Vamsi Art Theatres International
-
ప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు
వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలలో భాగంగా, ఈ పరాభవ నామ సంవత్సర ఉగాదికి వివిధ దేశాల తెలుగు సంస్థలనుండి సాంస్కృతిక కళారంగ విభాగాలలో విభిన్న సేవలు అందిస్తున్నవారికి "వంశీ సీల్వెల్ ప్రవాస భారతీయ ఉగాది పురస్కారాలు" ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందజేశారు.ప్రముఖ సినీ నటులు డా.రాజేంద్ర ప్రసాద్, నటీమణులు సంగీత, మంజుభార్గవి, దర్శకులు రేలంగి నరసింహారావు, సినీకవి వనమాలి,ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, వివిధ రంగాల కళాకారులు కూడా ఈ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలతో వేదికపై సత్కరించారు.వంశీ వేదికపై 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ ప్రధాన కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడికి "సభా భారతి" బిరుదు, సంస్థ సభ్యులైన యడవల్లి శేషు కుమారి శాస్త్రీయ సంగీతంలోనూ, తంగిరాల సౌభాగ్యలక్ష్మి లలిత సంగీత రంగంలోనూ, పావని చిలువేరు సాహిత్య రంగంలోను ఉగాది పురస్కారాలను అందుకోవడం తమకెంతో గర్వకారణమని సింగపూర్ నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ పురస్కార గ్రహీతలను అభినందించారు. యూకే నుండి డా. బాబురావు చౌదరి చాపరాల & భారతి దంపతులు, హాంకాంగ్ నుండి జయ పీసపాటి, ఖతార్ నుండి సాహిత్య జ్యోత్స్న కొలిపాక, యూఏఈ నుండి శ్రీకాంత్ చిత్తర్వు, శ్రీనివాస లింగం, సౌదీ అరేబియా నుండి కొనేరు ఉమామహేశ్వరరావు, అనిల్ కుమార్ కడించెర్ల, అమెరికా నుండి శ్రీనివాస్ గూడూరు, వాణి దిట్టకవి, జయరాం ఎర్రమిల్లి తదితరులు కూడా ఈ పురస్కారాలను అందుకున్నారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డా.కె వి రమణాచారి ఐఏయస్, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం హెడ్ కామేశ్వరి, డా. వంశీ రామరాజు ,ఇతర అతిథుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. -
ఇది అవార్డుల నెల... అక్కినేని జన్మదిన కళ
నడిచే నటనా స్వరూపం... అక్కినేని నాగేశ్వరరావు. ఆయన జన్మదినోత్సవాలంటే రాష్ట్రవ్యాప్తంగా కళాప్రపంచం ఊహాలోకాల్లో తేలియాడుతుంది. ఆనంద సాగరంలో మునిగిపోతుంది. పురస్కారాల ప్రవాహంలో తడిసిముద్దవుతుంది. ఒకనాడు అవార్డ్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన ఈ సాటిలేని కళాకారుడు... నేడు ఎందరో కళాకారులకు ఆ పరిస్థితిని తప్పిస్తున్నారు. తన పుట్టినరోజు సంబరాలను వారి చేతుల్లో పెట్టిన పురస్కారాల సాక్షిగా రెట్టింపు చేసుకుంటున్నారు. ‘‘నాకెవరైనా అవార్డ్ ఇస్తే బాగుండు అని ఎంతో కాలం ఎదురుచూశా’’నని ఇటీవలే ఓ సందర్భంగా గుర్తుచేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగుసినిమా రంగానికే తలమానికం లాంటి ఆయనే అలాంటి మాట అన్నారంటే... ఓ చిన్నపాటి ప్రశంస కోసం కళాకారుడు ఎంతగా తపిస్తాడో అనిపిస్తుంది. ఆ తపనను అనుభవమైంది కాబట్టే ఆయన తన పుట్టినరోజును