ప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు | Vamsi Awards for Non-Resident Indians In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు

Mar 27 2026 5:40 PM | Updated on Mar 27 2026 5:50 PM

Vamsi Awards for Non-Resident Indians In Hyderabad

వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలలో భాగంగా, ఈ పరాభవ నామ సంవత్సర ఉగాదికి వివిధ దేశాల తెలుగు సంస్థలనుండి సాంస్కృతిక కళారంగ విభాగాలలో విభిన్న సేవలు అందిస్తున్నవారికి "వంశీ సీల్వెల్ ప్రవాస భారతీయ ఉగాది పురస్కారాలు" ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందజేశారు.

ప్రముఖ సినీ నటులు డా.రాజేంద్ర ప్రసాద్, నటీమణులు సంగీత, మంజుభార్గవి, దర్శకులు రేలంగి నరసింహారావు, సినీకవి వనమాలి,ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, వివిధ రంగాల కళాకారులు కూడా ఈ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలతో వేదికపై సత్కరించారు.

వంశీ వేదికపై  'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ ప్రధాన కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడికి "సభా భారతి" బిరుదు,  సంస్థ సభ్యులైన యడవల్లి శేషు కుమారి శాస్త్రీయ సంగీతంలోనూ, తంగిరాల సౌభాగ్యలక్ష్మి లలిత సంగీత రంగంలోనూ, పావని చిలువేరు సాహిత్య రంగంలోను ఉగాది పురస్కారాలను అందుకోవడం తమకెంతో గర్వకారణమని సింగపూర్ నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ పురస్కార గ్రహీతలను అభినందించారు. 

యూకే నుండి డా. బాబురావు చౌదరి చాపరాల & భారతి దంపతులు, హాంకాంగ్ నుండి జయ పీసపాటి, ఖతార్ నుండి సాహిత్య జ్యోత్స్న కొలిపాక, యూఏఈ నుండి శ్రీకాంత్ చిత్తర్వు, శ్రీనివాస లింగం, సౌదీ అరేబియా నుండి కొనేరు ఉమామహేశ్వరరావు, అనిల్ కుమార్ కడించెర్ల, అమెరికా నుండి శ్రీనివాస్ గూడూరు, వాణి దిట్టకవి, జయరాం ఎర్రమిల్లి తదితరులు కూడా ఈ పురస్కారాలను అందుకున్నారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డా.కె వి రమణాచారి ఐఏయస్, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం హెడ్ కామేశ్వరి, డా. వంశీ రామరాజు ,ఇతర అతిథుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement