కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు | Kavitha Sensational Comments On KCR Revanth Reddy At New Party Event | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

Apr 25 2026 10:43 AM | Updated on Apr 25 2026 3:37 PM

Kavitha Sensational Comments On KCR Revanth Reddy At New Party Event

సాక్షి, మేడ్చల్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌(తెలంగాణ రాష్ట్ర సేన) పేరిట శనివారం కొత్త పార్టీ ప్రకటించిన ఆమె.. ఆయన మారిపోయారని, రాజకీయ పరిణతి కోల్పోయారంటూ వ్యాఖ్యానించారు. 

ఆనాటి కేసీఆర్‌ వేరు..ఈనాటి కేసీఆర్‌ వేరు. ఆనాటి కేసీఆర్‌ చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. ఈనాటి కేసీఆర్‌ మన మనిషి కాదు.. మర మనిషి. ఏ కష్టమొచ్చినా ఆ సార్‌ ఇప్పుడు రారు.. ఎందుకంటే ఆయన మరమనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్‌ బందీ అయ్యారు. 

ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ సరిగా పాలించలేదు. అందుకే సరైన ఫలితాలు రాలేదు. ఇప్పుడు పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన ఆయన ఏం చేస్తున్నారు?. గతంలో టీఆర్‌ఎస్‌ కోసం ఆస్తులు అమ్ముకుని పని చేశారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఉద్యమకారుల్ని ఇబ్బంది పెడుతుంటే పార్టీ అధినేత ఆనాడు ఎందుకు స్పందించలేదు.  కేసీఆర్‌ హయాంలో ఒక్క ఉద్యమకారుడికి కూడా పదవి దక్కలేదు. దీనిపై ఆనాడే నేను పోరాడాల్సి ఉండేది. అదే నా తప్పైంది. ఆనాడు ఉద్యమకారులకు జరిగిందే ఇవాళ నాకు జరిగింది.. 

బీఆర్‌ఎస్‌ పార్టీలో అమ్మతనం పోయింది.. మమకారం పోయింది. ఆయన మన కేసీఆర్‌ కాదు.. మారిన కేసీఆర్‌. మారిన కేసీఆర్‌ పంజాబ్‌ వెళ్లారు. మన కేసీఆర్‌ అయ్యింటే తెలంగాణ బిడ్డలు కష్టపడి బయటకు వచ్చేవారు. మారుతారామోనని చూశా కానీ నన్నే సస్పెండ్‌ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నేను చెప్పడమే తప్పా?. తప్పు చేయని నన్ను పార్టీ నుంచి పంపించేశారు.  నా బిడ్డ, కొడుకు తప్పు చేస్తే తీసేస్తానని ఆనాడు కేసీఆర్‌ చెప్పారు. అవినీతి జరిగిందన్నందుకు నన్నే బయటకు పంపించేసి.. అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్నారు. ఆయన మారిపోయారు కాబట్టే నేను యుద్ధం చేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే ముందుంది ముసళ్ల పండుగ’’ అంటూ కవిత ప్రసంగించారు.

కవిత 5 గ్యారంటీలు.. వచ్చేది నా ప్రభుత్వమే!

ఇదీ చదవండి: అందుకే మన పార్టీ పేరు టీఆర్‌ఎస్‌

సీఎం రేవంత్‌పై.. 
ఇప్పుడు  ఉన్న సీఎం కర్కోటకుడిలా వ్యహరిస్తున్నాడు. ఒక రాజకీయ నాయకుడిని అలా అనడం సరికాదు. కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే అలా అనాల్సి వస్తోంది అంటూ సీఎం రేవంత్‌పై కవిత విమర్శలు గుప్పించారు. 

బీజేపీపై.. 
బీజేపీకి తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు. మెడ మీద తలలేని ఓ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాక్‌తో పోల్చాడు. బీజేపీ బానిస ఎంపీలు ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. ఆ పార్టీ ఎంపీలకు చేతనైతే ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చూడండి అంటూ సవాల్‌ విసిరారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement