బీపీ చిక్కును తట్టుకునేది ఇలా! | Preventing and Controlling Hypertension | Sakshi
Sakshi News home page

బీపీ చిక్కును తట్టుకునేది ఇలా!

May 14 2026 3:04 PM | Updated on May 14 2026 3:23 PM

Preventing and Controlling Hypertension

బీపీ ఎక్కువగా ఉంది అని తెలియడం ఆలస్యం. ఉప్పు తగ్గించండి అనేస్తూంటారు డాక్టర్లు. ఏళ్లుగా వింటున్నామీ సలహాను. సరైందే కానీ... ఈ ఒక్క చర్యతోనే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుందా? ఊహూ సాధ్యం కాదంటున్నారు... డాక్టర్‌ ఎరం రావు, డాక్టర్‌ జమునా ప్రకాశ్‌లు! .మరి... ఏం చేయాలి? ఏది సరైన మార్గం?... 

ప్రపంచ హైపర్‌టెన్షన్‌ డే (మే-17) నేపథ్యంలో ఈ విషయాలు తెలుసుకోవడం మీకు ఎంతైనా అవసరం.. దేశంలో రక్తపోటు బాధితుల సంఖ్య ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు ఇందుకు ముఖ్య కారణం. చాలామందికి చిన్నప్పుడే ఏర్పడే రుచి, అభిరుచులు సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం పెద్దలైతే రోజుకు రెండు వేల మిల్లీగ్రాముల సోడియం మాత్రమే తీసుకోవాలి. అంటే సుమారు ఐదు గ్రాముల ఉప్పు. అంతే. కానీ మన దేశంలో సగటు వినియోగం ఎనిమిది గ్రాముల వరకూ ఉన్నట్లు ఇటీవలి లెక్కలు చెబుతున్నాయి. కొందరిలో ఇది మరింత ఎక్కువగానూ ఉండే అవకాశం ఉంది. అయితే “ఉప్పు తగ్గించండి” అనే సలహా ఎందుకు రక్తపోటును తగ్గించడంలో పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు?

ఇంటి వంటతోనూ చిక్కే...
భారతీయులు తీసుకునే సోడియంలో 80 శాతం కంటే ఎక్కువ వంట లేదా భోంచేసేటప్పుడు వేసే అదనపు ఉప్పుతోనే వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ బయట తినే అలవాట్లు పెరుగుతున్నప్పటికీ, ఇంటి వంట ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ ద్వారా సోడియం ఎక్కువగా అందుతున్న దేశాల్లో ఉప్పు మోతాదును నియంత్రించడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు కానీ... దేశంలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ కుటుంబ సభ్యుల రుచులు, వయసు, అలవాట్లు అన్నీ కలిసి ఉంటాయి. అందుకే కేవలం “ఉప్పు తగ్గించండి” అనే సలహా సరిపోదు.

అవగాహన పెరగాలి..
ప్రజారోగ్య ప్రచారాలు సాధారణంగా ప్రజలకు ప్రమాదం తెలుసు, గుర్తు చేస్తే మార్పు వస్తుందని భావిస్తాయి. కానీ వాస్తవం అంత సులభం కాదు. ఒక జాతీయ సర్వే ప్రకారం, అధిక ఉప్పు ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన పెద్దలు మూడో వంతు కన్నా తక్కువ. అవగాహన తక్కువగా ఉన్నప్పుడు “ఉప్పు తగ్గించండి” అనే సందేశం  పట్టించుకునేలా ఉండటం లేదు. కారణం పూర్తిగా అర్థం కాకపోతే అలవాట్లను మార్చడం కష్టం.

రుచిని పట్టించుకోవడం లేదు...
రక్తపోటును నియంత్రించేందుకు ఉప్పు తగ్గించాలని చాలామంది చెబుతారు. ఏమేం తినకూడదో కూడా చెబుతూంటారు. కానీ... రుచిని మాత్రం పట్టించుకోరు. ఉప్పు తక్కువగా ఉన్న చప్పిడి ఆహారం చాలామందికి రుచిగా అనిపించదు. అందుకే వారు తక్షణ సంతృప్తినిచ్చేందుకు మనకు బాగా పరిచయమైన ఉప్పును మళ్లీ మళ్లీ వాడుతూంటారు. అందుకే... ఉప్పు వాడుతూనే రుచిని కాపాడటం ఎలా? అన్నదానిపై దృష్టి పెట్టి... క్రమేపీ సోడియం మోతాదును తగ్గించాల్సి ఉంటుంది.  అంటే.. ఆహారం రుచిగా ఉండేలా చూసుకుంటూ, సోడియాన్ని నెమ్మదిగా తగ్గించడం.

