త్రిసభ్య కమిటీ గప్‌చుప్
తౌషిక్ మృతి ఘటనపై విచారణలో జాప్యం 16వ తేదీ నియమించినా పత్తా లేని త్రిసభ్య కమిటీ కమిటీపై ఒత్తిడి చేస్తుందెవరు..? విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన
సింగరాయకొండ: జిల్లాలో సంచలనం సృష్టించిన సింగరాయకొండ చైతన్య నవోదయ పాఠశాల విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద మృతి మిస్టరీ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. తౌషిక్ మృతిపై విచారించాలని కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ ఇంత వరకు విచారణ ప్రారంభించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎస్పీ ఆదేశాల మేరకు కందుకూరు సీఐ షేక్ అన్వర్‌బాషా విచారణ ప్రారంభించగా..కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ ఇంత వరకు పత్తా లేదని విద్యార్థి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
త్రిసభ్య కమిటీ జాప్యమెందుకు.?
విద్యార్థి మృతిపై విచారించాలని ఐసీడీఎస్ పీడీ మాధురి, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక, తహశీల్దార్ రాజేష్‌లతో త్రిసభ్య కమిటీని ఈ నెల 16న కలెక్టర్ నియమించారు. నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే మూడు రోజులు దాటినా ఇంత వరకు ఆ కమిటీ సభ్యులు పాఠశాల వద్దకు వచ్చిన దాఖలాలు లేవని విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు. డీఈఓ రేణుక గురువారం టంగుటూరు మండలం ఆలకూరపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వద్దకు వచ్చి 10 కిలోమీటర్ల దూరంలోని సింగరాయకొండకు రాకుండా వెనక్కి వెళ్లడం ఏంటని విద్యార్థి బంధువులు ప్రశ్నిస్తున్నారు. విచారణ ప్రారంభించకపోవడంపై డీఈఓ రేణుకకు కలెక్టర్ ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విద్యార్థి బంధువులు చెబుతున్నారు. త్రిసభ్య కమిటీపై ఎవరో ఒత్తిడి తీసుకురావడంతోనే జాప్యం చేస్తున్నారని మృతుని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేసి మాకు న్యాయం చేయాలని తౌషిక్ తల్లిదండ్రులు కోరుతున్నారు. మరో పక్క కందుకూరు సీఐ అన్వర్ బాషా విచారణ చేస్తున్నారు. గురువారం ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐ సీహెచ్ హజరత్తయ్య పాఠశాలను పరిశీలించారు.


