Telangana Rashtra Sena
-
BRS Party: కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి పార్టీ నేటితో 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆవిర్భావ వేడుకల దృష్ట్యా ఆ పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 11గం.కు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఎగరేయనున్నారు. మధ్యాహ్నాం అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారో? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కొంతకాలంగా నిశబ్దంగా ఉండిపోయిన ఆయన.. మొన్నటి జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉరిమారు. తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా కూడా వ్యక్తం చేశారు. అయితే కొత్త సవాళ్లపై ఆయన స్పందిస్తారా?.. పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో? అనే కుతూహలం ఇప్పుడు నెలకొంది.తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కూతురు కవిత టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట కొత్త పార్టీ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని.. అందుకే తాను టీఆర్ఎస్ పెట్టి యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారామె. అదే సమయంలో ఆమె నేరుగా ‘తెలంగాణ తొలి సీఎం విఫలం’, ‘సారు మారిపోయారు’.. ‘ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్’ అంటూ నేరుగా తండ్రిపైనే విమర్శలు గుప్పించారు. కవిత పార్టీపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పరోక్షంగా సెటైర్లు వేసింది. కానీ ఆ పార్టీ నేతలెవరూ ఆమె ఆరోపణలపై స్పందించింది లేదు. ఈ తరుణంలో ఇటు పార్టీ శ్రేణులు సైతం ‘‘సారు ఏం మాట్లాడతారో..? కవిత విమర్శలకు స్పందిస్తారా? లేదంటే కేవలం కాంగ్రెస్ సర్కార్‌పైనే ధ్వజమెత్తుతారా?? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ సమావేశం తర్వాత కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉండొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. -
రాష్ట్రంలో కర్కోటకుడి పాలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్ఎస్) పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో శనివారం కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండాపై కవిత ప్రసంగించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పి సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, కేసీఆర్ మన మనిషిలా కాకుండా ‘మర మనిషి’లా తయార య్యాడన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనలో తాను భాగస్వామిగా ఉండటం పట్ల క్షమాపణలు కోరారు. తన తప్పును సరిదిద్దుకునేందుకు కొత్త పార్టీతో ప్రజల ముందుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతి, అవినీతిపై పాంచజన్యం పూరిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... ఈనాటి కేసీఆర్ మర మనిషి.. ‘గుంటనక్కలు, తోడేళ్ల నడుమ ఖైదీ అయిన కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు.. మారిన మనిషి, ఆత్మలేని మర మనిషి. ప్రజలకు కష్టాలు వచ్చినా ఆ సారు.. రారు. గుంటనక్కలు, తోడేళ్ల నడుమ బందీ అయ్యారు. తెలంగాణ ప్రజలను పట్టించుకోకుండా జాతీయ పార్టీ అంటూ పంజాబ్, గుజరాత్, బిహార్‌కు వెళ్లారు. కేసీఆర్‌కు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం ముందు ప్రజల మీద మమకారం పోయిందా. కేసీఆర్ నాకు తండ్రి అయినా రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారు, కేటీఆర్‌కు పెద్దగా ఏమీ తెలియదు. ప్రజలు తప్పు చేశారని అంటున్న కేసీఆర్.. రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తున్నా బయటకు రావడం లేదు. నా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి చెప్పిస్తారు. ఉద్యమకారులకు జరిగిందే నాకు జరిగింది ‘నాడు ఉద్యమకారులకు జరిగిందే.. ఇప్పుడు నాకు జరిగింది. కేసీఆర్ కోసం ఇళ్లు, భూములు అమ్ముకున్న వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. మనల్ని లాఠీలతో కొడితే తల్లి కోడిలా కాపాడుకోవాల్సిన కేసీఆర్ ఎక్కడ పోయిండు. అవినీతి పేరిట నన్ను సస్పెండ్ చేసి అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు. అందుకే కేసీఆర్‌కు ఎదురు నిలిచి కొట్లాడేందుకు పార్టీతో వస్తున్నా. ఇక ముందున్నది ముసళ్ల పండుగ. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల కలలు నిజం కాలేదు. రాజకీయ శక్తితో ప్రజాపోరాటాలు మిళితం చేసి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తాం. బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ ఆత్మ కోల్పోయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. తెలంగాణలోని మూడున్నర కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణితి చెందాలని అనుకుంటున్నా. రాష్ట్రంలో కర్కోటకుడి పాలన రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. వెలుగుమట్లలో అనుమతులు ఉన్న ఇళ్లను కూలగొడితే గర్భిణికి అబార్షన్ అయింది. గురుకులాల్లో విషం పెట్టి పిల్లలను చంపితే సీఎం పట్టించుకోవడం లేదు. కర్ల రాజేశ్ మృతికి కారకులపై హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ కేసులు కూడా పెట్టించలేకపోయారు. కాంగ్రెస్ మీద కచ్చితంగా మనమే పోరాటం చేస్తాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం. రాహుల్‌ను ప్రధాని చేసేందుకు కాంగ్రెస్, పెద్దసారును ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసి చిన్నసారును సీఎం చేసేందుకు బీఆర్ఎస్, దేశంలో సామాజిక న్యాయాన్ని ఖతం చేసేందుకు బీజేపీ పనిచేస్తున్నాయి. తెలంగాణ రావడం ఇష్టంలేని బీజేపీ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాక్ విభజనతో పోలుస్తున్నా రాష్ట్ర బీజేపీ బానిస ఎంపీలు మాట్లాడటం లేదు. పాంచజన్యం పూరిస్తున్నా.. తెలంగాణ రాష్ట్ర సేన ఐదు అంశాలపై పాంచజన్యం పూరిస్తోంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాం. ఊరికో బడి, తరగతికో ఉపాధ్యాయుడు ఉండేలా చూస్తా. మీ అమ్మలా జేబు చూడకుండా కడుపు చూస్తా. ప్రభుత్వ కార్యాలయాల్లో రైతులను గౌరవించే వ్యవస్థ ఉంటుంది. యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ఉపాధి కోసం ఆర్థిక సాయం అందిస్తా. అధికారంలోకి వస్తే ఒకే నోటిషికేషన్ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు, ఉద్యమకారుల కోసం లక్ష సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టిస్తాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పనిచేస్తాం’ అని కవిత చెప్పారు. పసుపు.. నీలం.. ఆకుపచ్చ కల్వకుంట్ల కవిత శనివారం తన కొత్త పార్టీ పేరుతోపాటు జెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీ జెండాలో పసుపు, నీలం, అకుపచ్చ రంగుల్లో పార్టీ జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక చిత్రపటం పొందు పరిచారు. జెండా మధ్యలో ఇంగ్లిషు అక్షరాల్లో టీఆర్ఎస్ పేరును చేర్చారు. సుమారు 50 నిమిషాలపాటు కవిత ప్రసంగం సాగింది. కార్యకర్తలు ఇచ్చిన పాంచజన్యం (శంఖం)ను పూరించారు. సభలో పాల్గొనేందుకు వచ్చిన వారు ఏఐ టెక్నాలజీ సాయంతో గ్రీన్‌మ్యాట్‌పై కవితతో కలిసి ఉన్నట్లుగా ఫొటోలు దిగారు. కవిత కుమారుడు ప్రజల మధ్య కూర్చొని తల్లి ప్రసంగాన్ని ఏకాగ్రతతో వింటూ కనిపించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, సింగరేణి కార్మికులు సహా అన్నీ వర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, యువత నడుమ సభ ఉత్సాహభరితంగా సాగింది. ‘టీ’ ఆకారంలో ఏర్పాటు చేసిన సభా వేదిక ప్రజలను ఆకర్షించింది. సభకు వచ్చిన ప్రతినిధులకు తెలంగాణ వంటకాలతో భోజనాలు పెట్టారు. -
రాజకీయ కవితావేశం!
అంగ వంగ కళింగ రాజ్యాలను ఏకకాలంలో వచ్చేనెల నుంచి బీజేపీ పరిపాలించబోతున్నదని ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా చెప్పారు. ఇప్పటికే అంగ (బిహార్), కళింగ (ఒడిషా) రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. మొన్న తొలివిడత పోలింగ్ జరిగిన వంగ (బెంగాల్) రాష్ట్రంలో కూడా తాము అధి కారంలోకి రాబోతున్నామని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీస్తుపూర్వం కాలంలో తూర్పు భారతాన ప్రవర్ధిల్లిన మూడు ముఖ్య రాజ్యాలను ఉటంకిస్తూ చారిత్రక కోణంలో ఆయనీ వ్యాఖ్యానం చేసి ఉంటారు. కళింగ యుద్ధంలో రక్తపుటే రులు పారించిన అనంతరం అశోక చక్రవర్తి తన దండయాత్రలకు స్వస్తిపలికి బౌద్ధ ధర్మ బోధనకు అంకితమయ్యారు. రికార్డు స్థాయిలో ఓట్ల వరద పారించిన వంగ యుద్ధంలో ఒకవేళ గెలిస్తే రాష్ట్రాలపై బీజేపీ దండయాత్రలు ముగిసిపోతాయా? అటువంటి అవకాశం ఏమాత్రం లేదని చెప్పవచ్చు.దక్షిణ భారతావని ఇంకా కాషాయ ఛత్రఛాయలోకి పూర్తిగా చేరనేలేదు. ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ గెలుస్తూ, ఓడుతూ వస్తున్నది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆ కూటమిలో బీజేపీ జూనియర్ భాగస్వామి మాత్రమే. పైగా ఆ కూటమి గెలిచే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. ఏపీ కూటమి సర్కార్‌లో కూడా బీజేపీది చిన్న వాటానే. తొలిదశలో పోలింగ్ జరిగిన కేరళం ఈసారి కూడా బీజేపీకి కొరుకుడు పడలేదని వార్తలొస్తున్నాయి. మహా అయితే ఒకటి రెండు సీట్లు గెలవవచ్చనే అభిప్రాయం వినబడుతున్నది. బీజేపీ టార్గెట్ లిస్ట్‌లో అంగ వంగ కళింగల తర్వాత త్రిలింగ రాష్ట్రమున్నదనే వార్తలు చాలాకాలంగా వినిపి స్తున్నాయి. తెలంగాణకు ఆ పేరు ఎలా వచ్చిందనే అంశంపై ఉన్న రకరకాల వాదనల్లో త్రిలింగ వాదన కూడా ఒకటి కావడం తెలిసిన విషయమే.దక్షిణాన తెలంగాణతో పాటు, ఉత్తరాన పంజాబ్ కూడా ఇప్పుడు బీజేపీకి తక్షణ లక్ష్యాలు. పంజాబ్‌లో బీజేపీ ఆపరేషన్ నిన్ననే బయటపడింది. అక్కడి పాలక పక్షమైన ఆప్ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా గాలం వేసి లాగేసింది. తెలంగాణ ఆపరేషన్ ఏ రూపంలో ఉంటుందో ఇంకా తేలవలసి ఉన్నది. సరిగ్గా ఇదే సందర్భంలో ఈరోజు (శనివారం) కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ పరిణామానికీ, బీజేపీ తెలంగాణ వ్యూహానికీ ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు. కానీ కవిత పార్టీ కారణంగా బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకైనా నష్టం జరిగితే అంతవరకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు బీజేపీకి మెరుగవుతాయి. కొత్త పార్టీ ప్రారంభ కార్యక్రమాన్ని కవిత ఘనంగానే నిర్వహించారు. ప్రారంభం రోజున అన్ని ప్రధాన దినపత్రికల్లో భారీ ప్రకటనలు కనిపించాయి. ముఖ్యమైన వార్తా ఛానెళ్లన్నీ ఆమె ప్రసంగాన్ని లైవ్‌గా కవర్ చేశాయి. ఎక్కడా పార్టీకి వనరుల కొరత ఉన్నట్టు అనిపించలేదు. బలమైన వ్యవస్థలే ఆమె వెనుక ఉండవచ్చన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌తో రాజకీయ విరోధంతోపాటు వ్యక్తిగత వ్యతిరేకత ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లకోసం డబ్బులిస్తూ వీడియో సాక్షిగా రేవంత్, ఆడియో సాక్షిగా చంద్రబాబు దొరికిపోయిన ఉదంతం పాఠకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థం రోజున రేవంత్ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్‌పై పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదిలేసుకొని చంద్రబాబు కరకట్ట నివాసానికి పరుగు పెట్టవలసి వచ్చింది. మధ్యవర్తుల మంత్రాంగంతో ఆ కేసు అప్పటితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జరిగిన అవమానాన్ని మరిచిపోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా రాహుల్ గాంధీతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కర్ణాటక, గుజరాత్ ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్‌కు ఆర్థిక సహాయం చేశారన్న వార్తలు కూడా వచ్చాయి.ఓటుకు నోటు కేసు చల్లబడిన కొన్నాళ్లకే చంద్రబాబుకు తెలంగాణ సహచరుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్రెడ్డిని ఇరుకున పెట్టడం కోసం ఆయన చెల్లెలు షర్మిల ఆశలను అవకాశంగా తీసుకొని తొలుత తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేయించి, కేసీఆర్‌ను నానాతిట్లు తిట్టించిన తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రతిష్ఠించారనీ, జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తదనంతరం ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఇన్నాళ్లకు కేసీఆర్ కూతురు తండ్రితో విభేదించి సొంతంగా పార్టీని ప్రకటించింది. ఈ పరిణామాన్ని రేవంత్ సర్కార్ సహజంగానే రాజకీయ అవకాశంగా మలుచుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలనిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు సగం పుణ్యకాలం పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని వార్తలొస్తున్నాయి. అదే సందర్భంలో కేసీఆర్ పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతున్నదని చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో కవిత సొంత పార్టీని స్థాపించి తండ్రిపైనే నేరుగా విమర్శలను ఎక్కుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. తాను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తండ్రిపైనే కవిత చేస్తున్న విమర్శలపై జనం ఎలా స్పందిస్తారనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. కవితకు మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించాయి. ఇవే లక్షణాలు కేటీఆర్‌లో కూడా పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. తన కుటుంబం నుంచి ఇంతమంది సమర్థులైన నాయకులు రావడం కేసీఆర్‌కు లాభమా నష్టమా అనేసంగతి తేలవలసి ఉన్నది.ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రకటించడం, తన లక్ష్యాలను వివరించడం అభినందించదగ్గ విషయమే. ఈ పరిణామాన్ని ఆహ్వానించ వలసిందే. ఆమె పార్టీ స్థాపన వెనుక రహస్య ఎజెండా ఉన్నదా, ఆమె వెనుక ఎవరున్నారనే చర్చ ముందుగానే చేయడం అనవసరం. అటువంటివేమైనా ఉంటే కాలక్రమంలో అవే బయటకొస్తాయి. అయితే ఆమె ప్రకటించిన ఎజెండా అంశాల మీద, వాటి ఆచరణ సాధ్యాసాధ్యాల మీద చర్చ జరగవలసిందే. ఆమె తన తొలి ప్రసంగంలోనే అధికార పార్టీపై కంటే తన తండ్రి పార్టీపైనే ఎక్కువ దాడిని ఎందుకు చేశారనే విషయంలో విశ్లేషణలు చేయవచ్చు. బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తే ఆ స్థానం తన పార్టీకి దక్కుతుందని ఆమె విశ్వసిస్తున్నారా? అదే స్థానం కోసం పావులు కదుపుతున్న బీజేపీకి ఆమె కళ్లెం వేయగలరా? ప్రతి పక్షాల మూడు ముక్కలాటలో అధికార పార్టీకి లాభం జరగడం ఆమెకు సమ్మతమేనా? కవిత జనంలోకి వెళ్తున్న క్రమంలో నెమ్మదిగా ఇటువంటి సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు.ఇప్పుడు ప్రతిపక్షం మనమే, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది కూడా మనమేనని పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రక టించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా నిర్ణయించడంలోనే ఆమె టార్గెట్ ఎవరో అర్థమవుతున్నది. పాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, ఉద్యమ రథం దారి తప్పిందని, కేసీఆర్ ఇప్పుడు మరమనిషిగా మారిపోయారని ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడం వల్ల గత ఉద్యమ ఉత్తేజంతో కొత్త పార్టీ బలం పుంజుకుంటుందని ఆమె నమ్ముతుండవచ్చు. ఎవరి నమ్మకాలు వారివి! ప్రజలను నమ్మించడంలోనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.తన లక్ష్యాలను వివరిస్తూ ఆమె పాంచజన్యం పూరించారు. తాను చేసిన ఐదు ప్రధాన హామీలకు ఆమె ‘పాంచజన్యం’ అనే పేరు పెట్టుకున్నారు. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం,ఒక్క నోటిఫికేషన్‌తో యువకులకు నాలుగు లక్షల ఉద్యోగాలు,అందులో ఉద్యమకారులకే లక్ష ఉద్యోగాలు, సామాజిక న్యాయంతో సబ్బండ వర్ణాల సంక్షేమం, వ్యవసాయంలో రైతునే రాజుగా చేయడం... ఆమె ప్రకటించిన పాంచజన్యంలోని ఐదు హామీలు. బీజేపీని రిమోట్ కంట్రోల్‌తో నడిపించే ఆరెస్సెస్ సిద్ధాంత గ్రంథం పేరు కూడా పాంచజన్యమే. వారి గురువు గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ తెలుగు అనువాదం పేరు పాంచజన్యం. ఇప్పుడు బీఆర్ఎస్ను ఫినిష్ చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న బీజేపీ పాంచ జన్యాన్ని మించి కవిత పాంచజన్య శంఖారావం వినిపించవలసి ఉంటుంది.ఐదు హామీలూ ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని ఏరకంగా ఆచరణ సాధ్యం చేయగలరో వివరించి చెప్పవలసిన బాధ్యత కొత్త టీఆర్ఎస్ అధ్యక్షురాలిపై ఉంటుంది. రైతుబంధు, మిషన్ కాకతీయ వంటి కేసీఆర్ పథకాలను తెలంగాణ రైతాంగం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వాటి కంటే మిన్నగా ఏరక మైన ప్రతిపాదనను ఆమె ముందుకు తీసుకొని వస్తారో ఎదురు చూడవలసి ఉన్నది. సామాజిక న్యాయం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక అరిగిపోయిన రికార్డుగా మారింది. తెలంగాణలో అత్యధిక జనాభా గల కులంగా ఉన్న మాదిగ వర్గానికి చెందిన విశారదన్ మహారాజ్ తన ఎజెండాతో ఇప్పుడు ఎస్సీ లతోపాటు, ఎస్టీ, బీసీ యువతను విశేషంగా ఆకర్షించగలుగు తున్నారు. విశారదన్ కంటే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని కవిత రూపొందించగలిగితేనే ఆమె సామాజిక న్యాయ నినాదం సార్థకమవుతుంది. ఇటువంటి ఎన్నో సవాళ్లకు వెరవకుండా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన కవితకు శుభాకాంక్షలు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రేపటి నుంచి చూస్తరు.. నా పని ఎట్లా ఉంటదో.. కవిత మాస్ వార్నింగ్
-
అధికారంపై కవిత ధీమా, సీఎం కర్కోటకుడు అంటూ విమర్శలు
-
కవిత టీఆర్ఎస్ ప్రకటన.. బీఆర్ఎస్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్ ప్రకటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరు ప్రస్తావన లేకుండానే బీఆర్ఎస్ సెటైరికల్‌గా వ్యాఖ్యలు చేసింది.టీఆర్ఎస్ పేరుతో కవిత ఏర్పాటు చేసిన పార్టీపై బీఆర్ఎస్ స్పందించింది. బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి.. ఆ పార్టీ పేరు చెప్పకుండానే ట్రోలింగ్ చేసింది. ఇందులో ఒరిజినల్, నకిలీ కోల్గేట్, బిస్లరీ వాటర్ బాటిల్స్ ఫొటోలను పెట్టింది. ఈ సందర్భంగా ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! అని కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! pic.twitter.com/YBlx20tlRf— BRS Party (@BRSparty) April 25, 2026అయితే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన పల్లిలో బీఆర్ఎస్ కారకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత నష్టపోయాం. మళ్లీ టీఆర్ఎస్గా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తా. మేం తప్పులు చేశాం.. అందుకే ఓడిపోయాం. తల్లిదండ్రులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు.. బాధపెట్టొద్దు. కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిది.. ఓట్లు వేయాలి కదా. మాకు ఏ పార్టీతో పొత్తులు ఉండవు’ అని స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రకటన వచ్చిన కొద్ది రోజుల్లో కవిత ఇలా కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్గా ముందుకు తీసుకు రావడం గమనార్హం. -
కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మేడ్చల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట శనివారం కొత్త పార్టీ ప్రకటించిన ఆమె.. ఆయన మారిపోయారని, రాజకీయ పరిణతి కోల్పోయారంటూ వ్యాఖ్యానించారు. ఆనాటి కేసీఆర్ వేరు..ఈనాటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. ఈనాటి కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి. ఏ కష్టమొచ్చినా ఆ సార్ ఇప్పుడు రారు.. ఎందుకంటే ఆయన మరమనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ అయ్యారు. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సరిగా పాలించలేదు. అందుకే సరైన ఫలితాలు రాలేదు. ఇప్పుడు పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన ఆయన ఏం చేస్తున్నారు?. గతంలో టీఆర్ఎస్ కోసం ఆస్తులు అమ్ముకుని పని చేశారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఉద్యమకారుల్ని ఇబ్బంది పెడుతుంటే పార్టీ అధినేత ఆనాడు ఎందుకు స్పందించలేదు. కేసీఆర్ హయాంలో ఒక్క ఉద్యమకారుడికి కూడా పదవి దక్కలేదు. దీనిపై ఆనాడే నేను పోరాడాల్సి ఉండేది. అదే నా తప్పైంది. ఆనాడు ఉద్యమకారులకు జరిగిందే ఇవాళ నాకు జరిగింది.. బీఆర్ఎస్ పార్టీలో అమ్మతనం పోయింది.. మమకారం పోయింది. ఆయన మన కేసీఆర్ కాదు.. మారిన కేసీఆర్. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు. మన కేసీఆర్ అయ్యింటే తెలంగాణ బిడ్డలు కష్టపడి బయటకు వచ్చేవారు. మారుతారామోనని చూశా కానీ నన్నే సస్పెండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నేను చెప్పడమే తప్పా?. తప్పు చేయని నన్ను పార్టీ నుంచి పంపించేశారు. నా బిడ్డ, కొడుకు తప్పు చేస్తే తీసేస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పారు. అవినీతి జరిగిందన్నందుకు నన్నే బయటకు పంపించేసి.. అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్నారు. ఆయన మారిపోయారు కాబట్టే నేను యుద్ధం చేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే ముందుంది ముసళ్ల పండుగ’’ అంటూ కవిత ప్రసంగించారు.ఇదీ చదవండి: అందుకే మన పార్టీ పేరు టీఆర్ఎస్సీఎం రేవంత్‌పై.. ఇప్పుడు ఉన్న సీఎం కర్కోటకుడిలా వ్యహరిస్తున్నాడు. ఒక రాజకీయ నాయకుడిని అలా అనడం సరికాదు. కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే అలా అనాల్సి వస్తోంది అంటూ సీఎం రేవంత్‌పై కవిత విమర్శలు గుప్పించారు. బీజేపీపై.. బీజేపీకి తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. మెడ మీద తలలేని ఓ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాక్‌తో పోల్చాడు. బీజేపీ బానిస ఎంపీలు ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. ఆ పార్టీ ఎంపీలకు చేతనైతే ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చూడండి అంటూ సవాల్ విసిరారామె. -
కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. కల్వకుంట్ల కవిత శనివారం కొత్త పార్టీ ప్రకటించారు. తన పార్టీకి టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన)గా ఆమె నామకరణం చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సభ వేదికగా ఈ ప్రకటన వెలువడింది. పార్టీ ప్రకటన అనంతరం ఆమె మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించా. నాకు సింగరేణి అంటే చాలా ఇష్టం. తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదే. బతుకమ్మతో తెలంగాణ సంస్కృతిని చాటాం. బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి బలమైన సాంస్కృతి పునాది వేసింది జాగృతి. అయితే వచ్చిన తెలంగాణ ఎక్కడో దారి తప్పింది. .. 12 ఏళ్లు గడిచినా తెలంగాణ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైంది. తెలంగాణ ఆనాడు పాలించిన కుటుంబంలో నేను భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా. ఆనాడు ఇసుక మాఫియా ఎన్నో దారుణాలకు పాల్పడింది. అలాగే తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు మాత్రం గర్వపడుతున్నా. తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి. కేసీఆర్ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ తప్పు సరిదిద్దుకునేందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన(TRS)తో మీ ముందుకు వచ్చాను. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. మంచి చేయాలంటే రాజకీయ పార్టీ ఉండాలి. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి అమ్మగా మారాలనుకుంటున్నా. బిడ్డల కష్టం అమ్మకే తెలుస్తుంది. అప్పుడే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరతాయి’’ అంటూ ప్రసంగించారామె. పాంచజన్య హామీలు..తెలంగాణలో ఉన్న మూడు పార్టీలు అధర్మం, అవినీతి, బంధు ప్రీతితో నిండిపోయాయి. ఎంతో మంది ఎన్నో మాట్లాడారు.. కానీ మనకు ఏమీ చేయలేదు. ఆ మూడు పార్టీలపై మన టీఆర్ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) తరఫున పాంచజన్యం పూరిద్దాం. ప్రస్తుతం మనమే ప్రధాన ప్రతిపక్షం. మరో రెండేళ్లలో మనదే అధికార పక్షం. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. అవతలి వాడు మనవాడైనా సరే యుద్ధం చేస్తా. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం.. ఈ ఐదు అంశాలపైనే నా పోరాటం అంటూ పాంచ్జన్యం పేరిట ఐదు హామీలను కవిత ప్రకటించారు.ఇదీ చదవండి: మళ్లీ టీఆర్ఎస్గా బీఆర్ఎస్.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు


