
సాక్షి, ప్రకాశం: ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా చేసాం. కానీ, కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం తాకట్టు వ్యాపారంలా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో యూరియా అడుగుతున్న రైతులపై మంత్రులు హేళనగా మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయం మానుకోమంటున్నారు. 280 రూపాయల యూరియా బస్తా బ్లాక్ మార్కెట్‌లో 600 రూపాయలకు అమ్ముతున్నారు. ఏపీలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
రైతు భరోసా 40వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా చేసాం.. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం తాకట్టు వ్యాపారంలా మారింది. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు.