రాజకీయ కవితావేశం! | Sakshi Editorial On Kavitha TRS Party By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

రాజకీయ కవితావేశం!

Apr 26 2026 12:21 AM | Updated on Apr 26 2026 12:27 AM

Sakshi Editorial On Kavitha TRS Party By Vardhelli Murali

జనతంత్రం

అంగ వంగ కళింగ రాజ్యాలను ఏకకాలంలో వచ్చేనెల నుంచి బీజేపీ పరిపాలించబోతున్నదని ఆ పార్టీ అగ్రనేత అమిత్‌ షా చెప్పారు. ఇప్పటికే అంగ (బిహార్‌), కళింగ (ఒడిషా) రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. మొన్న తొలివిడత పోలింగ్‌ జరిగిన వంగ (బెంగాల్‌) రాష్ట్రంలో కూడా తాము అధి కారంలోకి రాబోతున్నామని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీస్తుపూర్వం కాలంలో తూర్పు భారతాన ప్రవర్ధిల్లిన మూడు ముఖ్య రాజ్యాలను ఉటంకిస్తూ చారిత్రక కోణంలో ఆయనీ వ్యాఖ్యానం చేసి ఉంటారు. కళింగ యుద్ధంలో రక్తపుటే రులు పారించిన అనంతరం అశోక చక్రవర్తి తన దండయాత్రలకు స్వస్తిపలికి బౌద్ధ ధర్మ బోధనకు అంకితమయ్యారు. రికార్డు స్థాయిలో ఓట్ల వరద పారించిన వంగ యుద్ధంలో ఒకవేళ గెలిస్తే రాష్ట్రాలపై బీజేపీ దండయాత్రలు ముగిసిపోతాయా? అటువంటి అవకాశం ఏమాత్రం లేదని చెప్పవచ్చు.

దక్షిణ భారతావని ఇంకా కాషాయ ఛత్రఛాయలోకి పూర్తిగా చేరనేలేదు. ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ గెలుస్తూ, ఓడుతూ వస్తున్నది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆ కూటమిలో బీజేపీ జూనియర్‌ భాగస్వామి మాత్రమే. పైగా ఆ కూటమి గెలిచే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. ఏపీ కూటమి సర్కార్‌లో కూడా బీజేపీది చిన్న వాటానే. తొలిదశలో పోలింగ్‌ జరిగిన కేరళం ఈసారి కూడా బీజేపీకి కొరుకుడు పడలేదని వార్తలొస్తున్నాయి. మహా అయితే ఒకటి రెండు సీట్లు గెలవవచ్చనే అభిప్రాయం వినబడుతున్నది. బీజేపీ టార్గెట్‌ లిస్ట్‌లో అంగ వంగ కళింగల తర్వాత త్రిలింగ రాష్ట్రమున్నదనే వార్తలు చాలాకాలంగా వినిపి స్తున్నాయి. తెలంగాణకు ఆ పేరు ఎలా వచ్చిందనే అంశంపై ఉన్న రకరకాల వాదనల్లో త్రిలింగ వాదన కూడా ఒకటి కావడం తెలిసిన విషయమే.

దక్షిణాన తెలంగాణతో పాటు, ఉత్తరాన పంజాబ్‌ కూడా ఇప్పుడు బీజేపీకి తక్షణ లక్ష్యాలు. పంజాబ్‌లో బీజేపీ ఆపరేషన్‌ నిన్ననే బయటపడింది. అక్కడి పాలక పక్షమైన ఆప్‌ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా గాలం వేసి లాగేసింది. తెలంగాణ ఆపరేషన్‌ ఏ రూపంలో ఉంటుందో ఇంకా తేలవలసి ఉన్నది. సరిగ్గా ఇదే సందర్భంలో ఈరోజు (శనివారం) కేసీఆర్‌ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ పరిణామానికీ, బీజేపీ తెలంగాణ వ్యూహానికీ ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు. కానీ కవిత పార్టీ కారణంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏ మేరకైనా నష్టం జరిగితే అంతవరకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు బీజేపీకి మెరుగవుతాయి. కొత్త పార్టీ ప్రారంభ కార్యక్రమాన్ని కవిత ఘనంగానే నిర్వహించారు. ప్రారంభం రోజున అన్ని ప్రధాన దినపత్రికల్లో భారీ ప్రకటనలు కనిపించాయి. ముఖ్యమైన వార్తా ఛానెళ్లన్నీ ఆమె ప్రసంగాన్ని లైవ్‌గా కవర్‌ చేశాయి. ఎక్కడా పార్టీకి వనరుల కొరత ఉన్నట్టు అనిపించలేదు. బలమైన వ్యవస్థలే ఆమె వెనుక ఉండవచ్చన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌తో రాజకీయ విరోధంతోపాటు వ్యక్తిగత వ్యతిరేకత ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లకోసం డబ్బులిస్తూ వీడియో సాక్షిగా రేవంత్, ఆడియో సాక్షిగా చంద్రబాబు దొరికిపోయిన ఉదంతం పాఠకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థం రోజున రేవంత్‌ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్‌పై పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదిలేసుకొని చంద్రబాబు కరకట్ట నివాసానికి పరుగు పెట్టవలసి వచ్చింది. మధ్యవర్తుల మంత్రాంగంతో ఆ కేసు అప్పటితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జరిగిన అవమానాన్ని మరిచిపోలేకపోయారు. కాంగ్రెస్‌ పార్టీతో, ముఖ్యంగా రాహుల్‌ గాంధీతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కర్ణాటక, గుజరాత్‌ ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్‌కు ఆర్థిక సహాయం చేశారన్న వార్తలు కూడా వచ్చాయి.

ఓటుకు నోటు కేసు చల్లబడిన కొన్నాళ్లకే చంద్రబాబుకు తెలంగాణ సహచరుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి జగన్‌మోహన్‌రెడ్డిని ఇరుకున పెట్టడం కోసం ఆయన చెల్లెలు షర్మిల ఆశలను అవకాశంగా తీసుకొని తొలుత తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేయించి, కేసీఆర్‌ను నానాతిట్లు తిట్టించిన తర్వాత ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ప్రతిష్ఠించారనీ, జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, తదనంతరం ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఇన్నాళ్లకు కేసీఆర్‌ కూతురు తండ్రితో విభేదించి సొంతంగా పార్టీని ప్రకటించింది. ఈ పరిణామాన్ని రేవంత్‌ సర్కార్‌ సహజంగానే రాజకీయ అవకాశంగా మలుచుకోవచ్చు. 

కాంగ్రెస్‌ పార్టీ అలవికాని హామీలనిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు సగం పుణ్యకాలం పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని వార్తలొస్తున్నాయి. అదే సందర్భంలో కేసీఆర్‌ పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతున్నదని చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో కవిత సొంత పార్టీని స్థాపించి తండ్రిపైనే నేరుగా విమర్శలను ఎక్కుపెట్టడం కాంగ్రెస్‌ పార్టీకి అందివచ్చిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. తాను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తండ్రిపైనే కవిత చేస్తున్న విమర్శలపై జనం ఎలా స్పందిస్తారనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. కవితకు మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించాయి. ఇవే లక్షణాలు కేటీఆర్‌లో కూడా పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. తన కుటుంబం నుంచి ఇంతమంది సమర్థులైన నాయకులు రావడం కేసీఆర్‌కు లాభమా నష్టమా అనేసంగతి తేలవలసి ఉన్నది.

ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రకటించడం, తన లక్ష్యాలను వివరించడం అభినందించదగ్గ విషయమే. ఈ పరిణామాన్ని ఆహ్వానించ వలసిందే. ఆమె పార్టీ స్థాపన వెనుక రహస్య ఎజెండా ఉన్నదా, ఆమె వెనుక ఎవరున్నారనే చర్చ ముందుగానే చేయడం అనవసరం. అటువంటివేమైనా ఉంటే కాలక్రమంలో అవే బయటకొస్తాయి. అయితే ఆమె ప్రకటించిన ఎజెండా అంశాల మీద, వాటి ఆచరణ సాధ్యాసాధ్యాల మీద చర్చ జరగవలసిందే. ఆమె తన తొలి ప్రసంగంలోనే అధికార పార్టీపై కంటే తన తండ్రి పార్టీపైనే ఎక్కువ దాడిని ఎందుకు చేశారనే విషయంలో విశ్లేషణలు చేయవచ్చు. బీఆర్‌ఎస్‌ను ఫినిష్‌ చేస్తే ఆ స్థానం తన పార్టీకి దక్కుతుందని ఆమె విశ్వసిస్తున్నారా? అదే స్థానం కోసం పావులు కదుపుతున్న బీజేపీకి ఆమె కళ్లెం వేయగలరా? ప్రతి పక్షాల మూడు ముక్కలాటలో అధికార పార్టీకి లాభం జరగడం ఆమెకు సమ్మతమేనా? కవిత జనంలోకి వెళ్తున్న క్రమంలో నెమ్మదిగా ఇటువంటి సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు.

ఇప్పుడు ప్రతిపక్షం మనమే, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది కూడా మనమేనని పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రక టించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌)గా నిర్ణయించడంలోనే ఆమె టార్గెట్‌ ఎవరో అర్థమవుతున్నది. పాత టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, ఉద్యమ రథం దారి తప్పిందని, కేసీఆర్‌ ఇప్పుడు మరమనిషిగా మారిపోయారని ఘాటు విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్‌ పేరు పెట్టుకోవడం వల్ల గత ఉద్యమ ఉత్తేజంతో కొత్త పార్టీ బలం పుంజుకుంటుందని ఆమె నమ్ముతుండవచ్చు. ఎవరి నమ్మకాలు వారివి! ప్రజలను నమ్మించడంలోనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

తన లక్ష్యాలను వివరిస్తూ ఆమె పాంచజన్యం పూరించారు. తాను చేసిన ఐదు ప్రధాన హామీలకు ఆమె ‘పాంచజన్యం’ అనే పేరు పెట్టుకున్నారు. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం,ఒక్క నోటిఫికేషన్‌తో యువకులకు నాలుగు లక్షల ఉద్యోగాలు,అందులో ఉద్యమకారులకే లక్ష ఉద్యోగాలు, సామాజిక న్యాయంతో సబ్బండ వర్ణాల సంక్షేమం, వ్యవసాయంలో రైతునే రాజుగా చేయడం... ఆమె ప్రకటించిన పాంచజన్యంలోని ఐదు హామీలు. బీజేపీని రిమోట్‌ కంట్రోల్‌తో నడిపించే ఆరెస్సెస్‌ సిద్ధాంత గ్రంథం పేరు కూడా పాంచజన్యమే. వారి గురువు గోల్వాల్కర్‌ రాసిన ‘బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌’ తెలుగు అనువాదం పేరు పాంచజన్యం. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను ఫినిష్‌ చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న బీజేపీ పాంచ జన్యాన్ని మించి కవిత పాంచజన్య శంఖారావం వినిపించవలసి ఉంటుంది.

ఐదు హామీలూ ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని ఏరకంగా ఆచరణ సాధ్యం చేయగలరో వివరించి చెప్పవలసిన బాధ్యత కొత్త టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలిపై ఉంటుంది. రైతుబంధు, మిషన్‌ కాకతీయ వంటి కేసీఆర్‌ పథకాలను తెలంగాణ రైతాంగం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వాటి కంటే మిన్నగా ఏరక మైన ప్రతిపాదనను ఆమె ముందుకు తీసుకొని వస్తారో ఎదురు చూడవలసి ఉన్నది. సామాజిక న్యాయం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక అరిగిపోయిన రికార్డుగా మారింది. తెలంగాణలో అత్యధిక జనాభా గల కులంగా ఉన్న మాదిగ వర్గానికి చెందిన విశారదన్‌ మహారాజ్‌ తన ఎజెండాతో ఇప్పుడు ఎస్సీ లతోపాటు, ఎస్టీ, బీసీ యువతను విశేషంగా ఆకర్షించగలుగు తున్నారు. విశారదన్‌ కంటే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని కవిత రూపొందించగలిగితేనే ఆమె సామాజిక న్యాయ నినాదం సార్థకమవుతుంది. ఇటువంటి ఎన్నో సవాళ్లకు వెరవకుండా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన కవితకు శుభాకాంక్షలు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com 

Advertisement
 
Advertisement
Advertisement