వీఆర్‌ఓలపై పని ఒత్తిడి తగ్గించండి | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఓలపై పని ఒత్తిడి తగ్గించండి

Feb 20 2026 6:56 AM | Updated on Feb 20 2026 6:56 AM

వీఆర్‌ఓలపై పని ఒత్తిడి తగ్గించండి

వీఆర్‌ఓలపై పని ఒత్తిడి తగ్గించండి

పంచాయతీరాజ్‌తో పాటు ఇతర శాఖల విధులు రుద్దుతున్నారు రెవెన్యూ అసిసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిరెడ్డి

ఒంగోలు సబర్బన్‌: వీఆర్‌ఓలపై పని ఒత్తిడి తగ్గించాలని వీఆర్‌ఓ అసోసియేషన్‌, జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఒంగోలు అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు గురువారం వీఆర్‌ఓలు నిరసనకు దిగారు. వీఆర్‌ఓల సంఘ నాయకులు వెన్నపూస శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంతనూతలపాడు రెవెన్యూ కార్యాలయం ముందు రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపురెడ్డి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఒంగోలు రెవెన్యూ కార్యాలయం ముందు జరుగుతున్న నిరసనలో మాట్లాడారు. వీఆర్‌ఓలు రెవెన్యూకి సంబంధించిన విధులు మాత్రమే నిర్వహించేలా ప్రభుత్వం విధివిధానాలను మార్చాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ విభాగంలో పనిచేస్తూ కూడా పంచాయతీరాజ్‌తో పాటు ఇతర శాఖల పనులను కూడా వీఆర్వోలపై రుద్దడం సమంజసం కాదన్నారు. సెలవు దినాల్లో కూడా సెలవులు లేకుండా పనిచేస్తున్న ఏకై క ఉద్యోగులు వీఆర్‌ఓలు మాత్రమేనని గుర్తు చేశారు. దీంతో తీవ్రమైన పని వత్తిడి పెరిగిందన్నారు. పని వత్తిడి పెంచడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చి చాలా మంది వీఆర్‌ఓలు వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నారన్నారు. రెండవ శనివారం, ఆదివారం, పండగ దినాల్లో పనులు అప్పజెప్పి మానసిన వత్తిడికి గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రీ సర్వేలో సమయాన్ని లక్ష్యంగా పెట్టి పని చేయాలని వత్తిడి చేయడం సరికాదన్నారు. గ్రామ సచివాలయాలకు సంబంధించిన పనులకు సచివాలయంలో 8 నుంచి 12 మంది సిబ్బంది ఉన్నా కూడా వీఆర్వోలను విలేజ్‌ సర్వేలతో పాటు వివిధ సర్వేలు చేయాలని వత్తిడి చేయడం మానుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, ఎం.సురేష్‌, మారుతి, రాజు, శ్రీమన్నారాయణ, పోతురాజు, అనూష, శ్రీవల్లి, అసోసియేషన్‌ సంతనూతలపాడు మండల అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు, విలేజ్‌ సర్వేయర్లు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement