
కడప ఎన్టీఆర్ విగ్రహం వద్ద అనంత ఎమ్మెల్యే ప్రసాద్ దిష్టిబోమ్మ దహనం చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
కడపలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన
ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్
మదనపల్లెలో అభిమానుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కడప రూరల్/మదనపల్లె రూరల్/కర్నూలు(సెంట్రల్): అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి చేసిన పరుష వ్యాఖ్యలపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సోమవారం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ యూత్ లీడర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ దిష్టిబోమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ నేత సునీల్‌కుమార్, రామారావు మాట్లాడుతూ.. సినీరంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధికార మదంతో దూషించడం దారుణమన్నారు. జూ.ఎన్టీఆర్∙నటించిన సినిమాలను ఆడబోనివ్వమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆపడం ఎవరి తరం కాదన్నారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ తక్షణం స్పందించాలన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను సస్పెండ్ చేయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్‌కు, ఆయన తల్లి శాలినికి, అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు బుల్లెట్ సాయి, హరి తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో అభిమానులు
జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి కోరిన అభిమానులను సోమవారం మధ్యాహ్నం వరకు మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. దీనిపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మదనపల్లె జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు టెంపర్ రాజేష్ మాట్లాడుతూ.. తమ హీరోకు మద్దతుగా నిరసన తెలిపేందుకు అనుమతి కోరితే పోలీసులు నిరాకరించారన్నారు. అనంత ఎమ్మెల్యే ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అభిమానులు వినతిపత్రం సమర్పించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నాకు జూ.ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ యత్నించారు. దీంతో పోలీసులు వారిని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో వారంతా స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.