కేవలం తనకోసం పరిమితం చేసుకోకుండా పురస్కారాల పుట్టినరోజుగా మార్చారు. కళాకారుల కళ్లలో ఆనందాన్ని ఆస్వాదించే మరపురాని రోజుగా మలచారు. కేవలం ఆర్టిస్టులకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న రంగాలకు చెందినవారికి సైతం అవార్డ్‌లను విస్తరించడంతో ఈ సీనియర్ స్టార్ జన్మదినోత్సవాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ స్మరణీయంగా మారాయి. పురజనుల ఆధ్వర్యంలో పురస్కారాలు... బహుశా అక్కినేని పుట్టినరోజును జరుపుతున్నన్ని సంస్థలు, ఇన్ని రోజుల పాటు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అనేది మరే కళాకారుడికీ దక్కని ఘనత. రాష్ట్రానికి చెందిన దాదాపు 15కిపైగా ప్రముఖ సంస్థలు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఏటా నిర్వహిస్తున్నాయి. ఆయన ఓకె అంటే మరికొన్ని సంస్థలు సైతం సై అనడానికి సిద్ధంగా ఉన్నాయి. వంశీ ఆర్ట్ థియేటర్స్, సుబ్బిరామిరెడ్డి లలితకళాపరిషత్, కిన్నెర, అభినందన, రసమయి, ఆరాధన, రాగసప్తస్వర... తదితర పేరొందిన సంస్థలన్నీ పోటాపోటీగా అక్కినేని జన్మదినోత్సవాలు నిర్వహిస్తూ ఆయన పేరు మీద కళాకారులకు, పలు రంగాల్లోని లబ్దప్రతిష్టులకు పురస్కారాలు అందజేస్తుంటాయి. సుదీర్ఘకాలం కొనసాగే జన్మదినోత్సవాలుగా అక్కినేని బర్త్‌డే ఓ రికార్డ్‌గా చెప్పుకోవాలి. దాదాపు నెలంతా కొనసాగే ఈ వేడుకల కోసం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రతిరోజూ సిద్ధమవ్వాల్సిందే. ఆయన పేరిట గత కొన్నేళ్లుగా వందలాది మంది కళాకారులకు పురస్కారాలందాయి. అక్కినేని పుట్టినరోజు సందర్భంగా ఇచ్చే పురస్కారాల్లో స్వర్ణకంకణాలు మరో విశేషం. కేవలం ఒక్క వంశీ సంస్థ ఈ ఏడాదితో ఇచ్చే స్వర్ణకంకణాల సంఖ్యే 50కి చేరుతోంది. ఇక మిగిలిన సంస్థలు ఇచ్చేవాటితో కలుపుకుంటే వందకుపైగానే ఉంటాయి. పురస్కార ప్రదాతలను సైతం స్వయంగా అక్కినేని నాగేశ్వరరావే ఎంపికచేస్తారు. ఇక చాలంటున్న అక్కినేని... కొనసాగించాలంటున్న కళాభిమానులు ఈ ఏడాదితో తొంభయ్యోపడికి చేరుకున్న అక్కినేని దశాబ్దానికిపైగా సాగుతున్న తన పుట్టినరోజు సంబంధిత పురస్కారాల వేడుకలను ఇక ఆపేయాలని భావిస్తుంటే... కళాభిమానులు మాత్రం... కొనసాగించాలని కోరుకుంటున్నారు. వందల సంఖ్యలో కళాకారులను ప్రోత్సహించే అపురూప కార్యక్రమంగా రూపాంతరం చెందిన జన్మదినోత్సవాలను ముగించడం సరికాదని సూచిస్తున్నారు. ఈ సూచనల్ని అక్కినేని ఆలకిస్తారని, మరెంతో కాలంపాటు మరెంతో మందిని పురస్కారాలతో పులకింపజేస్తారని ఆశిద్దాం. ఈ ఏడాదితో 50 స్వర్ణకంకణ పురస్కారాలు... విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్నవారికి అక్కినేని పేరు మీద అక్కినేని జీవిత సాఫల్య స్వర్ణకంకణాల ప్రదానం చేసే అవకాశం మాకు దక్కడం మా అదృష్టం. గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. అంతటి మహానటుడి పేరు మీద ఇచ్చే పురస్కారం ప్రతి కళాకారుడికీ అంతులేని ఆత్మసంతృప్తిని అందిస్తోంది. - వంశీ రామరాజు వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్


