రాష్ట్రంలో కర్కోటకుడి పాలన | TRS Leader Kavitha Fires On Congress Govt | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కర్కోటకుడి పాలన

Apr 26 2026 2:46 AM | Updated on Apr 26 2026 2:46 AM

TRS Leader Kavitha Fires On Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్‌ఎస్‌) పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండాపై కవిత ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పి సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, కేసీఆర్‌ మన మనిషిలా కాకుండా ‘మర మనిషి’లా తయార య్యాడన్నారు. బీఆర్‌ఎస్‌  కుటుంబ పాలనలో తాను భాగస్వామిగా ఉండటం పట్ల క్షమాపణలు కోరారు. తన తప్పును సరిదిద్దుకునేందుకు కొత్త పార్టీతో ప్రజల ముందుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతి, అవినీతిపై పాంచజన్యం పూరిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... 

ఈనాటి కేసీఆర్‌ మర మనిషి..  
‘గుంటనక్కలు, తోడేళ్ల నడుమ ఖైదీ అయిన కేసీఆర్‌ ఇప్పుడు మన మనిషి కాదు.. మారిన మనిషి, ఆత్మలేని మర మనిషి. ప్రజలకు కష్టాలు వచ్చినా ఆ సారు.. రారు. గుంటనక్కలు, తోడేళ్ల నడుమ బందీ అయ్యారు. తెలంగాణ ప్రజలను పట్టించుకోకుండా జాతీయ పార్టీ అంటూ పంజాబ్, గుజరాత్, బిహార్‌కు వెళ్లారు. కేసీఆర్‌కు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం ముందు ప్రజల మీద మమకారం పోయిందా. కేసీఆర్‌ నాకు తండ్రి అయినా రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారు, కేటీఆర్‌కు పెద్దగా ఏమీ తెలియదు. ప్రజలు తప్పు చేశారని అంటున్న కేసీఆర్‌.. రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తున్నా బయటకు రావడం లేదు. నా ప్రశ్నలకు బీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి చెప్పిస్తారు. 

ఉద్యమకారులకు జరిగిందే నాకు జరిగింది 
‘నాడు ఉద్యమకారులకు జరిగిందే.. ఇప్పుడు నాకు జరిగింది. కేసీఆర్‌ కోసం ఇళ్లు, భూములు అమ్ముకున్న వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. మనల్ని లాఠీలతో కొడితే తల్లి కోడిలా కాపాడుకోవాల్సిన కేసీఆర్‌ ఎక్కడ పోయిండు. అవినీతి పేరిట నన్ను సస్పెండ్‌ చేసి అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు. అందుకే కేసీఆర్‌కు ఎదురు నిలిచి కొట్లాడేందుకు పార్టీతో వస్తున్నా. ఇక ముందున్నది ముసళ్ల పండుగ. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల కలలు నిజం కాలేదు. రాజకీయ శక్తితో ప్రజాపోరాటాలు మిళితం చేసి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తాం. బీఆర్‌ఎస్‌ అనే పార్టీ తెలంగాణ ఆత్మ కోల్పోయింది. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. తెలంగాణలోని మూడున్నర కోట్ల మందికి ఒక అమ్మలాగా పరిణితి చెందాలని అనుకుంటున్నా.  

రాష్ట్రంలో కర్కోటకుడి పాలన 
రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. వెలుగుమట్లలో అనుమతులు ఉన్న ఇళ్లను కూలగొడితే గర్భిణికి అబార్షన్‌ అయింది. గురుకులాల్లో విషం పెట్టి పిల్లలను చంపితే సీఎం పట్టించుకోవడం లేదు. కర్ల రాజేశ్‌ మృతికి కారకులపై హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌ కేసులు కూడా పెట్టించలేకపోయారు. కాంగ్రెస్‌ మీద కచ్చితంగా మనమే పోరాటం చేస్తాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం. రాహుల్‌ను ప్రధాని చేసేందుకు కాంగ్రెస్, పెద్దసారును ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసి చిన్నసారును సీఎం చేసేందుకు బీఆర్‌ఎస్, దేశంలో సామాజిక న్యాయాన్ని ఖతం చేసేందుకు బీజేపీ పనిచేస్తున్నాయి. తెలంగాణ రావడం ఇష్టంలేని బీజేపీ రాష్ట్ర ఏర్పాటును భారత్‌ పాక్‌ విభజనతో పోలుస్తున్నా రాష్ట్ర బీజేపీ బానిస ఎంపీలు మాట్లాడటం లేదు.  

పాంచజన్యం పూరిస్తున్నా.. 
తెలంగాణ రాష్ట్ర సేన ఐదు అంశాలపై పాంచజన్యం పూరిస్తోంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాం. ఊరికో బడి, తరగతికో ఉపాధ్యాయుడు ఉండేలా చూస్తా. మీ అమ్మలా జేబు చూడకుండా కడుపు చూస్తా. ప్రభుత్వ కార్యాలయాల్లో రైతులను గౌరవించే వ్యవస్థ ఉంటుంది. యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ఉపాధి కోసం ఆర్థిక సాయం అందిస్తా. అధికారంలోకి వస్తే ఒకే నోటిషికేషన్‌ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు, ఉద్యమకారుల కోసం లక్ష సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టిస్తాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పనిచేస్తాం’ అని కవిత చెప్పారు. 

పసుపు.. నీలం.. ఆకుపచ్చ 
కల్వకుంట్ల కవిత శనివారం తన కొత్త పార్టీ పేరుతోపాటు జెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీ జెండాలో పసుపు, నీలం, అకుపచ్చ రంగుల్లో పార్టీ జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక చిత్రపటం పొందు పరిచారు. జెండా మధ్యలో ఇంగ్లిషు అక్షరాల్లో టీఆర్‌ఎస్‌ పేరును చేర్చారు. సుమారు 50 నిమిషాలపాటు కవిత ప్రసంగం సాగింది. కార్యకర్తలు ఇచ్చిన పాంచజన్యం (శంఖం)ను పూరించారు. సభలో పాల్గొనేందుకు వచ్చిన వారు ఏఐ టెక్నాలజీ సాయంతో గ్రీన్‌మ్యాట్‌పై కవితతో కలిసి ఉన్నట్లుగా ఫొటోలు దిగారు. కవిత కుమారుడు ప్రజల మధ్య కూర్చొని తల్లి ప్రసంగాన్ని ఏకాగ్రతతో వింటూ కనిపించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, సింగరేణి కార్మికులు సహా అన్నీ వర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, యువత నడుమ సభ ఉత్సాహభరితంగా సాగింది. ‘టీ’ ఆకారంలో ఏర్పాటు చేసిన సభా వేదిక ప్రజలను ఆకర్షించింది. సభకు వచ్చిన ప్రతినిధులకు తెలంగాణ వంటకాలతో భోజనాలు పెట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement