
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, చిత్రంలో మేరుగు నాగార్జున, బూచేపల్లి వెంకాయమ్మ, బత్తుల బ్రహ్మానందరెడ్డి
అన్నదాత సుఖీభవ జాబితాలో 7 లక్షల మంది రైతులకు అన్యాయం
మిర్చి, పొగాకు రైతులకు చేసిందేమిటి
దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజం
ఒంగోలు సిటీ: ‘పంజాబీ దాబాలాంటి సెట్టింగ్ వేసి.. 50 నుంచి 60 నులక మంచాలపై మహిళలు, రైతులను కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు వెనుక గడ్డివాము, ఒక ట్రాక్టర్ పెట్టి.. చుట్టూ పచ్చగా ఉండేలా భారీ సెట్టింగ్ వేసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఓ డ్రామా తరహాలో నిర్వహించారు’ అని దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించకుండా అన్నదాతా సుఖీభవ పేరుతో షూటింగ్ చేసుకుని వెళ్లిపోయారని మండిపడ్డారు.
శనివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పరిపాలనలో ఏటా 53.58 లక్షల మంది లబ్ధిదారులకు రైతు భరోసా అందేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్యను భారీగా కుదించారని దుయ్యబట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 46.87 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇస్తున్నారని, మిగిలిన 7 లక్షల మంది రైతులు ఏమి అన్యాయం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. మొదటి ఏడాది రైతులకు సాయం ఎగ్గొట్టి, ఇప్పుడు కేంద్రం వాటా కలుపుకుని రూ.7 వేలు ఇవ్వడం దగా చేయడమేనన్నారు. బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవకు ఎంత కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించరు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి పంటకు క్వింటాల్‌కు రూ.27 వేలు నుంచి రూ.28 వేలు ధర లభిస్తే.. చందరబాబు హయాంలో క్వింటాల్ ధర రూ.6 వేలకు పడిపోయిందని శివప్రసాద్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మిర్చి, పొగాకు, శనగ, వరి, పత్తి ఇలా అన్ని పంటల రైతులు గిట్టుబాటు ధరలు రాక అవస్థలు పడుతున్నారన్నారు.
దర్శిలో కార్యక్రమం ఎవరి కోసం..
సీఎం చంద్రబాబు దర్శిలో నిర్వహించిన కార్యక్రమం ఎవరి కోసమో చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మిర్చి రైతుల కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మిర్చి యార్డుకు వెళ్లిన తర్వాత సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖరాసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పొదిలికి జగన్‌మోహన్‌రెడ్డి వస్తే వేలాది మంది రైతులు, కార్యకర్తలు తరలివచ్చారని, వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారన్నారు.