ఇక మనం ఏమి చేయాలి?
1) దేశీ వ్యూహం... WHO లక్ష్యాలకు అనుగుణంగా, 2030 నాటికి భారతదేశం ప్రజల సోడియం వినియోగాన్ని 30% తగ్గించేందుకు వంటగదులు, పాఠశాలలు, మార్కెట్ వ్యవస్థలు — అన్నింటినీ కలిపే సమగ్ర ప్రణాళిక అవసరం. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు తగ్గించడం మాత్రమే కాకుండా, కుటుంబాలకు ఉపయోగపడే ఆచరణాత్మక మార్గదర్శకాలు కూడా అవసరం.

2) సంస్థలతో ప్రారంభించాలి...పాఠశాలలు, హాస్టళ్లు, కాంటీన్లు, ప్రభుత్వ ఆహార పథకాలు వంటి సంస్థల ద్వారా అందించే ఆహారాన్ని ఒకేరకమైన మార్గదర్శకాల ద్వారా తయారు చేసి పంపిణీ చేయాల్సిన అవసరముంది. తద్వారా  ఇక్కడ ఉప్పును క్రమంగా తగ్గిస్తే, ప్రజల “సాధారణ రుచి” భావన కూడా మారుతుంది. అప్పుడు ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం తగ్గుతుంది.

3) తక్కువ ఉప్పుతో కూడా రుచిగా ఉండే పరిష్కారాలు ఇవ్వాలి
ఈ సందర్భంలో MSG (మోనోసోడియం గ్లూటామేట్) గురించి శాస్త్రీయంగా చర్చించాలి. MSGలో సుమారు 12% సోడియం మాత్రమే ఉంటుంది, కానీ సాధారణ ఉప్పులో 39% సోడియం ఉంటుంది. MSG “ఉమామి” అనే రుచిని ఇస్తుంది. తక్కువ ఉప్పుతో పాటు MSG వాడితే రుచి తగ్గకుండా సోడియాన్ని 40% వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. 

CSIR–CFTRI నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం, ఉప్పు–MSG మిశ్రమాలను ఉపయోగించడం ద్వారా వెజ్ బిర్యానీ, దాల్ సాంబార్, పనీర్ కర్రీ, మురుకు, సేవ్, ఆలూ భుజియా, బ్రెడ్, బన్స్, బిస్కెట్లు వంటి భారతీయ ఆహారాల్లో సోడియం ను 22–32% వరకు తగ్గించవచ్చు.   బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే, MSG వాడకం ఫుడ్‌ ఇండస్ట్రీకి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది.

4) సోడియం గురించి చెప్పే విధానాన్ని మార్చాలి
“ఉప్పు తగ్గించండి” అన్నదాని బదులుగా, “నెమ్మదిగా తగ్గించండి, రుచి అలాగే ఉంచండి” అనే సందేశం ఇవ్వాలి. చిన్నచిన్న మార్పులు ఎలా చేయాలి? ఉప్పు మళ్లీ వేసే ముందు రుచి చూసే అలవాటు ఎలా చేసుకోవాలి? సహజమైన రుచులను ఎలా పెంచుకోవాలి? ఇలాంటి ఆచరణాత్మక సూచనలు ఎక్కువకాలం కొనసాగుతాయి.

5) అయోడైజ్డ్ ఉప్పు వాడకం.. 
భారతదేశంలో అయోడైజ్డ్ ఉప్పు వినియోగం చాలా విజయవంతమైంది. 2020–21 గణాంకాల ప్రకారం, 94.3% కుటుంబాలు సరైన అయోడిన్ కలిగిన ఉప్పును వాడుతున్నాయి. కాబట్టి లక్ష్యం- మొత్తం ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, కానీ అయోడిన్ లోపం రాకుండా చూసుకోవడం. 

మొత్తమ్మీద... రక్తపోటును నివారించాలంటే, సోడియం తగ్గింపును చూసే విధానాన్ని మార్చాలి. “ఉప్పు తగ్గించండి” అనే సాధారణ సలహాను దాటి, ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రజలకు సులభంగా అనుసరించగల విధంగా చేయాలి. దానికి నెమ్మదిగా ఉప్పు తగ్గించే విధానాలు, సంస్థల ద్వారా మార్పుకు నాయకత్వం, రుచిని కాపాడే పరిష్కారాలు. ఈ చర్యలతోనే సోడియం తగ్గింపు అనేది సంవత్సరానికొకసారి వినిపించే సలహాగా కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య మార్పుగా మారుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement