breaking news
the Telangana government
-
సర్కార్‌కు చిత్తశుద్ధిఉందా..!
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టు రీ డిజైన్‌పై సీఎం కే సీఆర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసి ఆయా అంశాలపై చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు డా. గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌చేశారు. ఈ ప్రాజెక్టుపై అఖిలపక్షంతో చర్చించకుండా, గ్రామసభలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రాత్రికి రాత్రి డి జైన్లు మార్చడం, జీవోలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. నిర్వాసితులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేయడాన్ని, రైతులకు మద్దతునిస్తున్న వైఎస్సార్సీపీతో సహా ఇతరపార్టీల నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. లాఠీలు, తూటాలతో పొలాల్లోకి నీళ్లు రావన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని హితవుపలికారు. రైతులు కోరుకున్న విధంగా కేంద్ర భూసేకరణ చట్టం, 2013 లేదా జీవో 123 ప్రకారం పరిహారమిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ప్రకటించి అందుకు భిన్నంగా వ్యవహరించడ ఏమిటని నిలదీశారు. తమ పార్టీ ప్రాజెక్టులకు పూర్తి మద్దతునిస్తుందని, అయితే నిర్వాసితులకు అన్ని ప్రయోజనాలు చేకూర్చి, రైతుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చి, ఉపాధి కోల్పోయిన వారికి పనులు కల్పించి, ఇళ్లు, ఆర్ఓఆర్ ప్యాకేజీని నిర్ణీత కాలవ్యవధితో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పెట్టి రైతుల భూములను రిజిష్టర్ చేయించడాన్ని తప్పుబట్టారు. రైతుకు ఉపాధినిచ్చేది అతని పొలమేనని, దానిని లాక్కుంటూ తగిన పరిహారం అందించకపోవడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. భూమిని తీసుకునే విషయంలో రైతులను సంతృప్తిపరిచే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని, గ్రామస్థాయికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. జలయజ్ఞానికి సంబంధించి మహానేత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకున్న చర్యల ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయన్నారు. వైఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగానే ఇప్పుడు మహబూబ్నగర్జిల్లాలోని ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తున్నాయన్నారు. రైతన్నల కడుపుకొట్టిన ప్రభుత్వాలు ఏవి మనలేదన్న విషయాన్ని గ్రహించాలని, వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం బషీర్‌బాగ్‌లో కాల్పులకు పాల్పడితే ఏమైందో గుర్తుంచుకోవాలని, లాఠీచార్జీలకు పాల్పడి తూటాలు పేల్చితే ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. నిర్వాసితులను బలవంతంగా వెళ్లగొట్టే చర్యలను మానుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి ఆరునెలల ఆలస్యంగా ప్రాజెక్టును ప్రారంభించినా ఏమీ కాదని హితవుపలికారు. సీఎం సొంతజిల్లా మెదక్‌లోనే 600 మంది రైతులు ఆత్మహత్యల బారిన పడితే వారిలో కనీసం 60 మందికి కూడా పరిహారం అందించకపోవడం సిగ్గుచేటని గట్టు శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
‘ధర్నాలు ఆగాయా?ముళ్లకంచెలు మారాయా?’
