సాక్షి, మేడ్చల్: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. కల్వకుంట్ల కవిత శనివారం కొత్త పార్టీ ప్రకటించారు. తన పార్టీకి టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన)గా ఆమె నామకరణం చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సభ వేదికగా ఈ ప్రకటన వెలువడింది. పార్టీ ప్రకటన అనంతరం ఆమె మాట్లాడుతూ..
‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించా. నాకు సింగరేణి అంటే చాలా ఇష్టం. తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదే. బతుకమ్మతో తెలంగాణ సంస్కృతిని చాటాం. బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి బలమైన సాంస్కృతి పునాది వేసింది జాగృతి. అయితే వచ్చిన తెలంగాణ ఎక్కడో దారి తప్పింది.
.. 12 ఏళ్లు గడిచినా తెలంగాణ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైంది. తెలంగాణ ఆనాడు పాలించిన కుటుంబంలో నేను భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా. ఆనాడు ఇసుక మాఫియా ఎన్నో దారుణాలకు పాల్పడింది. అలాగే తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు మాత్రం గర్వపడుతున్నా.
తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి. కేసీఆర్ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ తప్పు సరిదిద్దుకునేందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన(TRS)తో మీ ముందుకు వచ్చాను. బీఆర్‌ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. మంచి చేయాలంటే రాజకీయ పార్టీ ఉండాలి. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి అమ్మగా మారాలనుకుంటున్నా. బిడ్డల కష్టం అమ్మకే తెలుస్తుంది. అప్పుడే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరతాయి’’ అంటూ ప్రసంగించారామె.
పాంచజన్య హామీలు..
తెలంగాణలో ఉన్న మూడు పార్టీలు అధర్మం, అవినీతి, బంధు ప్రీతితో నిండిపోయాయి. ఎంతో మంది ఎన్నో మాట్లాడారు.. కానీ మనకు ఏమీ చేయలేదు. ఆ మూడు పార్టీలపై మన టీఆర్‌ఎస్(తెలంగాణ రాష్ట్ర సేన) తరఫున పాంచజన్యం పూరిద్దాం. ప్రస్తుతం మనమే ప్రధాన ప్రతిపక్షం. మరో రెండేళ్లలో మనదే అధికార పక్షం. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. జీహెచ్‌ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. అవతలి వాడు మనవాడైనా సరే యుద్ధం చేస్తా. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం.. ఈ ఐదు అంశాలపైనే నా పోరాటం అంటూ పాంచ్‌జన్యం పేరిట ఐదు హామీలను కవిత ప్రకటించారు.
ఇదీ చదవండి: మళ్లీ టీఆర్‌ఎస్‌గా బీఆర్‌ఎస్.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు


