సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Feb 20 2026 6:56 AM | Updated on Feb 20 2026 6:56 AM

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన ఎయిడెడ్‌ పాఠశాలల్లో పోస్టుల భర్తీకి 21 నుంచి పరీక్షలు ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయాలి వైఎస్సార్‌ సీపీ నాయకులకు పదవులు

పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్‌ కెనాల్‌ పనులను ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు ఈ నెల 25వ తేదీ పెద్దదోర్నాల మండల పరిధిలోని గంటవానిపల్లె రానున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను గురువారం కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్దన్‌రాజు పరిశీలించారు. వేగవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట మార్కాపురం జిల్లా జేసీ శ్రీనివాసులు, వెలిగొండ ప్రాజెక్టు ఎస్‌ఈ అబూతాలిం, డీఎస్పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు సిటీ: జిల్లాలోని నాలుగు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 14 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు అభ్యర్థులకు ఆయా పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నట్లు డీఈఓ సి.వి.రేణుక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న 1937 మంది అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఒంగోలులోని ఏబీఎం ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో ఐదు పోస్టులు, కనిగిరిలోని చిత్తరంజన్‌ అరబిక్‌ ఎయిడెడ్‌ పాఠశాలలో ఎస్జీటీ 3 పోస్టులకు సంబంధించి మామిడిపాలెంలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ద చర్చి సోషల్‌ యాక్షన్‌ ఇండియా పరీక్ష కేంద్రంలో సీబీటీ పరీక్ష జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా చీరాల ఎమ్మెస్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో 3 పోస్టులు, ముప్పవరంలోని పీఎస్‌ఎన్‌సీసీ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలోని 3 పోస్టులకు సంబంధించి వేటపాలెం మండలంలోని నాయినిపల్లె గ్రామంలో సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అభ్యర్థులందరూ హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల వివరాలను నిధి పోర్టల్లో నమోదు చేయాలని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోడూరి వెంకటరావు, సీహెచ్‌ ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 136 ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేసే 592 మంది సిబ్బంది వివరాలను మండల విద్యాశాఖ అధికారులు జీవో ప్రకారం నిధి పోర్టల్లో నమోదు చేయాలన్నారు. కొన్ని మండలాల్లో ఉపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఎయిడెడ్‌, డిప్యుటేషన్‌పై ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడి జీతభత్యాలు సకాలంలో చెల్లించని మండల విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులు లేని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఒంగోలు సిటీ: వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులను పార్టీలో వివిధ పదవుల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ యూత్‌ వింగ్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీగా ఒంగోలుకు చెందిన అడుసుమల్లి ప్రసన్నకుమార్‌, బీసీ సెల్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీగా దర్శికి చెందిన కండె గంగయ్య, రైతు విభాగం జిల్లా సెక్రటరీగా దర్శికి చెందిన పూడిక యలమందారెడ్డిని నియమించారు. అదేవిధంగా యూత్‌ వింగ్‌ ఒంగోలు సిటీ ప్రెసిడెంట్‌గా ఒంగోలుకు చెందిన యనమదల సన్నీ మంజేష్‌, పబ్లిసిటీ వింగ్‌ ఒంగోలు నియోజకవర్గ ప్రెసిడెంట్‌గా ఒంగోలుకు చెందిన తమ్మిశెట్టి వెంకట కిషోర్‌ను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement