
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తర్వాత బుధవారం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. దగ్గుపాటిపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించడం గమనార్హం.
చంద్రబాబుతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారనే చర్చ నడిచింది. కచ్చితంగా సస్పెన్షన్ ఉంటుందని కొందరు టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆశించారు. ఇలాందేమీ జరగకుండానే.. వారిద్దరి భేటీ ముగిసింది. అయితే, మంత్రి నారా లోకేష్‌కి దగ్గుపాటి సన్నిహితుడు అయిన కారణంగానే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో బూతుల ఎమ్మెల్యేకు చంద్రబాబు మద్దతు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం చేస్తున్నారు. తాజా పరిణామాలు కూడా అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీంతో, మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇక, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి రేపటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెడ్ లైన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం నడిబొడ్డున బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఎన్టీఆర్ అభిమానుల ప్రెస్ మీట్‌కి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి మాట్లాడుతూ..‘టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.