breaking news
Thellakaagitham Movie
-
'తెల్ల కాగితం' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'తెల్లకాగితం' సినిమా రివ్యూ
థియేటర్లలో విడుదలవడానికి ముందే ఆన్లైన్లో లీకైపోయి వార్తల్లో నిలిచిన లేటెస్ట్ తెలుగు సినిమా 'తెల్లకాగితం'. పలు చిత్రాల్లో బాలనటుడిగా ఆకట్టుకున్న హర్ష్ రోషన్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. 'కోర్ట్'తో హీరోగా హిట్ కొట్టిన ఇతడు చేసిన మరో టీనేజీ 'షాకింగ్' ప్రేమకథే ఈ చిత్రం. నక్షత్ర హీరోయిన్. రమేశ్ బండ్రెడ్డి దర్శకుడు. ఈరోజే(అక్టోబరు 02) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?భీమవరం దగ్గరలోని ఓ పల్లెటూరిలో రాము(హర్ష్ రోషన్).. అన్న,వదినలతో కలిసి బతుకుతుంటాడు. అదే ఊరిలో ఉండే ఆశ(నక్షత్ర).. రాము చదివే స్కూల్లోనే చదువుతూ ఉంటుంది. ఓసారి లంచ్ బాక్స్‌లు మారిపోవడం వల్ల మొదలైన వీరి పరిచయం.. స్నేహంగా మారి ప్రేమలో పడేంతవరకు వెళ్తుంది. ఓ ఏకాంత సందర్భంలో శృంగారంలోనూ పాల్గొంటారు. తెలిసీ తెలియని వయసులో మొదలైన ప్రేమ.. వీళ్ల జీవితాల్ని ఎలాంటి మలుపుల్ని తిప్పింది? చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'ప్రేమ' అనే పాయింట్ ఆధారంగా తెలుగులో ఇప్పటికే కొన్ని వేల సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అయితే ప్రేమకథతో మూవీ తీసి జనాల్ని ఎంటర్టైన్ చేశారా? చెప్పాలనుకున్న మెసేజ్‌ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా ప్రెజెంట్ చేశారా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఈ విషయంలో 'తెల్లకాగితం' టీమ్ పాస్ అయిపోయింది.ఇప్పటి జనరేషన్ టీనేజీ పిల్లలు, మరీ ముఖ్యంగా యువత.. సొంత తల్లిదండ్రులు చెప్పే విషయాల్ని పెడచెవిన పెడుతున్నారు. తామే పెద్దోళ్లలా ఫీలైపోయి ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. పెద్దల దృష్టికి రాకుండా చాలా వాటిని మేనేజ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి వాళ్లు చేసే తప్పులు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో చూపించే ప్రయత్నమే ఈ సినిమా.ఓ పల్లెటూరు.. పదో క్లాస్ చదివే ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య అనుకోకుండా పరిచయం, అది కాస్త ప్రేమగా మారడం.. ఇలా పెద్దగా హడావుడి లేకుండానే సినిమా మొదలవుతుంది. తెరపై చూస్తున్నది కొత్తగా ఏం లేనప్పటికీ కామెడీ, సరదా ప్రేమ సన్నివేశాల కారణంగా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. 'ప్రెగ్నెన్సీ' ట్విస్ట్‌తో ఇంటర్వెల్ పడుతుంది. మరి 'ప్రెగ్నెన్సీ' అనే చిక్కుముడిని సెకండాఫ్‌లో ఎలా విప్పారనేది థియేటర్లలో చూడాలి.సినిమా స్టోరీగా చెప్పుకొంటే జస్ట్ రెండే లైన్లలో తేలిపోతుంది. దీన్ని రెండున్నర గంటల మూవీగా తీశారు. ముఖ్యమైన సన్నివేశాలన్నీ చివర అరగంట కోసం దాచుకోవడం వల్ల అంతకు ముందు రెండు గంటల పాటు కాస్త ఎంటర్టైన్మెంట్, కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కాకపోతే చివరలో ఇచ్చిన షాకింగ్ క్లైమాక్స్ ఎమోషనల్‌గా బాగుంది.ఈ మూవీలో పీరియడ్స్, పుష్పవతి కావడం(మెచ్యూర్), కండోమ్.. ఇలా పలు సున్నితమైన అంశాల గురించి టీనేజీ పిల్లలు ఏమనుకుంటారో కామెడీగా బాగా చూపించారు. అలానే మనకు తెలిసినవాళ్లే కదా నమ్మితే.. ఎంతకు తెగిస్తారో ఇందులో చూపించారు. అలానే జీవితం అనే 'తెల్లకాగితం'పై ఒకసారి మచ్చ పడితే ఎంతలా అల్లకల్లోలం అయిపోతుందో ఈ మూవీలో ప్రెజెంట్ చేశారు.'చెప్పకపోయినా సరే ఆడదాని కష్టం అర్థం చేసుకున్నప్పుడే మగాడు మెచ్యూర్ అయినట్లు' అని రాము వదిన పాత్ర చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. రాము చదువు కోసం ఈమె.. ఏకంగా కడుపులో బిడ్డని వద్దనుకుని ఆబార్షన్ చేయించుకునే సీన్ కూడా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. వదిన పాత్రకు ఇలాంటి సీన్స్ ఇంకొన్ని పడుంటే బాగుండేది అనిపించింది.ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని తల్లిదండ్రులకు నిజాయతీగా చెప్పేస్తే వాళ్లు ఎలాగోలా పరిష్కరిస్తారు. మనల్ని అపాయం నుంచి తప్పిస్తారు. అలా కాదని వాళ్లని వీళ్లని అడిగితే తప్పు మీద తప్పులు జరుగుతాయి. అలానే దారుణమైన పరిస్థితుల వరకు ఎలా వెళ్తుందో కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. టీనేజీ పిల్లలు, తల్లిదండ్రులు ఈ చిత్రం తప్పక చూడాలి!ఎవరెలా చేశారు?బాలనటుడిగా, 'కోర్ట్' సినిమాతో హీరోగా ఆకట్టుకున్న హర్ష్ రోషన్.. ఇందులో రాముగా ఆకట్టుకున్నాడు. తెలియని పసితనంతో ప్రేమలో పడటం, తప్పులు చేయడం, చివరకు రియలైజ్ కావడం లాంటి సీన్స్‌లో మెప్పించాడు. ఆశ పాత్రలో నటించిన నక్షత్రకు ఇదే తొలి మూవీ. చూడటానికి అందంగా ఉంది గానీ ఎమోషనల్ సన్నివేశాల్లో తేలిపోయింది. ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది. ఆశ తండ్రి మూర్తిగా అజయ్, రాము అన్న వదినలుగా చేసినవాళ్లు, అలానే మామయ్య క్యారెక్టర్ చేసిన రాజ్ కసిరెడ్డి తదితరులు బాగా నటించారు. కాకపోతే వీళ్లకు చివరి పావుగంటలోనే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది.టెక్నికల్ విషయాలకొస్తే.. దర్శకుడు రమేశ్ బండ్రెడ్డి, టీనేజీ పిల్లలు, యువతకు చెప్పాలనుకున్న పాయింట్ తెరపైకి కన్వే అయింది. కాకపోతే క్లైమాక్స్‌లోనే కాకుండా అంతకు ముందు సీన్స్ ఇంకాస్త కనెక్ట్ అయ్యేలా రాసుకుని తీసుంటే బాగుండేది. విజయ్ బుల్గానిన్ అందించిన 'చిలక' పాట వినసొంపుగా ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఓవరాల్‌గా ఇదో డీసెంట్ మూవీ.- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘తెల్ల కాగితం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘నక్షత్ర’ ఫొటోలు వైరల్
-
‘ది ప్యారడైజ్’కి పోటీగా 6 సినిమాలు.. ఇదీ టాలీవుడ్ పరిస్థితి!
‘ఒకటి పోతే మరొకటి’ అన్నట్టుగా టాలీవుడ్లో ఒక వారం మారగానే కొత్త సినిమాల సందడి మొదలవుతోంది. ఒక వారం స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే.. మరో వారం చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు పోటీకి దిగుతున్నాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకుల తీర్పే అంతిమం. గత వారం ‘ది ప్యారడైజ్’ హవాతో థియేటర్లు కళకళలాడగా.. ఈ వారం(అక్టోబర్ 2) మాత్రం ఏకంగా ఆరు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఎవరి సినిమా ఎంతవరకు నిలబడుతుందనే ఆసక్తి నెలకొంది.గతవారం అంతా టాలీవుడ్లో ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరిగింది. ప్రీమియర్ షోలతో మొదలైన హంగామా ఆదివారం వరకు కొనసాగింది. సినిమా టాక్, కలెక్షన్లు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్.. ఇలా ట్రేడ్ వర్గాల్లో లెక్కలు జోరుగా సాగాయి. ‘లెక్కలు తేలితే గానీ అసలు సంగతి తెలియదు’ అన్నట్టుగా ఈ సినిమా విషయంలోనూ వసూళ్లపై చర్చ కొనసాగుతూనే ఉంది.(చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)అయితే ఇప్పుడు కొత్త వారం వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ బరిలోకి కొత్త సినిమాలు అడుగుపెడుతున్నాయి. ఈ వారం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘సిగ్మా’, ‘తెల్లకాగితం’, ‘అనకాపల్లి’, ‘ప్రేమ అనే ఊరిలో’ వంటి తెలుగు సినిమాలతో పాటు ‘డొరోతి’ అనే డబ్బింగ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఫహాద్ ఫాజిల్ సినిమాపైనే అందరి చూపుఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’పై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరు కానుండటంతో మూవీపై మరింత బజ్ వచ్చే అవకాశం ఉంది. ఫహాద్ ఫాజిల్ నటనతో పాటు సినిమా కాన్సెప్ట్, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.విజయ్ తనయుడి ‘సిగ్మా’పై ఆసక్తిమరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’**పై కూడా ప్రేక్షకుల దృష్టి ఉంది. దర్శకుడిగా సంజయ్ తొలి అడుగు కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. కొత్త దర్శకుడి ఆలోచన ఎలా ఉండబోతుంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనే చర్చ కూడా జరుగుతోంది.‘తెల్లకాగితం’కు పాజిటివ్ బజ్ఈ వారం వస్తున్న మరో సినిమా ‘తెల్లకాగితం’. విడుదలకు ముందే ఈ సినిమాను పలువురు దర్శకులకు చూపించి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్‌పై పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.కంటెంట్ వర్కవుట్ అయితే చిన్న సినిమా కూడా పెద్ద ప్రభావం చూపించగలదనేది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అందుకే ‘తెల్లకాగితం’పై కూడా ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తే మరోసారి ‘కోర్ట్’ తరహా కంటెంట్ సినిమాలకు మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంది.‘డొరోతి’పై వివాదాల ప్రభావం?ఇక ఈ జాబితాలో డబ్బింగ్ సినిమా ‘డొరోతి’ కూడా ఉంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై తమిళంలో ఇప్పటికే వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఆ చర్చ తెలుగు వెర్షన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.‘పారడైజ్’ రెండో వారం కీలకంకొత్త సినిమాల సందడి ఒకవైపు ఉంటే.. మరోవైపు ఇప్పటికే బాక్సాఫీస్ బరిలో ఉన్న ‘ది ప్యారడైజ్’కు ఈ వారం చాలా కీలకం. మొదటి వారం హడావుడి పూర్తయిన తర్వాత రెండో వారంలో సినిమా ఎంత నిలబడుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.సోమవారం కూడా సినిమాకు నిలకడైన వసూళ్లు కనిపించడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెండో వారంలోనూ మంచి కలెక్షన్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్‌కు మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్లో కొత్త సినిమాల పోటీని తట్టుకుని ‘పారడైజ్’ ఎంత వసూళ్లు సాధిస్తుందనేది కీలకంగా మారింది. -
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)
-
‘తెల్లకాగితం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మగాళ్లు మెచ్యూర్ అవ్వరా?.. తెల్లకాగితం ట్రైలర్ వచ్చేసింది
కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ తెల్ల కాగితం. ఈ సినిమాకు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నక్షత్ర హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే టీనేజ్ ప్రేమకథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తెలిసి తెలియని వయసులో చేసే ప్రేమ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారనే కోణంలో ఈ కథను రూపొందించినట్లు ట్రైలర్లో అర్థమవుతోంది. పాఠశాలలో మొదలైన లవ్ చివరికీ ఏమైందనేదే ఈ తెల్లకాగితం స్టోరీగా ట్రైలర్లో చూపించారు. ఒక్క చిన్న తప్పు.. తెల్లటి కాగితం లాంటి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే డైలాగ్ కథపై ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీమందించారు. ఈ మూవీ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.


