
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేతలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేరుగ నాగార్జున ధ్వజం
తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత ఉద్యోగులకు కేవలం ఒకే ఒక్క డీఏ ప్రకటించి, ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటి.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటని నిలదీశారు. తీపి తీపి మాటలతో అరచేతిలో నాడు వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేయడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు. ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చిందని నిలదీశారు.
ఉద్యోగులను నిలువునా ముంచారన్నారు. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద ఇసుమంత కూడా లేదన్నారు. ‘అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజల మీద, ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచి్చన వెంటనే ఐఆర్ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి ఆ సంగతి ఏమైంది? మేము నియమించిన పీఆర్సీ చైర్మన్‌ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించ లేదు.
సీపీఎస్, జీపీఎస్ రెండింటినీ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ ఎన్నికల ముందు కబుర్లు చెప్పారు. కానీ, వాటిపై ఒక్కసారి కూడా సమీక్షించలేదు. బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ మాటెత్తడం లేదు. మొత్తంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు. ఇప్పుడు ప్రకటించిన డీఏను గత ఏడాది జవనరి 1 నుంచి ఇవ్వాలి. మరి ఆ బకాయిల చెల్లింపుపై మీ నోటి నుంచి ఏ మాటా రాలేదు. ఇది మరో మోసం. వలంటీర్ల జీతాలు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, ఏకంగా వారి పొట్టకొట్టి రోడ్డు మీద పడేశారు. ఆరీ్టసీలో పని చేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయడాన్ని తప్పన్నట్లు మాట్లాడటం దారుణం’ అని మండిపడుతూ శనివారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు.