ఫలతం లేక!
సంక్షోభంలో మామిడి సాగు తోటలను పెద్ద ఎత్తున నరికేస్తున్న రైతులు తెగుళ్ల ఉధృతితో భారీగా పడిపోయిన దిగుబడులు ఆశాజనకంగా లేని మార్కెట్ వరుస నష్టాలతో కుదేలవుతున్న రైతులు వేలాది ఎకరాల్లో తోటలు తొలగిస్తున్న వైనం మామిడి రైతులను ఆదుకోవడంలో పాలకులు విఫలం ప్రత్యామ్నాయ మార్గాల వైపు రైతుల చూపు
కందుకూరు: జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఉలవపాడు మామిడికాయ భవిష్యత్‌లో కనుమరుగుకానుందా అంటే.. క్షేత్ర స్థాయి పరిస్థితులు అవుననే అంటున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 19 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. అందులో అత్యధికంగా కందుకూరు నియోజకవర్గంలో 13 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఉలవపాడు మామిడి పేరుతో ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు మండలాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం ఉలవపాడు మండలంలో 9 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ప్రతి ఏడాది ఈ ప్రాంతం నుంచి వందల టన్నుల మామిడికాయలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. రుచిలో ఎంతో ప్రత్యేకత ఉండే ఈ ప్రాంత మామిడి గత కొంతకాలంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏడాదికి ఒకసారి వేసవి సీజన్‌లో మాత్రమే వచ్చే ఈ పంట రైతులకు వరుసగా నష్టాలే తెచ్చిపెడుతుండటంతో రైతులు పెద్ద ఎత్తున తోటలను నరికివేస్తున్నారు. ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు మండలాల్లో వందల ఎకరాల తోటలను ఇప్పటికే రైతులు తొలగించారు.
గుళ్ల చేస్తున్న పండు ఈగ...
ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తోడు ఉధృతంగా వ్యాపిస్తున్న తెగుళ్లు మామిడి రైతులను గుళ్లచేస్తున్నాయి. ప్రధానంగా పండు ఈగ అనే తెగులు రైతులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. దీనికి ఇంత వరకు నివారణ అనేది లేకపోవడంతో కాయదశలో తోటలను పండు ఈగ పెద్ద ఎత్తున ఆశిస్తోంది. పైకి చూడటానికి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం కుళ్లిపోయి పురుగు వస్తోంది. కాయ నాణ్యత దెబ్బ తిని ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కాయ నాణ్యతను బట్టే ఎగుమతులు ఉంటాయి. అదే సందర్భంలో తెగుళ్ల కారణంగా కాయ దిగుబడి కూడా గణనీయంగా పడిపోతూ వస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రైతులు వరుసగా నష్టాలు చవిచూస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు తట్టుకోలేక తోటలను తొలగిస్తున్నారు.
రియల్ వైపు చూపు...
రామాయపట్నం పోర్టు, ఇండోసోల్, బీపీసీఎల్, తదితర భారీ పరిశ్రమల రాకతో జాతీయ రహదారికి ఇరువైపున ఉన్న భూములకు పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం అక్కడి భూముల ధర ఎకరా కోటికిపైగా పలుకుతోంది. దీంతో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఆ ప్రాంతంలో వాలిపోయారు. వందల ఎకరాల తోటలు కొనుగోలు చేసి వాటిని తొలగించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారు. దీంతో వందల ఎకరాల మామిడి తోటలు కనుమరుగైపోతున్నాయి. ఒక్క గుడ్లూరు మండలంలోనే దాదాపు 500 ఎకరాల వరకు ఇప్పటికే మామిడి తోటలు తొలగించినట్లు ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు...
ఏడాది మొత్తం ఎదురుచూసినా మామిడి తోటల వల్ల కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతులు వాటి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మామిడి తోటలు తొలగించి వాటి స్థానంలో జామాయిల్, సరుగుడు వంటి దీర్ఘకాలిక పంటలు సాగుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జామాయిల్ సాగు వల్ల మూడేళ్లకు ఒకసారి పంట చేతికొచ్చి మంచి లాభాలు వస్తుండడంతో మామిడి స్థానంలో ఈ పంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. అలాగే మరికొందరు కౌలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అదే సందర్భంలో మామిడితోటల పునరుద్ధరణ పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు అంతంతమాత్రంగానే ఉండడంతో రైతులు తిరిగి తోటలను పునరుద్ధరించేందుకు ముందుకు రావడం లేదు. కేవలం ఉపాధి హామీ పథకం కింద తోటలకు డబ్బులిస్తామని చెబుతున్నా.. అవి సక్రమంగా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మామిడితోటలను తొలగించేందుకే రైతులు మొగ్గుచూపుతున్నారు.
ఫలతం లేక!