కోటి ఆశలతో, వేల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ధర్నాలు ఆగిపోయినయా, ముళ్ల కంచెల బాధ తప్పిందా అని బీజేపీ శాసనసభాపక్షనేత జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ రాష్ట్రకార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలు, కుటుంబపాలనతో ప్రతిపక్షపార్టీలే ఉండకూడదనే దుర్మార్గ రాజకీయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లో చేరితేనే అభివృద్ధి పనులు, లేకుంటే వేధింపులు అనే విధంగా ఇతరపార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను, స్థానిక సంస్థల ప్రతినిధులను బెదిరిస్తున్నారని విమర్శించారు. సమస్యలపై ఇందిరాపార్కు వద్ద ధర్నాలు ఆగిపోయినయా అని ప్రశ్నించారు. సమైక్యరాష్ట్రంలో ఉన్న ముళ్ల కంచెల బాధ స్వంత రాష్ట్రంలో తెలంగాణవాదులకు తప్పిందా అని ప్రశ్నించారు. కుటుంబపాలన, అవినీతి, కార్పొరేట్ కాలేజీల దోపిడీ, పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్షపార్టీలపై వేధింపులు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పెరిగిపోవడం నిజం కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబపాలన, పార్టీ ఫిరాయింపులతో రాష్ట్రంలో రాజకీయ అంధకారం, టీఆర్ఎస్ నేతల్లో అహంకారం పెరిగిపోయినాయని విమర్శించారు. పార్టీలో చేరితేనే నిధులు ఇస్తామని సర్పంచులను బెదిరిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి పోయి నిధులు ఎలా అడుగుతారని అన్నారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల పట్ల టీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తున్నదో కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఒక నీతి, రాష్ట్రప్రభుత్వానికి మరొక నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. హింసా కార్యకలాపాలకు దిగుతున్నారనే సమాచారంతో అరెస్టన ఉగ్రవాదులకు న్యాయం సహాయం అందిస్తామని బహిరంగంగా ప్రకటించిన ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంఐఎంకు భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అప్రమత్తత వల్ల హైదరాబాద్‌కు చాలా పెద్దప్రమాదం తప్పిందన్నారు. అసదుద్దీన్‌పై చర్యలకోసం కేంద్ర హోంమంత్రి రాజ్నాధ్సింగ్ను కలిసి ఫిర్యాదుచేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో టీడీపీపీ కార్యాలయాన్ని నోటీసుల్లేకుండా తొలగించడం అన్యాయమని, నిబంధనల మేరకు యంత్రాంగం వ్యవహరించాలని సూచించారు. -
ప్రీ-సర్వే... గందరగోళం
ముషీరాబాద్ జోన్ బృందం : తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేకు ఆదిలోనే అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది డివిజన్లలో మొదటి రోజు ఇంటింటికీ వెళ్ళి సర్వే ఫారాలను అందించే క్రమంలోనే ఇలాంటి అడ్డంకులు ఎదురైతే 19వ తేదీన సర్వే పరిస్థితి ఏంటనేది అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా సర్వే ఫారాలు కావాల్సినన్ని అందించకపోవడం, సకాలంలో రాకపోవడం, ఇంటింటికీ అందించే స్టిక్కర్లు సైతం సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఎన్యూమరేటర్లకు కేటాయించిన అసోసియేట్ ఎన్యూమరేటర్లు గైర్హాజరు కావడంతో ఫారాల పంపిణీ నత్తనడకన సాగింది. మొదటిరోజు కేవలం సగం ఫారాలే పంపిణీ చేశారు. గాంధీనగర్‌లో 160మంది అసోసియేట్ ఎన్యూమరేటర్లు గైర్హాజర్.. అసోసియేట్ ఎన్యూమరేటర్లు సమగ్ర సర్వే నిర్వహించేందుకు ఈ రోజు హాజరు కావాల్సిన 160 మంది గైర్హజయ్యారని దీనివల్ల ఇబ్బందులు తప్పవని గాంధీనగర్ డివిజన్ 93-వార్డు సర్వే నోల్ అధికారి సుదర్శన్ తెలిపారు. సమగ్ర సర్వేకు డివిజన్ 93-వార్డులో 56 మంది ఎన్విరేటర్లు, 6గురు క్లస్టర్ ఇన్చార్జిలు ,40 మంది అసోసియేట్ ఎన్యూమరేటర్లు హాజరైనట్లు తెలిపారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్లో క్లస్టర్లకు, ఎన్యూమరేటర్లకు, అసోసియేట్ ఎన్యూమరేటర్లకు సర్వే బుక్స్‌ను, స్టిక్కర్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని అప్పుడే ఈ సర్వే విజయవంతం అవుతుందన్నారు. ఆరోరా కళాశాలకు చెందిన 160 మంది అసోసియేట్ క్లస్టర్లు రావాల్సి ఉండగా రాలేదన్నారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసిన వారు ఏలాంటి స్పందన లేదన్నారు. దీనికి రేపు కూడా హజరు కాకపోతే ఇక్కడ నిర్వహించే సర్వే విజయవంతం కాదన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జీలు, ఎన్విరేటర్లు అనంతరాములు, విజయరావు, సుధాకర్, మంజులసింగ్, సాయినాథ్, రాజేష్, సదానంద్, వేణుగోపాల్‌రావు, పద్మశ్రీ పాల్గొన్నారు. 6 బస్తీలను వదిలేసిన ఎన్యూమరేటర్లు ఈ నెల 19వ తేదీన జరుగనున్న సమగ్ర సర్వేలో భాగంగా ఆదివారం ముషీరాబాద్, భోలక్‌పూర్ డివిజన్లల్లో నోడల్ అధికారి, క్లస్టర్లు, ఎన్జుమలేటర్లు ఇంటింటికి తిరుగుతూ పత్రాలను పంపిణీ చేశారు. ముషీరాబాద్ డివిజన్ వార్డు నెంబరు -91 విషయానికొస్తే ఆరుగురు క్లస్టర్లు, 58 మంది ఎన్జుమలేటర్లు , 190 మంది అసోసియేట్ ఎన్జుమలేటర్లు ఇంటింటికి తిరుగుతూ పత్రాలను పంపిణీ చేశారు. అయితే ఉదయం 7 గంటలకు వచ్చిన 58 ఎన్జుమలేటర్లు సహాయకులు సకాలంలో రాకపోవడంతో చాలాసేపు కమ్యూనిటీహాల్‌లోనే కూర్చున్నారు. దాదాపు 11 గంటల తర్వాత ప్రారంభమైనప్పటికి సరిపడా చెక్ లిస్టు పత్రాలు పరిపోకపోవడంతో సహాయకులు నచుడుకుంటూ కమ్యూనిటీహాల్ వద్దకు వచ్చి పత్రాలను తీసుకెళ్లారు. భోలక్‌పూర్‌లో... భోలక్‌పూర్‌లో 19 బస్తీలున్నప్పటికీ బ్యాంక్ కాలనీ, సంజీవయనగర్, టి.అంజయ్యనగర్, భోలక్‌పూర్ హౌస్, వెంకటేశ్వర్‌నగర్ తదితర బస్తీల్లో ఎన్జుమలేటర్లు అసలు తిరగలేదు. డివిజన్లో 67 మంది ఎన్యూమరేటర్లు, 5 గురు క్లస్టర్లు, 200మంది వరకు అసోసియేట్ ఎన్యూమరేటర్లు పాల్గొన్నప్పటికీ చాలా బస్తీల్లో పర్యటించకుండా, చాలా చోట్లల్లో స్టిక్కర్లు అతికించకుండా వదిలేశారు. ముస్లిం ఇళ్లల్లో కుటుంబ సభ్యుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికి ఒకే పత్రాన్ని ఇచ్చారు. ఉర్దూలో పత్రాలు లేకపోవడంతో ఇబ్బంది పడ్డ ముస్లింలు భోలక్‌పూర్‌లో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు. అయితే చెక్‌లిస్టు పత్రాలు తెలుగు, ఇంగ్లీషులో మాత్రమే ఉన్నాయి. భోలక్‌పూర్‌లోని ముస్లిం బస్తీల్లో పర్యటించి ఎన్యూమరేటర్లు ఇచ్చిన పత్రాలను చూసి చాలా మంది ముస్లింలు ఏమీ రాయాలో తెలియని అయోమయస్థితిలో పడిపోయారు. నోడల్ అధికారిపై కార్పొరేటర్ ఆగ్రహం భోలక్‌పూర్ డివిజన్లో చెక్‌లిస్టు పత్రాల పంపిణీ గందరగోళంగా మారింది. చాలా బస్తీలను వదిలేశారని, తన ఇంటికే ఇంకా రాలేదని స్థానిక కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ అన్నారు. అయితే ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న భోలక్‌పూర్‌లో చెక్‌లిస్టు పత్రాలు కేవలం ఇంగ్లీషు, తెలుగులో ఉండటం, ఉర్దూలో లేకపోవడం, ఆరు బస్తీలను వదిలేయడం పై కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్ నోడల్ అధికారి అశ్వినికుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్దూలో పత్రాలు లేవని, ముస్లింల కోసం ఉర్దూలో తెప్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, జోనల్ కమిషనర్‌కు మెస్సేజ్ చేశామని కార్పొరేటర్ తెలిపారు. అంతేకాదు పత్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబిసీ, ఓసీ కులస్తులకే మాత్రం నమోదు చేసే విధంగా ఉందని, ముస్లింల కోసం ‘బీసీ’అని లేదని, బీసీ అని ఉంటే దాని పక్కనే ముస్లిందరం బీసీ (ఈ) అని నమోదు చేసుకునే అవకాశం ఉండేదన్నారు. అడిక్‌మెట్ డివిజన్లోని అడిక్‌మెట్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన ఫారాల పంపిణీ కార్యక్రమానికి ఉదయం 7 గంటలకు అధికారులు వచ్చినప్పటికీ సరిపడా ఫారాలు లేకపోవడంతో కొంతమంది ఎన్యూమరేటర్లు మధ్యాహ్నం రెండు తరువాత పంపిణీ చేయడానికి వెళ్ళారు. ఒక ఎన్యూమరేటర్‌కు 40 ఇళ్ళను కేటాయించగా ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ప్రాంతంలో ఉండటం, ఇంటి నెంబర్లు గుర్తించలేకపోవడంతో కొంతమంది 15 నుంచి 20 ఇళ్ళకు మాత్రమే ఫారాలను పంపిణీ చేశారు. వారికి ఇంటి నెంబర్లు కనుక్కోవడం కష్టతరమైంది. వారు స్థానికులు కాకపోవడం, మహిళా ఉద్యోగులు కావడంతో ఇబ్బందులెదురొన్నారు. ఇంటి నెంబర్ల ప్రకారం ఫారాలను అందజేయడంతో ఒక ఇంటినెంబరుపై ఒక అపార్ట్మెంట్ ఉండటం, అందులో నలబై యాభై ఫ్లాట్లు ఉండటంతో ధరఖాస్తు ఫారాలు లేక పంపిణీ జరగలేదు. పైగా తనకు కేవలం 40 ఇళ్ళనే కేటాయించారని, ఆపై కేటాయించిన వాటిని మాత్రం నేను సర్వే చేయమని ఎన్యూమరేటర్లు మొరాయించారు. అడిక్‌మెట్ డివిజన్లోని మార్క్స్ భవన్, మేడిబావి బస్తీ తదితర ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా నివశిస్తున్నారు. అయితే వారికి తెలుగు ఫారాలు పంపిణీ చేయడంతో వాటిని ఎలా పూర్తి చేయాలో వారికి అర్థం కావడం లేదు. కవాడిగూడ డివిజన్లో కేటాయించిన ఎన్యూమరేటర్లకు సహాయక ఎన్యూమరేటర్లు సరైన సమయానికి రాకపోవడం కారణంగా సుమారు మూడు గంటలకు పైగా ఎన్యూమరేటర్లు ప్రీ-సర్వేను ప్రారంభించడం ఆలస్యమైంది. ఎన్యూమరేటర్లే స్థానికులను సహాయకులుగా అప్పగించిన పనిని పూర్తి చేశారు. ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే కరపత్రాలు, స్టిక్కర్లు సరిపడా అందకపోవడంతో డివిజన్ వ్యాప్తంగా పూర్తి కావాల్సిన ప్రీ-సర్వే పూర్తి కాలేకపోయింది. కరపత్రాలు అధిక భాగం తెలుగులోనే ఉండటంతో ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో మాట్లాడి, చదివే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సాయంత్రం పూట ప్రీ-సర్వే పూర్తయిన తరువాత ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరే షన్ కోసం సుమారు రెండు గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది.