లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర! | TDP attempt to take down the assassination case of Tirumalasetty Lakshmi Naidu | Sakshi
Sakshi News home page

లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర!

Oct 18 2025 5:07 AM | Updated on Oct 19 2025 10:23 PM

TDP attempt to take down the assassination case of Tirumalasetty Lakshmi Naidu

నిందితుడు, టీడీపీ కార్యకర్త హరిచంద్రప్రసాద్‌ను తప్పించేందుకు ఆ పార్టీ నేతల ప్రయత్నాలు

కాపు యువకుడు లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యుల ఆరోపణ 

నెల్లూరు జిల్లా దారకానిపాడులో ఈ నెల 2న దసరా నాడు ఘటన 

కాపు సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం 

దారకానిపాడులో బాధిత కుటుంబానికి పరామర్శ 

లక్ష్మీనాయుడు దారుణ హత్య బలిజ, కాపు వర్గాలపై జరిగిన దాడి

కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కాపుల పాత్ర ఎలాంటిదో రాష్ట్రమంతా తెలుసు 

కాపులను అణగదొక్కాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి 

కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌ మూర్తి హెచ్చరిక    

పట్నంబజారు/నెహ్రూనగర్‌(గుంటూరు): దసరా పండుగ నాడు... నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసును టీడీపీ నేతల ఒత్తిడితో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. 

హత్య కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రధాన నిందితుడు, టీడీపీ కార్యకర్త అయిన కాకర్ల హరిచంద్రప్రసాద్, అతడి తండ్రిని అరెస్టు చేశారని, కేసుకు సంబంధించిన వాస్తవాలను ఇప్పటికీ బయటపెట్టలేదని అంటున్నారు. మీడియాకు వివరాలు ఏమీ లేకుండా, నిందితులను అరెస్టు చేసినట్లు చిన్న ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసి చేతులు దులుపుకొన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. లక్ష్మీనాయుడిని ఢీకొట్టిన కారులో హరిచంద్రప్రసాద్‌ నాయనమ్మ కాకర్ల నారాయణమ్మ, అతడి భార్య కూడా ఉన్నారని, వీరిద్దరూ అతడిని ప్రోత్సహించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 

లక్ష్మీనాయుడు చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత వారు వెళ్లిపోయారని, వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చూపించలేదని వాపోతున్నారు. హరిచంద్రప్రసాద్‌కు పూర్తి సహకారం అందించిన పలువురు యువకుల పైనా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా టీడీపీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు తెరవెనుక పెద్దఎత్తున పన్నాగం పన్నుతున్నారని అంటున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...

దారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడు (25)ను టీడీపీ కార్యకర్త కాకర్ల హరిచంద్రప్రసాద్‌ ఈ నెల 2న కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశాడు. లక్ష్మీనాయుడు తన ట్రాక్టర్‌ను హరిచంద్రప్రసాద్‌కు అమ్మగా అతడు రూ.2 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. లక్ష్మీనాయుడు గట్టిగా నిలదీయడంతో అతడి భార్య సుజాత గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఓ సందర్భంలో లక్ష్మీనాయుడు తన భార్య సుజాత ఫోన్‌ నుంచి హరికి కాల్‌ చేశాడు. నంబరు సేవ్‌ చేసుకున్న హరి... సుజాత ఫోన్‌కు మేసేజ్‌లు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. సుజాత విసిగిపోయి భర్తకు చెప్పింది. 

లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్‌ నాయుడు, బాబాయ్‌ కుమారుడు భార్గవ్‌ నాయుడుతో కలిసి హరిచంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి అతను చేస్తున్నది తప్పని హెచ్చరించారు. ‘‘నేను ఇలాగే చేస్తా. చేతనైంది చేసుకోండి’’ అంటూ హరిచంద్రప్రసాద్‌ దుర్భాషలాడాడు. మరోవైపు లక్ష్మీనాయుడు కుటుంబం కలగజేసుకుని అప్పు చెల్లించాలని అడగడంతో వేరేవాళ్ల వద్ద ఉన్న ట్రక్కును ష్యూరిటీగా ఉంచాడు. కానీ, తన ట్రాక్టర్‌ లాక్కున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందిపెట్టాడు. ఒకటికి రెండుసార్లు గొడవలు కావడం, లక్ష్మీనాయుడు సోదరులతో వచ్చి నిలదీయడంతో పరువు పోయిందని హరి వారిపై కసి పెంచుకున్నాడు. 

దసరా పండుగ నాడు బైక్‌పై వెళ్తున్న లక్ష్మీనాయుడు, పవన్, భార్గవ్‌ను కారుతో ఢీకొట్టాడు. కారు దిగి రాడ్డుతో కొట్టాడు. కారులోని మహిళలు సైతం చచ్చేదాకా తొక్కించు అంటూ అతనిని రెచ్చగొట్టారు. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలైన భార్గవ్‌నాయుడు, పవన్‌ గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, తాము ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి రంగాను సైతం హరి దుర్భాషలాడాడని, ఆయన ఫొటో పెట్టుకోవటం పాపామా అని లక్ష్మీనాయుడు కుటుంబం వాపోయింది.

గుడ్లూరు ఘటనలో సమగ్ర దర్యాప్తు: ఎస్పీ
నెల్లూరు (క్రైమ్‌): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు శివారులో ఈ నెల 2న జరిగిన లక్ష్మీనారాయణ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు.  శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు హరిచంద్రప్రసాద్, మాధవరావును అరెస్ట్‌ చేశామని, వారు రిమాండ్‌లో ఉన్నారని చెప్పారు. నిందితుల ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దర్యాప్తు సరిగా జరగడం లేదనేది అసత్య ప్రచారంగా పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సోషల్‌ మీడియా ఖాతాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

కాపు వర్గ నాయకుల్లో తీవ్ర ఆగ్రహం
టీడీపీ కార్యకర్త హరిచందప్రసాద్‌ చేతిలో హత్య­కు గురైన లక్ష్మీనాయుడు కాపు యువకుడు కావడంతో ఆ సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు దారకానిపాడులో లక్ష్మీనాయుడు భార్య సుజాత, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేయడం, నియోజకవర్గ ప్రజాప్రతినిధి... లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిందితులు తన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కాపాడుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారనే విమర్శలు చేశారు. కాగా, తీవ్ర విమర్శలు రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం హడావుడిగా దారకానిపాడు వెళ్లారు. పరామర్శ పేరుతో హడావుడి చేశారు.  

పేదలమైన మాపై ఇంత కక్షా?
మాది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. చేతి­కి అందివచి్చనవారు ఆసుపత్రుల పాలయ్యారు. వారి వైద్యానికి కనీసం డబ్బు పుట్టని పరిస్థితి. హరిచంద్రప్రసాద్‌ కారుతో గుద్దడంతో మా అన్న కుమారుడు లక్ష్మీనాయుడు చనిపోయాడు. పవన్‌కు నడుము విరిగి మంచానికి పరిమితమయ్యాడు.  – తిరుమలశెట్టి వేణు, రమాదేవి (భార్గవ్‌నాయుడు తల్లిదండ్రులు)

నా కూతురిని చంపుతానని బెదిరించాడు
హరిచంద్రప్రసాద్‌ నన్ను లైంగి­కంగా వేధించాడు. లొంగకపోతే నన్నయినా, నా భర్త­ను అయినా చంపుతా అంటూ బెదిరించేవాడు. ఓసారి నా కూతురిని పైకి ఎత్తి చంపుతానంటూ భయపె­ట్టా­డు. నా భర్తను దారుణంగా చంపేశాడు. ఈ ఊరికే చెందిన బెజవాడ అవినాష్, అల్లం విజయకుమార్, కామినేని శ్రీనివాసులు (పొందూరు శ్రీను) నా భర్త లక్ష్మీనాయుడు హత్యకు సహకరించారు. వారిని పోలీసులు వదిలేశారు.  – లక్ష్మీనాయుడు భార్య సుజాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement