
ఎరువులు అడిగిన రైతును ప్రశ్నించిన ఆర్డీవో
6 కిలోమీటర్లు తీసుకెళ్లి తాను సాగుచేస్తున్న పొలం చూపించిన రైతు
సాక్షి, మెళియాపుట్టి: ఎరువులు అందడం లేదని, ఒడిశా వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. ‘నువ్వు రైతువేనా? నువ్వు రైతువని నేనెలా నమ్మాలి?’ అని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి ప్రశ్నించిన ఘటన మెళియాపుట్టిలో శుక్రవారం సంచలనం కలిగించింది. ఆర్డీవో మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేశారు.
ఒకషాపు మూసేసి ఉండటంతో యజమానిని రప్పించి తాళాలు తీయించాలని ఆదేశించారు. ఇంతలో అక్కడే ఉన్న శేఖరాపురం గ్రామానికి చెందిన రైతు ఎన్ని జగన్నాథం.. ‘సార్ నాకు ఒక్క బస్తా ఎరువు మాత్రమే అందింది. ఎరువులు వచ్చేలా చూడండి..’ అని విన్నవించారు. దీనికి ఆర్డీవో స్పందిస్తూ ‘నువ్వు రైతువేనా? నువ్వు రైతువని నేనెలా నమ్మాలి?’ అని అడిగారు. సాగుచేస్తున్న పొలం చూపించాలని కోరారు. దీంతో జగన్నాథం అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శేఖరాపురం గ్రామానికి ఆర్డీవోను తీసుకెళ్లి పొలం చూపించారు.
అక్కడ జగన్నాథం తనకు ఒక ఎకరం భూమి ఉందని, ఏడెకరాలు కౌలుకు చేస్తున్నానని చెప్పారు. దీంతో ఆర్డీవో కౌలు రైతు కార్డు ఉందా? ఈ భూమి నువ్వే చేస్తున్నావనడానికి సాక్ష్యం ఏంటి? అని ప్రశ్నించారు. సార్ గ్రామస్తులను అడగండి సార్.. అని జగన్నాథం సమాధానమిచ్చారు. ఇంతలో గ్రామస్తులు వచ్చి జగన్నాథం ఏడెకరాలు కౌలుకి చేస్తున్నాడు సార్ అని చెప్పారు. దీంతో కౌలు రైతు కార్డు ఏదని ఆర్డీవో అడగడంతో తనకు భూ యజమానులు ఆ అవకాశం ఇవ్వలేదని జగన్నాథం చెప్పారు.
ఒడిశాలో తెలిసినవారి దగ్గర యూరియా తెచ్చుకున్నాం
ఇంతలోనే అక్కడికి మరికొందరు రైతులు చేరారు. వారంతా ఆర్డీవోతో మాట్లాడుతూ ‘సార్ మాకు ఎరువులు అందలేదు. పక్కనే ఒడిశాలో తెలిసిన వారిదగ్గర 5, 6 బస్తాలు తెచ్చుకున్నాం. బస్తా ధర రూ.500 నుంచి రూ.700 వరకు తీసుకున్నారు. శేఖరాపురం రెవెన్యూ గ్రామం జాడుపల్లి వద్ద అధికారులు డంప్ చేస్తున్నారు. అక్కడికి వెళితే జాడుపల్లి గ్రామ రైతులకే పంపిణీ చేస్తున్నారు. మాకు ఒక్కో యూరియా బస్తా ఇచ్చారు. మూడోవిడత ఎరువు వేయాల్సిన సమయం వచ్చింది. ఎలా చేయాలో ఏంటో..’ అంటూ తమ గోడు చెప్పుకొన్నారు. రెండురోజుల్లో మీకు ఎరువులు అందేలా చూస్తానని ఆర్డీవో వారికి హామీ ఇచ్చారు. అయితే రైతునని నిరూపించుకోవడానికి పొలం చూపించాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్నాథం ఆవేదన వ్యక్తంచేశారు.