ఇది అవార్డుల నెల... అక్కినేని జన్మదిన కళ | It is the month of awards ... Akkineni Nageswara Rao birthday | Sakshi
Sakshi News home page

ఇది అవార్డుల నెల... అక్కినేని జన్మదిన కళ

Sep 26 2013 11:44 PM | Updated on May 24 2018 12:20 PM

ఇది అవార్డుల నెల... అక్కినేని జన్మదిన కళ - Sakshi

ఇది అవార్డుల నెల... అక్కినేని జన్మదిన కళ

నడిచే నటనా స్వరూపం... అక్కినేని నాగేశ్వరరావు. ఆయన జన్మదినోత్సవాలంటే రాష్ట్రవ్యాప్తంగా కళాప్రపంచం ఊహాలోకాల్లో తేలియాడుతుంది. ఆనంద సాగరంలో మునిగిపోతుంది.

నడిచే నటనా స్వరూపం... అక్కినేని నాగేశ్వరరావు. ఆయన జన్మదినోత్సవాలంటే రాష్ట్రవ్యాప్తంగా కళాప్రపంచం ఊహాలోకాల్లో తేలియాడుతుంది. ఆనంద సాగరంలో మునిగిపోతుంది. పురస్కారాల ప్రవాహంలో తడిసిముద్దవుతుంది. ఒకనాడు అవార్డ్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన ఈ సాటిలేని కళాకారుడు... నేడు ఎందరో కళాకారులకు ఆ పరిస్థితిని తప్పిస్తున్నారు. తన పుట్టినరోజు సంబరాలను వారి చేతుల్లో పెట్టిన పురస్కారాల సాక్షిగా రెట్టింపు చేసుకుంటున్నారు.
 
 ‘‘నాకెవరైనా అవార్డ్ ఇస్తే బాగుండు అని ఎంతో కాలం ఎదురుచూశా’’నని ఇటీవలే ఓ సందర్భంగా గుర్తుచేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగుసినిమా రంగానికే తలమానికం లాంటి ఆయనే  అలాంటి మాట అన్నారంటే... ఓ చిన్నపాటి ప్రశంస కోసం కళాకారుడు ఎంతగా తపిస్తాడో అనిపిస్తుంది. ఆ తపనను అనుభవమైంది కాబట్టే ఆయన తన పుట్టినరోజును కేవలం తనకోసం పరిమితం చేసుకోకుండా పురస్కారాల పుట్టినరోజుగా మార్చారు. కళాకారుల కళ్లలో ఆనందాన్ని ఆస్వాదించే మరపురాని రోజుగా మలచారు. కేవలం ఆర్టిస్టులకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న రంగాలకు చెందినవారికి సైతం అవార్డ్‌లను విస్తరించడంతో ఈ సీనియర్ స్టార్ జన్మదినోత్సవాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ స్మరణీయంగా మారాయి.
 
 పురజనుల ఆధ్వర్యంలో పురస్కారాలు...


 బహుశా అక్కినేని పుట్టినరోజును జరుపుతున్నన్ని సంస్థలు, ఇన్ని రోజుల పాటు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అనేది మరే కళాకారుడికీ దక్కని ఘనత.  రాష్ట్రానికి చెందిన దాదాపు 15కిపైగా ప్రముఖ సంస్థలు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఏటా నిర్వహిస్తున్నాయి. ఆయన ఓకె అంటే మరికొన్ని సంస్థలు సైతం సై అనడానికి సిద్ధంగా ఉన్నాయి. వంశీ ఆర్ట్ థియేటర్స్, సుబ్బిరామిరెడ్డి లలితకళాపరిషత్, కిన్నెర, అభినందన, రసమయి, ఆరాధన, రాగసప్తస్వర... తదితర పేరొందిన సంస్థలన్నీ పోటాపోటీగా అక్కినేని జన్మదినోత్సవాలు నిర్వహిస్తూ ఆయన పేరు మీద కళాకారులకు, పలు రంగాల్లోని లబ్దప్రతిష్టులకు పురస్కారాలు అందజేస్తుంటాయి. సుదీర్ఘకాలం కొనసాగే జన్మదినోత్సవాలుగా అక్కినేని బర్త్‌డే ఓ రికార్డ్‌గా చెప్పుకోవాలి. దాదాపు నెలంతా కొనసాగే ఈ వేడుకల కోసం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రతిరోజూ సిద్ధమవ్వాల్సిందే. ఆయన పేరిట గత కొన్నేళ్లుగా వందలాది మంది కళాకారులకు పురస్కారాలందాయి. అక్కినేని పుట్టినరోజు సందర్భంగా ఇచ్చే పురస్కారాల్లో స్వర్ణకంకణాలు మరో విశేషం. కేవలం ఒక్క వంశీ సంస్థ ఈ ఏడాదితో ఇచ్చే స్వర్ణకంకణాల సంఖ్యే 50కి చేరుతోంది. ఇక మిగిలిన సంస్థలు ఇచ్చేవాటితో కలుపుకుంటే వందకుపైగానే ఉంటాయి. పురస్కార ప్రదాతలను సైతం స్వయంగా అక్కినేని నాగేశ్వరరావే ఎంపికచేస్తారు.
 
 ఇక చాలంటున్న అక్కినేని... కొనసాగించాలంటున్న కళాభిమానులు


 ఈ ఏడాదితో తొంభయ్యోపడికి చేరుకున్న అక్కినేని  దశాబ్దానికిపైగా సాగుతున్న తన పుట్టినరోజు సంబంధిత పురస్కారాల వేడుకలను ఇక ఆపేయాలని భావిస్తుంటే... కళాభిమానులు మాత్రం... కొనసాగించాలని కోరుకుంటున్నారు. వందల సంఖ్యలో కళాకారులను ప్రోత్సహించే అపురూప కార్యక్రమంగా రూపాంతరం చెందిన జన్మదినోత్సవాలను ముగించడం సరికాదని సూచిస్తున్నారు. ఈ సూచనల్ని అక్కినేని ఆలకిస్తారని, మరెంతో కాలంపాటు మరెంతో మందిని పురస్కారాలతో పులకింపజేస్తారని ఆశిద్దాం.


 ఈ ఏడాదితో 50 స్వర్ణకంకణ పురస్కారాలు...


 విభిన్న రంగాల్లో సేవలు అందిస్తున్నవారికి అక్కినేని పేరు మీద అక్కినేని జీవిత సాఫల్య స్వర్ణకంకణాల ప్రదానం  చేసే అవకాశం మాకు దక్కడం మా అదృష్టం. గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. అంతటి మహానటుడి పేరు మీద ఇచ్చే పురస్కారం ప్రతి కళాకారుడికీ అంతులేని ఆత్మసంతృప్తిని అందిస్తోంది.


 - వంశీ రామరాజు
 వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement