలు. ఈ చర్యలతోనే సోడియం తగ్గింపు అనేది సంవత్సరానికొకసారి వినిపించే సలహాగా కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య మార్పుగా మారుతుంది. -
బీపీ ఉందా.. ఈ జాగ్రత్తలు పాటించండి
సాక్షి, హైదరాబాద్: రక్తపోటును (బీపీ) ‘సైలెంట్ కిల్లర్’గా వైద్యులు అభివర్ణిస్తుంటారు. బీపీ నియంత్రణలో లేకపోతే గుండెపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, కంటిచూపు కోల్పోవడం, డిమెన్షియా వంటివి సంభవిస్తాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో బీపీ, షుగర్ వంటివి నియంత్రణలో లేక రోగ నిరోధకశక్తి తగ్గి సులభంగా కరోనా బారిన పడే ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగినట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేప థ్యంలో ‘మీ రక్తపోటు ఎంతుందో కచ్చితంగా తెలుసుకోండి. దాన్ని నియంత్రణలో ఉంచండి. దీర్ఘ కాలం జీవించండి’ అనే నినాదంతో ‘వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్’ముందుకు సాగుతోంది. నేడు వరల్డ్ హైపర్‌టెన్షన్ డే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రక్తపోటుతో ముడిపడిన అంశాలు, సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కన్సల్టెంట్ ఫిజీషియన్ డా.ప్రభుకుమార్ చల్లగాలి ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సమస్య గుర్తించగానే చికిత్స చేయాలి.. రక్తపోటులో వస్తున్న మార్పులను గుర్తిస్తే.. వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. దాదాపు 50 శాతం మందికి వారిలో బీపీ సమస్య ఉన్నట్లు అవగాహన కూడా ఉండట్లేదు. బీపీ పెరగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో కొవ్వులు చేరడంతో లోపలి పొర చిట్లిపోయే ప్రమాదం ఉంది. వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ (డబ్ల్యూహెచ్ఎల్) సూచనల ప్రకారం బీపీ ఉందో లేదో తెలుసుకునేందుకు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం డాక్టర్ల వద్ద ఉండే స్ఫిగ్మో మానోమీటర్లు అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన బీపీ డిజిటల్ మీటర్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ 140 నుంచి 80 లోపు రక్తపోటు ఉండేలా చూసుకోవాలి. ముందుగా దీన్ని గుర్తించి మందులు వాడితే ఎక్కువ కాలం జీవించి ఉండేందుకు అవకాశం ఉంటుంది. వారం నుంచి 10 రోజుల పాటు బీపీ చెక్ చేసి, సరాసరి పాయింట్లు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీపీ ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. 140 నుంచి 90 లోపు బీపీ లేకపోతే వెంటనే మందులు వాడాలి. అనియంత్రిత రక్తపోటు ఎక్కువ కాలం ఉంటే కిడ్నీలు పాడవుతాయి. కంటి వెనుక భాగంలో రక్తనాళాలు చిట్లి బ్లడ్ స్పాట్స్ కనిపించడంతో పాటు కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. గుండెలో, మెదడులో రక్తనాళాలు చిట్లే అవకాశాలుంటాయి. మెదడులో రక్తం గడ్డ కట్టే ప్రమాదమూ లేకపోలేదు. బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. ► క్రమంతప్పకుండా బీపీ మందులు వాడాలి. ► తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మెల్లగా ఎక్సర్సైజులు పెంచాలి. ► తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తినాలి. ► కిడ్నీ సమస్యలున్న వారు, రక్తంలో సమస్యలున్న వారికి ప్రోటీన్ ఫుడ్‌తో సమస్యలు వస్తాయి. చేపలు, కోడిగుడ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. ► కోవిడ్ బాధితులు ఆందోళనతో బీపీ పెంచుకుంటున్నారు. అలా ఆందోళన చెందొద్దు. ► కరోనా బాధితుల్లో బీపీ, షుగర్ స్థాయిలు కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. అందుకు తగిన మందులు వాడాలి. ► బీపీ ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 7 రెట్లు పెరుగుతాయి. బీపీతో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల సులభంగా కోవిడ్ బారిన పడే అవకాశాలుంటాయి. ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.. కోవిడ్ రాక ముందే జాగ్రత్త చర్యల్లో భాగంగా రక్తపోటు నియంత్రణలో ఉండాలి. బీపీ కంట్రోల్లో లేకపోతే రక్త ప్రసరణ బాగా పెరిగి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తాయి. అందువల్ల ముందుగానే మందులు వాడి బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. అందువల్లే కరోనా చికిత్స సమయంలో రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతారు. లో డెన్సిటీ లిపో ప్రోటీన్లు రక్తంలో, రక్తనాళాల్లో పెరిగితే గుండెపోటు వస్తుంది. -
కంట్రోల్... కంట్రోల్...
ఉరుకులు పరుగుల జీవితంలో ఇంటా బయటా తట్టుకోలేనంత ఒత్తిడి... భవిష్యత్తుపై ఆందోళన. వేళాపాళా లేని తిండి తిప్పలు.... జీవితంలో ఎక్కడ ఏ అంచనాలు తప్పినా ముంచుకొచ్చే కోపతాపాలు, నిరాశా నిస్పృహలు... ఫలితంగా నరాల్లో పోటెత్తే నెత్తుటి వేగం అదుపు తప్పి రేకెత్తించే అలజడి. వైద్య పరిభాషలో దీనిని హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) అంటారు. సాదాసీదా సామాన్య భాషలో దీనినే బీపీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా జనంలో దడ పుట్టిస్తున్న బీపీ యమ డేంజరస్ జబ్బు. ఆదిలోనే దీనిని అదుపు చేయకపోతే గుండెపోటు రూపంలోనో, పక్షవాతం రూపంలోనో నిండు ప్రాణాలను నిశ్శబ్దంగా కబళించగలదు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే... అలజడి ఆందోళనలే కాదు, కోపాల్ తాపాల్... అన్నీ ఇక కంట్రోల్... కంట్రోల్... ఒకటే టెన్షన్... హైపర్ టెన్షన్ ప్రపంచమంతా ఒకటే టెన్షన్... అదే హైపర్ టెన్షన్. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో గుండెజబ్బులు, పక్షవాతం మొదటి రెండు స్థానాల్లో నిలుస్తుండగా, ఈ రెండు ముప్పులకూ దారితీసే విపత్కర పరిస్థితి అధిక రక్తపోటు. అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం రక్తపోటుకు సంబంధించిన వివరాలు ఇవీ... ఇలా నివారించుకోవచ్చు ఆహారంలో తీసుకునే రోజువారీ ఉప్పు పరిమాణం 5 గ్రా. కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలు పరిమితి మించకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేస్తూ ఉండాలి. అధిక బరువు ఉన్నట్లయితే బరువు తగ్గేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి. మద్యం తాగే అలవాటు ఉంటే మోతాదు మించకుండా చూసుకోవాలి. రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. అధిక రక్తపోటు ఉన్నట్లయితే వైద్యుల సలహాపై తగిన మందులు తీసుకోవాలి. ఇవీ కారణాలు ఆహారంలో మితిమీరి ఉప్పు తీసుకోవడం అతిగా కొవ్వు పదార్థాలను తీసుకోవడం తగిన శారీరక వ్యాయామం లేకపోవడం మితిమీరిన ఒత్తిడి అతిగా తాగడం, ధూమపానం


