breaking news
UREA black market
-
నువ్వు రైతువేనా? ఎలా నమ్మాలి?.. అధికారి ఓవరాక్షన్!
సాక్షి, మెళియాపుట్టి: ఎరువులు అందడం లేదని, ఒడిశా వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. ‘నువ్వు రైతువేనా? నువ్వు రైతువని నేనెలా నమ్మాలి?’ అని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి ప్రశ్నించిన ఘటన మెళియాపుట్టిలో శుక్రవారం సంచలనం కలిగించింది. ఆర్డీవో మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేశారు.ఒకషాపు మూసేసి ఉండటంతో యజమానిని రప్పించి తాళాలు తీయించాలని ఆదేశించారు. ఇంతలో అక్కడే ఉన్న శేఖరాపురం గ్రామానికి చెందిన రైతు ఎన్ని జగన్నాథం.. ‘సార్ నాకు ఒక్క బస్తా ఎరువు మాత్రమే అందింది. ఎరువులు వచ్చేలా చూడండి..’ అని విన్నవించారు. దీనికి ఆర్డీవో స్పందిస్తూ ‘నువ్వు రైతువేనా? నువ్వు రైతువని నేనెలా నమ్మాలి?’ అని అడిగారు. సాగుచేస్తున్న పొలం చూపించాలని కోరారు. దీంతో జగన్నాథం అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శేఖరాపురం గ్రామానికి ఆర్డీవోను తీసుకెళ్లి పొలం చూపించారు.అక్కడ జగన్నాథం తనకు ఒక ఎకరం భూమి ఉందని, ఏడెకరాలు కౌలుకు చేస్తున్నానని చెప్పారు. దీంతో ఆర్డీవో కౌలు రైతు కార్డు ఉందా? ఈ భూమి నువ్వే చేస్తున్నావనడానికి సాక్ష్యం ఏంటి? అని ప్రశ్నించారు. సార్ గ్రామస్తులను అడగండి సార్.. అని జగన్నాథం సమాధానమిచ్చారు. ఇంతలో గ్రామస్తులు వచ్చి జగన్నాథం ఏడెకరాలు కౌలుకి చేస్తున్నాడు సార్ అని చెప్పారు. దీంతో కౌలు రైతు కార్డు ఏదని ఆర్డీవో అడగడంతో తనకు భూ యజమానులు ఆ అవకాశం ఇవ్వలేదని జగన్నాథం చెప్పారు. ఒడిశాలో తెలిసినవారి దగ్గర యూరియా తెచ్చుకున్నాం ఇంతలోనే అక్కడికి మరికొందరు రైతులు చేరారు. వారంతా ఆర్డీవోతో మాట్లాడుతూ ‘సార్ మాకు ఎరువులు అందలేదు. పక్కనే ఒడిశాలో తెలిసిన వారిదగ్గర 5, 6 బస్తాలు తెచ్చుకున్నాం. బస్తా ధర రూ.500 నుంచి రూ.700 వరకు తీసుకున్నారు. శేఖరాపురం రెవెన్యూ గ్రామం జాడుపల్లి వద్ద అధికారులు డంప్ చేస్తున్నారు. అక్కడికి వెళితే జాడుపల్లి గ్రామ రైతులకే పంపిణీ చేస్తున్నారు. మాకు ఒక్కో యూరియా బస్తా ఇచ్చారు. మూడోవిడత ఎరువు వేయాల్సిన సమయం వచ్చింది. ఎలా చేయాలో ఏంటో..’ అంటూ తమ గోడు చెప్పుకొన్నారు. రెండురోజుల్లో మీకు ఎరువులు అందేలా చూస్తానని ఆర్డీవో వారికి హామీ ఇచ్చారు. అయితే రైతునని నిరూపించుకోవడానికి పొలం చూపించాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్నాథం ఆవేదన వ్యక్తంచేశారు. -
బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబే భాగస్వామి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే మీకు పట్టదా చంద్రబాబు అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సమయానికి ఎరువులు అందిస్తే రైతులు రొడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది?. సీఎం సొంత జిల్లా, కుప్పంలో కూడా రైతులు ఆగచాట్లు పడుతున్నారు. దీనిపై చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబే భాగస్వామి అని చెప్పుకొచ్చారు.ఏపీలో యూరియా కొరత, రైతుల అవస్థలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ైవైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రైతులు రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా?. మా హయంలో రైతులకు ఇబ్బంది అనేదే రాలేదు. చంద్రబాబు సొంత జిల్లాలోనే రైతులు ఆగచాట్లు పడుతున్నారు. మా పాలనలో.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారు. అప్పుడు రాని సమస్య.. ఇప్పుడు ఎందుకు వచ్చింది?. జగన్ అనే వ్యక్తి రైతులకు ఇబ్బంది కలగకూడదని ఆలోచించారు. ఇప్పుడు ఎరువుల దగ్గర కూడా స్కామ్‌లకు పాల్పడుతున్నారు. ీజన్ ప్రారంభంలోనే ఎంత విస్తీర్ణం సాగు అవుతుంది. ఎంత మొత్తంలో ఎరువులు కావాలో తెలియదా?. చంద్రబాబు చెప్పినట్టు యూరియా సరఫలా జరిగిందా.?రైతుల అవస్థలకు కారణం.. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువుల్ని టీడీపీ నేతలు దారి మళ్లించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అధికంగా కేటాయించిన ఎరువుల్ని బ్లాక్ చేసి.. బ్లాక్‌లో అమ్మేసుకుంటున్నారు. చంద్రబాబే ఇందులో భాగస్వామి రైతులను పీడించి.. స్కామ్‌లు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకుంటున్నారు. దాచుకో.. దోచుకు. యూరియా విషయంలో రూ.250 కోట్ల స్కామ జరిగింది’ అని ఆరోపించారు. చిత్తశుద్ధి లేని చంద్రబాబు వల్లే.. మా హయాంలో గట్టి హెచ్చరికలు వెళ్లేవి. తప్పు చేయాలంటే భయపడేవాళ్లు. అందుకే ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు చంద్రబాబే దగ్గరుండి స్కాంలు నడిపిస్తున్నారు. చంద్రబాబుకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎవరి మీద చర్యలు లేవు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ.. స్కాంలు చేస్తున్నారు.. వీళ్లు మనుషులేనా?. రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ల తరఫున మాట్లాడకూడదా?. ఉల్లి, టమాటా, చీనీ పంటలకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు సున్నా వడ్డీ పథకం ఎత్తేశారు అని ఆరోపించారు. -
‘రైతుల ఆత్మహత్యలు.. మంత్రుల హేళన వ్యాఖ్యలేంటి?’
సాక్షి, ప్రకాశం: ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా చేసాం. కానీ, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం తాకట్టు వ్యాపారంలా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో యూరియా అడుగుతున్న రైతులపై మంత్రులు హేళనగా మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయం మానుకోమంటున్నారు. 280 రూపాయల యూరియా బస్తా బ్లాక్ మార్కెట్లో 600 రూపాయలకు అమ్ముతున్నారు. ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.రైతు భరోసా 40వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా చేసాం.. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం తాకట్టు వ్యాపారంలా మారింది. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు. -
ప్రశ్నిస్తే.. నాలుక మందం అంట: భూమన అభినయ్
సాక్షి తిరుపతి: అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చే చంద్రబాబు.. ఇప్పుడు కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు.‘‘హమీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని గాలికొదిలేశారు. సూపర్ సిక్స్ హామీలు గురించి అడిగితే అన్ని అమలు చేసేశామని అంటున్నారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో మార్చారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సాయం రూ. 7 వేలు మాత్రమే అందించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న రైతులు.. ఇప్పుడు యూరియా కొరతతోనూ అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో యూరియాను విచ్చలవిడిగా అమ్మేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే నాలుక మందం అంటారు. చంద్రబాబు దీనంతటికి సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి యురియా అందుబాటులో తెవాలి. లేకుంటే తగిన బుద్ధి చెప్తాం.. రైతుల కోసం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ డివిజన్ అర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పిస్తాం. తిరుపతి పరిధిలో అన్నమయ్య సర్కిల్ నుండి ర్యాలీ చేపడతాం అని భూమన తెలిపారు. కిరణ్ రాయల్ తాజాగా ప్రెస్మీట్లో భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలపైనా అభియన్ తీవ్రంగా స్పందించారు. అసలు కిరణ్ రాయల్ ఏ పార్టీనో ముందుగా చెప్పాలని ప్రశ్నించారు. ‘‘కిరణ్ రాయల్ ను గతంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ చెప్పింది. రాజకీయాలలో దిగజారి మాట్లాడటం సబబు కాదు’’ అభినయ్ అన్నారు. -
‘యూరియా’ పాట్లు
సాక్షి, యాదాద్రి: అన్నదాతలు యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు. జిల్లాకు సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో రైతన్నలకు పడిగాపులు తప్పడం లేదు. ఇదే అదనుగా ఇటు డీలర్లు, అటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ చీకటి వ్యాపారం సాగిస్తున్నారు. భువనగిరి కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలో భువనగిరికి చెందిన యూరియాను పోలీసులు పట్టుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు పీఏసీఎస్ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. రామన్నపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద మంగళవారం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూకట్టి మరీ కొనుగోలు చేయడం జిల్లాలో యూరియా కొరత ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. కొరవడిన అధికారుల పర్యవేక్షణ.. పైగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టకపోవడం.. వెరసి జిల్లాలో యూరియా యథేచ్ఛగా చీకటిబజార్‌కు తరలిపోతోంది. కరువును అధిగమిస్తూ వరిని సాగుచేసిన రైతాంగాన్ని యూరియా కొరత తీవ్రమైన మనోవేదనకు గురిచేస్తోంది. సకాలంలో యూరియా అందకపోవడంతో రైతన్న పడిగాపులు కాస్తున్నాడు. సరఫరా లేదంటూ డీలర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల అవసరాన్ని కొందరు సొమ్ము చేసుకుంటుండగా మరికొందరు భువనగిరి కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా పక్కా రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఈ దందాకు అడ్డుకట్ట వేయడంలో జిల్లాలో వ్యవసాయాధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు రైతులు నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఎరువుల డీలర్లు, మార్క్‌ఫెడ్ ద్వారా సింగిల్ విండోలు యూరియా సరఫరా చేస్తున్నప్పటికీ బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రవాణా చార్జీల పేరుతో ఎమ్మార్పీ కంటే రూ.70నుంచి రూ.80వరకు అదనంగా అమ్ముతున్నారు. భువనగిరి, వలిగొండ, మోత్కూర్, చౌటుప్పల్, రామన్నపేట, తుర్కపల్లి మండలాల్లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నా అధికారులు నియంత్రించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఓఆర్ఆర్పై పట్టుబడ్డ భువనగిరి యూరియా.. భువనగిరి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మధనపల్లికి అక్రమంగా తరలిపోతున్న 10టన్నుల యూరియాను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్పై పోలీసులు తాజాగా పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతోపాటు యూరియాను స్వాధీనం చేసుకున్నారు. సోడియం నైట్రేట్ పేరుతో వెళ్తున్న లారీలో అమ్మోనియం నైట్రేట్ ఉండడంతో ఈ చీకటి వ్యాపారం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు అక్రమంగా హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, వికారాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని తెలుస్తోంది. బస్తా యూరియా రూ.350పై మాటే.. యూరియా బస్తా ఎమ్మార్పీ ప్రకారం రూ.266.85 విక్రయించాలి. డీలర్లు రవాణా చార్జీల పేరుతో కృత్రిమ కొరతను సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. కంపెనీలు సరఫరా చేసిన ర్యాక్ పాయింట్ నుంచి తీసుకొవచ్చిన యూరియా రవాణా చార్జీల పేరుతో ధరలు పెంచేస్తున్నారు. సరైన తనిఖీలు లేకపోవడంతో యూరియాను రాక్‌పాయింట్ నుంచే చీకటిబజార్‌కు తరలిస్తున్నారని తెలుస్తోంది. అలాగే రైతులకు అమ్మే యూరియాపై అదనంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో యూరియా బస్తాను హోల్‌సెల్ డీలర్లే రూ.320కి రిటైల్ డీలర్లకు విక్రయిస్తుండగా రిటైల్ డీలర్ రైతులకు రూ.350కిపైగా విక్రయిస్తున్నారు. రైతులు సీజన్‌కు అనుగుణంగా యూరియా కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పత్తా లేకుండా పోయారని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రో జులుగా భువనగిరిలో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న అటువైపు కన్నెత్తి చూసే అధికారే లేకుండాపోయారని రైతులు ఆరోపిస్తున్నారు. నిజంగా యూరియా కొరత ఉందా..! జిల్లాలో యూరియా కొరతపై అధికారులు రైతులకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కనీసం రైతుల అవసరాలను గుర్తించి యూరియా కొరతపై అధికారులు ప్రచారం నిర్వహించ లేకపోతున్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల పలు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఎంత యూరియా ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది అన్న విషయాన్ని అధికారులు ప్రకటించలేదు. అయితే 20రోజులుగా కురుస్తున్న చెదురుమదురు వర్షాలతో పంటలకు యూరియా కోసం రైతులు దుకా ణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. యూరి యా కంపెనీల నుంచి సరిపోను యూరియా సప్లయ్ చేయకపోవడంతో కొరత ప్రారంభమైంది. జిల్లాకు వచ్చిన యూరియాలో 50శా తం సింగిల్‌విండోల ద్వారా, 50శాతం ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు చార్జీల పేరుతో వసూలు.. యూరియా డీలర్‌కు సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్‌పోర్టు చార్టీల పేరుతో వసూలు చేస్తున్నాయి. మిర్యాలగూడ, హైదరాబాద్ ర్యాక్‌ల నుంచి బస్తాకు అదనంగా కిరాయి రూ.20 నుంచి రూ.30వరకు వసూలు చేస్తుండడంతో, డీలర్‌కు చేరే సరికే అది ఎమ్మార్పీ ధర కంటే మించిపోతోంది. జిల్లాలో కోరమాండల్, నాగార్జున, ఉజ్వల, ఇప్కో, క్రుబ్కో, స్పీక్, గోదావరి యూరియా కంపెనీలు ఉమ్మడి జిల్లాలో సరఫరా చేస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. డిమాండ్ 42వేల మెట్రిక్ టన్నులు వచ్చింది 12వేల మెట్రిక్ టన్నులు ప్రస్తుతం జిల్లాలో సాగైన పంటల అవసరాల కోసం సుమారు 42,223 మెట్రిక్ టన్నుల యూ రియా డిమాండ్ ఉండగా కాని ఇప్పటి వరకు కేవలం 12వేల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇందులో 6వేల మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్‌కు కేటాయించగా, 6వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల దుకాణాలకు కేటాయించారు. దుకాణాల నుంచి రైతులకు చేరింది తక్కువేనని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి ప్రస్తుత ఖరీఫ్‌లో కావాల్సిన యూరియా 42,200 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు జిల్లాకు సరఫరా అయ్యింది 12,000 మెట్రిక్ టన్నులు -
యూరియా.. మాయా!
గజ్వేల్: ‘మెతుకుసీమ’లో ఈసారి కూడా యూరియా కొరత తప్పదా? గంటల తరబడి నిరీక్షణ.. ఒక్క బస్తా కూడా అందక రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితులు పునరావృతం కానున్నాయా? అని ప్రశ్నిస్తే అవుననే అనిపిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని చూస్తుంటే జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటిచెబుతోంది. యూరియా బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంలో భాగంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి.. ఎమ్మార్పీ కంటే ఒక్క పైసా అదనంగా వసూలు చేసినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. ఎమ్మార్పీకి విక్రయిస్తే.. రవాణా చార్జీలు తామే భరించాల్సి వస్తోందని, నష్టానికి వ్యాపారం ఎలా చేస్తామనే వాదనను తెరపైకి తెచ్చిన వ్యాపారులు.. నిల్వలను సమృద్ధిగా మార్కెట్లోకి తేవడంలో విముఖత చూపుతుండటంతో ఈ రకమైన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈసారి వివిధ రకాల పంటలు సుమారు 5.20 లక్షల హెక్టార్లకుపైగా సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. మూడేళ్లుగా వ్యవసాయ శాఖ ప్రణాళికాలోపం కారణంగా యూరియా కొరత ఏర్పడి ఒకటిరెండు సంచుల కోసం రైతులు పోలీస్స్టేషన్ల వద్ద తిండితిప్పలు మాని ఉదయం నుంచి రాత్రివరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయినా దొరక్క నిత్యం రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో యూరియా వేయలేక భారీగా పంట నష్టానికి గురయ్యారు. ప్రస్తుతం గతేడాది తాలూకు చేదు అనుభవాలు రైతులను వెంటాడుతున్నాయి. అధికారుల తనిఖీలు, హెచ్చరికలు జిల్లాలో యూరియా కొరత రాకుండా చూడటమే కాకుండా బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా అరికట్టడానికి జిల్లా యంత్రాంగం పటిష్టమైన ప్రణాళికతో ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగానే జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ జిల్లాలోని పలుచోట్ల సమీక్షలు నిర్వహించారు. ప్రత్యేకించి ఎరువుల మార్కెట్లో సింహభాగాన్ని ఆక్రమించే గజ్వేల్‌లో జూన్ 13న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డీలర్లవారీగా క్షుణ్ణంగా వివరాలను తెలుసుకున్నారు. యూరియా బస్తా రూ.283 ఎమ్మార్పీకి ఒక్క పైసా పెంచి అమ్మినా...క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు చేశారు. ఎమ్మార్పీకి అమ్మితే తమపై రవాణా ఖర్చుల భారం పడి నష్టాల పాలవుతామని ఇన్చార్జి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. శరత్ మాత్రం ‘ఇష్టముంటే వ్యాపారం చేయండి..లేదంటే మానేయండి..’ అంటూ రైతుల ప్రయోజనాల దృష్ట్యా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అంతేకాకుండా గజ్వేల్‌లోనే కాదు జిల్లాలోని పలుచోట్ల తనిఖీలు ముమ్మరం చేయించారు. దీంతో వ్యాపారులంతా డైలామాలో పడ్డారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు యూరియాను విక్రయిస్తే చిక్కులు తప్పవని గుర్తించి లాబీయింగ్ మొదలుపెట్టారు. లారీ కిరాయి, హమాలీల పేరు చెప్పి గతంలో ఒక్కో బస్తాపై రూ.50 నుంచి రూ.100 అదనంగా వసూలు చేసి దండుకున్న వ్యాపారులకు.. అధికారుల కఠిన నిర్ణయం మింగుడు పడటంలేదు. నిజానికి యూరియా బస్తా కంపెనీ వద్ద రూ.272కు లభ్యమవుతోంంది. (కొన్ని రకాల కంపెనీలకు చెందిన యూరియా బస్తాలు మాత్రం రూ.270కే లభ్యమవుతాయి) దానిని రూ.11 లాభంతో రూ.283లకు విక్రయించాలి. ఉదాహరణకు హైదరాబాద్‌లోని మూసాపేట రేక్ పాయింట్ నుంచి ఒక్కో లారీ 340 బస్తాలు గజ్వేల్‌కు తెప్పించాలంటే కిరాయి రూ.7 వేలు వరకు చెల్లిస్తున్నామని, దీనివల్ల ఒక్కో బస్తాకు రూ.20కి పైగా ఖర్చువుతోందని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాకుండా లోడ్‌ను దింపుకోవడం, రైతులకు అందజేసే వరకు ఒక్కో బస్తాపై మరో రూ.7 వరకు ఖర్చవుతోందని దీనివల్ల రూ.300కు విక్రయిస్తే.. తమకు నష్టం ఉండదనే వాదనను తీసుకువచ్చారు. నిన్న మొన్నటివరకు బ్లాక్ మార్కెట్ చేసి లక్షలు దండుకున్న అధికారులు నిబంధనలు కఠినతరం చేసేసరికి తాము ఎక్కువ మొత్తంలో నిల్వలు తేలేమని చెబుతూ.. స్టాక్ తేవడానికి వెనుకంజ వేస్తున్నారు. వేల క్వింటాళ్ల యూరియా లోటు.. వ్యాపారులు తీరు కారణంగా జిల్లాకు ఇప్పటివరకు రావాల్సిన వేల క్వింటాళ్ల యూరియా లోటు ఏర్పడింది. ఉదాహరణకు గజ్వేల్ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాలకు జూన్ నెలాఖరు వరకు 9,144 టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇందులో కేవలం 7 వేల టన్నులు మాత్రమే వచ్చింది. ఇందులో 6,750 టన్నులు అమ్ముడుపోగా మరో 250 క్వింటాళ్లు మాత్రమే దుకాణాల్లో అందుబాటులో ఉన్నది. వర్షం లేకపోతేనే పరిస్థితి ఇలా ఉన్నది. ఆర్థికస్తోమతలేక ఇప్పటివరకు కొన్ని వేల మంది రైతులు యూరియాను ముందస్తుగా కొనుగోలు చేయలేకపోయారు. వర్షం వస్తే వారంతా ఒక్కసారిగా రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని వెంటనే సమీక్షించి...యూరియా కొరత రాకుండా చూడాల్సి ఉంది. బ్లాక్ మార్కెట్‌ను సహించేదిలేదు యూరియా బ్లాక్ మార్కెట్‌ను ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలను వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. రవాణా చార్జీల సాకుతో డీలర్లు యూరియా స్టాక్ తెప్పించకపోతే...ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. వర్షం వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. -హుక్యానాయక్,జిల్లా జాయింట్ డెరైక్టర్, వ్యవసాయ శాఖ