
సాక్షి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పెట్టుబడి సాయం లేకుండా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఏడాది కాలంలో 250 మంది రైతులు బలవన్మరణానికి గురయితే.. ప్రభుత్వం మాత్రం కేవలం 104 మంది అని మాత్రమే చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఎన్నికల ముందు రైతులకు అన్నదాతకు వందనం పేరుతో రూ.20 వేలు అని చెప్పారు. ఏడాది గడిచి రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టినా వారికి ఏ సాయం చేయలేదు. ఈ ప్రభుత్వ పాలనలో రైతులు అమ్మబోతే అడవి.. ప్రజలు కొనబోతే కొరివిలా తయారైంది. దళారీ వ్యవస్థ పెరిగిపోవడం వల్ల... రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ప్రజలు కొనుక్కువాలనుకుంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతులు గురించి కనీస ఆలోచన చేయని ఈ ప్రభుత్వం.. రైతులు కోసం జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కితే మాత్రం కేంద్రానికి లేఖలు రాస్తారు. సాయం చేస్తున్నామంటూ హడావుడి చేస్తుంటారు. పొదిలిలో పొగాకు రైతుల పరిస్ధితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. పొగాకు బేళ్ల వేలంలో వ్యాపారులు గ్రూపుగా తయారవడంతో రైతులకు మంచి ధర లేకుండా పోయింది. అయినా ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదు.
రైతులను గాలికొదిలిన ప్రభుత్వం:
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మద్ధతు ధర అందేలా ప్రభుత్వమే రూ.100 కోట్లు నిధులు విడుదల చేసి... మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు మెరుగైన ధర అందించారు. ఇవాళ మిర్చి, పత్తి, అపరాలు ఏ పంట చూసుకున్నా మద్ధతు ధర లేకుండా పోయింది. మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఇ-క్రాప్ ద్వారా ఉచిత పంటల బీమా కల్పించడంతో పాటు గిట్టుబాటు ధర వచ్చేట్టు చేశారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే వారికి నష్టపరిహారం అందించడంతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చాం. ఇవాళ ఉచిత ఇన్సూరెన్స్ చేయలేదు. రైతులను పూర్తిగా గాలికొదిలేశారు. ఒంగోలులో గతంలో అపరాలు పంట నష్టపోతే ఇ-క్రాప్ ద్వారా నష్టపోయిన రైతులకు లక్షల్లో పరిహారం అందింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు ప్రగల్భాలు పలకడం తప్ప పనుల్లేవు. మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఆయన రైతులకు శాపంగా మారాడు.
కనీసం రూ.7 లక్షలు చనిపోయిన రైతులకు వెంటనే అందించే కార్యక్రమం గతంలో చేస్తే... ఈ ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఉండడం లేదు. వీరి పనితీరు చూస్తుంటే ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టు తయారైంది. అన్ని రంగాలను తుంగలో తొక్కి.. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. కేసుల పేరుతో వేధించడంతో పాటు భయబ్రాంతులకు గురిచేస్తూ.. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు.
నాలుగు దశాబ్దాలు అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పాలనకి, తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి పాలనకు ఉన్న తేడా చూడండి. కులాలు, పార్టీ, ప్రాంతం చూడకుండా పథకాలు ఇవ్వాలన్న జగన్మోహన్ రెడ్డికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే వాళ్లకు పాలుపోసినట్లు అనడం దారుణం. చంద్రబాబు ఇంట్లో డబ్బు ఇవ్వడం లేదు. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్య దేశం, ప్రజలకు అనుగుణంగా పాలన ఉండాలి.
రైతులను ఆదుకోవాల్సిందే:
రైతుసాగుని నిర్లక్యం చేస్తే మనుగడ ఉండదు. అలాంటి రైతులను ఆదుకోల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రైతులు నాగలి వదిలేసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతు భరోసాతో అందిస్తే.. రెండేళ్లు అయినా మీరు రైతులకు రూపాయి కూడా సాయం లేదు. చిన్నవయసులో తొలిసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సాయం చేస్తే... చంద్రబాబు మామిడి, పొగాకు, మిర్చి, ధాన్యం సహా ఏ రైతులనూ ఆదుకోలేదు. రైతులకు పెట్టుబడి సాయం ఎలాగూ లేదు కనీసం మద్ధతు ధర కూడా ఇవ్వడం లేదు.
విత్తనం నుంచి విక్రయం వరకు వైఎస్ జగన్ హయాంలో రైతులకు అండగా నిలబడి.. విత్తనం నుంచి నాణ్యమైన ఎరువులు వరకు రైతు ముంగిటకే అందించారు. రైతులు యూరియా కోసం ఎదురు చూస్తుంటే కనీసం స్పందడం లేదు. రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అదే ధోరణిలో రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు కందిపప్పు కూడా ఇవ్వలేని పరిస్ధితికి ఈ ప్రభుత్వ పాలన దిగజారిపోయింది. సార్టెక్స్ బియ్యం అని ప్రకటించి అవి కూడా సక్రమంగా అమలుచేయడం లేదని ఆయన మండిపడ్డారు.