breaking news
unruly passenger
-
విమానంలో ప్రయాణికుడిని.. కట్టిపారేశారు!
విమానంలో ప్రయాణిస్తుండగా.. మీ పక్కన ఉన్న ప్రయాణికుడు ఉన్నట్టుండి రెచ్చిపోతే ఏం చేస్తారు? ఒకటి రెండు సార్లు చెప్పి చూస్తారు. అప్పటికీ వినకపోతే విమాన సిబ్బందికి చెబుతారు. అయినా ఫలితం లేకపోతే, ఇక అతగాడిని కుర్చీకి కట్టేయడం తప్ప మరో మార్గం ఏమీ ఉండదు. దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చే ఇండిగో విమానంలో సరిగ్గా ఇలాగే జరిగింది. దుబాయ్ నుంచి బయల్దేరిన ఈ విమానంలో ఓ ప్రయాణికుడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. విమానంలోని సెక్యూరిటీ నిబంధనలను పాటించకపోవడంతో పాటు హింసాత్మకంగా మారాడు. అంతేకాదు, విమాన సిబ్బందిని కూడా బెదిరించాడు. దాంతో ఏం చేయాలని సిబ్బంది చీఫ్ పైలట్‌ను అడిగారు. అతడిని కట్టేయమని ఆయన చెప్పడంతో సిబ్బంది అలాగే చేశారు. అతడిని సీటుకు కట్టేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన తర్వాత.. సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అతడు మద్యం మత్తులో అలా చేసి ఉంటాడని భావించిన పోలీసులు.. అతగాడికి ఆల్కహాల్ టెస్టులు చేయిస్తున్నారు. విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో కూడా ఇలాగే జరిగింది. ముంబై నుంచి భోపాల్ వెళ్లే జెట్ ఎయిర్వేస్ విమానాన్ని ఓ పెళ్లి బృందం వాళ్లు దాదాపు హైజాక్ చేసినంత పని చేశారు. సాంకేతిక లోపం వల్ల ఉన్న సీట్ల కంటే ఎక్కువ టికెట్లు బుక్ అయిపోయాయి. అదే నెలలో ఓ ప్రయాణికుడు మద్యం తాగి విమానంలో అల్లరి చేశాడు. సెప్టెంబర్‌లో ఆశారాం బాపు అనుచరులు జెట్ ఎయిర్వేస్ విమానంలో గోలగోల చేశారు. కూర్చోమని చెప్పినా వినకుండా లేచి నిలబడి నినాదాలు చేస్తూనే ఉన్నారు. -
చికాగో విమానం దారి మళ్లింపు
టోక్యో: అమెరికాలోని చికాగో నుంచి చైనా బయల్దేరిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన కారణంగా దారి మళ్లించారు. జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని నరిటా విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానంలో 241 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు. చికాగోకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం చైనాలోని ఓ హరె అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సివుంది. అయితే విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన వల్ల దారి మళ్లించాల్సి వచ్చింది. 12 గంటల తర్వాత విమానం జపాన్ నుంచి చైనాకు బయల్దేరింది.