TDP Files
-
ఖజానాపై భారం రూ.1,472.50 కోట్లు
సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో ఒకవైపు అంతులేని అప్పులు.. మరోవైపు యథేచ్ఛగా ప్రజాధనం దుర్వినియోగం! రాజధాని నిర్మాణంలో చంద్రబాబు సర్కారు నిర్వాకాలకు ఇది మరో నిదర్శనం! సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్ రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్‌లోని లోపాల కారణంగా రాష్ట్ర ఖజానాపై రూ.1,472.50 కోట్ల భారం పడింది. రాజధానిలో 220 కేవీ, 400 కేవీ విద్యుత్ లైన్లను విస్మరించి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. దీనివల్ల ఇప్పుడు నిర్మాణాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆ విద్యుత్ లైన్లు అడ్డంకిగా మారాయని.. వాటిని మార్చాల్సిందేనని సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించింది. ఆ మేరకు ఆ పనులను ప్యాకేజీల కింద విడగొట్టి.. వాటిని 8.98, 8.99 శాతం అధిక ధరలకు ముఖ్యనేతకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని పనులు మనోళ్లకు అప్పగిస్తే మురికివాడలు నిర్మిస్తారని 2016లో సీఎం చంద్రబాబు మన ఇంజనీర్లను అవహేళన చేశారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరి.. సింగపూర్ సంస్థ రూపొందించిన మాస్టర్‌ప్లాన్ లోపాల వల్ల ఖజానాపై పడిన భారీ భారం మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.తప్పుబట్టిన ‘కాగ్’..217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించే పనులను నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్‌కు 2016లో నామినేషన్‌పై చంద్రబాబు సర్కార్ అప్పగించడాన్ని కాగ్ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తప్పుబట్టింది.. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన ఆ సంస్థకు రూ.20.28 కోట్లను అప్పట్లో ప్రభుత్వం చెల్లించింది. ఆ ప్లాన్ ప్రకారమే అప్పట్లో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. కానీ.. రాజధాని ప్రాంతంలో గతంలో 38 కి.మీ.ల పొడవున వేసిన 400 కేవీ విద్యుత్ లైన్, 55 కిమీల పొడవున వేసిన 220 కేవీ లైన్లు నిర్మాణాలకు అడ్డంకిగా మారాయి. ఇది మాస్టర్ ప్లాన్‌లో లోపాలను బహిర్గతం చేసింది. దాంతో ఆ విద్యుత్ లైన్లను మార్చే పనులకు గతేడాది సీఆర్డీఏ టెండర్లు పిలిచింది.నిబంధనలు తుంగలో తొక్కి..రాజధాని ప్రాంతంలో ఎన్–10 రహదారి నుంచి ఎన్–13–ఈ–11 రహదారుల జంక్షన్ వరకు 220 కేవీ ఎక్స్ట్రా హైవోల్టేజీ(ఈహెచ్‌వీ) లైన్ అండర్ గ్రౌండ్లో ఏర్పాటుకు సంబంధించి మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి ఒక ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో ఏపీ ట్రాన్స్‌కో 18 కి.మీ.ల పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ(డైరెక్ట్ కరెంట్) లైన్స్‌లో మిగిలిన పనులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 20 కి.మీ.ల పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ లైన్స్‌లో మిగిలిన పనుల పూర్తికి రూ.283.57 కోట్ల అంచనా వ్యయంతో మరో ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 220 కేవీ లైన్‌ను మార్చే పనులను 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్‌కు రూ.1,082.44 కోట్లకు కట్టబెట్టింది. అంతేకాదు.. కాంట్రాక్టు విలువ కంటే 8.99 శాతం అధిక ధరకు కోట్ చేసిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్(జేవీ)కి 400 కేవీ లైన్‌ను మార్చే పనులను రూ.390.06 కోట్లకు అప్పగించింది. కాగా టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్ 20న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. దాని ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధికంగా కాంట్రాక్టర్లు కోట్ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్ పిలవాలి. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల ఖజానాకు రూ.114.68 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆ మేరకు కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూరింది. ఈ పనులను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తూ గతేడాది మార్చి 19న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.రూ.10,319.11 కోట్లు ప్రయోజనమంటూ వితండవాదన..విద్యుత్ లైన్లను మార్చే పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు సీఆర్డీఏ ప్రతిపాదనలు పంపింది. 220 కేవీ లైన్‌ను మార్చడం వల్ల 271.82 ఎకరాలు, 400 కేవీ లైన్‌ను మార్చడం వల్ల 244.14 ఎకరాల భూమి మిగులుతుందని.. ప్రస్తుతం ఎకరం మార్కెట్ విలువ రూ.20 కోట్లు పలుకుతోందని.. దీనివల్ల మొత్తం రూ.10,319.11 కోట్ల ప్రయోజనం చేకూరుతుందని ఆ ప్రతిపాదనల్లో సీఆర్డీఏ పేర్కొంది. కానీ.. రాజధానిలో ఎకరం రూ.50 లక్షల చొప్పున ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టడం గమనార్హం. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. విద్యుత్ లైన్లను మార్చే పనులకు అనుమతి కోసం వితండవాదనతో కూడిన ప్రతిపాదనను ఆర్థిక శాఖకు సీఆర్డీఏ పంపిందన్నది స్పష్టమవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
‘ఇనార్బిట్’ చుట్టూ ఇగో పాలిటిక్స్
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యమని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వ అసలు రంగు విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం వేళ బయటపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై ఆయన ముద్ర చెరిగిపోలేదన్న కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్దదైన ఈ మాల్ పనులు గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు క్రెడిట్ ఎక్కడ జగన్‌కు దక్కుతుందోనన్న భయంతోనే విశాఖలోనే ఉన్న లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని చర్చ జరుగుతోంది. నగరాభివృద్ధి కంటే రాజకీయ వైషమ్యాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. అభివృద్ధిపై ‘చిన్నచూపు’.. లోకేష్ అక్కసు! రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కలి్పంచే వేదికను ప్రోత్సహించాల్సింది పోయి, దాన్ని చిన్నచూపు చూడటం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామని ప్రగల్భాలు పలికే లోకేష్ .. కేవలం రాజకీయ వైరంతోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం చూస్తుంటే, అభివద్ధి కంటే రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంతో సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు చేతుల మీదుగా ఇనార్బిట్ మాల్‌ను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో మాల్ అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరాంజి కోరాటి మాత్రమే హాజరయ్యారు. మాల్‌ను ప్రారంభించిన రహేజా గ్రూప్ ప్రతినిధులు, ఇనార్బిట్‌మాల్ సీఈవో రజనీష్ మహాజన్ , పోర్టు చైర్మన్ అంగముత్తు గత ప్రాజెక్టులపై వివక్ష ఈ మాల్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎన్నికల ముందు ‘జాబ్ క్యాలెండర్’ అంటూ ఊదరగొట్టిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల పట్ల ఇలాంటి వివక్ష చూపడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది నిరుద్యోగులను వంచించడమే అంటూ నిరుద్యోగులు పెదవి విరస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే ధోరణితో ప్రభుత్వం ఉంటే.. పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నాయి. -
నాడు అభివృద్ధికి రూపం .. నేడు దుబారాకు కలరింగ్!
అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. కూటమి ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అందులో స్వప్రయోజనాలే ఉంటాయి తప్ప, రాష్ట్ర ప్రజలకు అది ఉపయోగపడేది మాత్రం అస్సలు ఉండదు. ఇందుకు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చే నిదర్శనం.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చు రూ. 401 కోట్లట. ఇక్కడ అమరావతి మొత్తం భవనాల ఖర్చు రూ. 2316 కోట్లు కాగా, డిజైన్లకే రూ. 401 కోట్లు ఖర్చు చూపెట్టారు. కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజెన్లకే వందల కోట్ల రూపాయిలు నీళ్లలా ఖర్చు చేశారు. ఇంతటి ఖర్చు ఎవరికి ఉపయోగం. ఈ ఖర్చును చూస్తే డిజైన్లకు అన్ని వందల కోట్లా అని ముక్కున వేలేసుకోకమానరు ప్రజలు.. అదే సమయంలో మన బాబుగారు చేస్తున్న పాలన కదా ఇలాగే ఉంటుంది అని నవ్వుకోక మానరు.రుషికొండ ప్రభుత్వ భవనాల ఖర్చుకే ఏడుపులు..మరి ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. రుషికొండలో ప్రభుత్వ భవనాలకు అయిన మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 230 కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు అవుతున్న ఖర్చు పోలిస్తే ఇది బాగా తక్కువ. మరి ఆనాడు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతో జగన్ ఆ కార్యక్రమం చేపడితే అప్పడంతా చెత్త ఏడుపులే కనిపించాయి.ఆ భవనాలపై వికృత రాజకీయంరాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా వైఎస్ అద్భుత ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేసింది.తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎప్పుడూ కపట రాజకీయాలు చేస్తూ వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. రూ. 230 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఐకానిక్ భవనాలను చూసి టీడీపీ అధినేతలు ఏడుపు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే విష ప్రచారం చేశారు. అవి ప్రభుత్వ భవనాలే అని చెప్పినా శృతిమించి మరీ కపట రాజకీయం చేసింది.చివరకు అవి ప్రభుత్వ భవనాలేనని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అంగీకరించింది. అప్పుడొక ఏడుపు.. ఇప్పుడొక కవరింగ్. ఇది బాబుగారి రాజనీతి పాలన.మరి ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు రూ 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి. దీన్ని స్వలాభాపేక్ష అనకుండా ఏమంటారు చంద్రబాబు.అభివృద్ధికి రూపాన్ని చూపెట్టిన నాయకుడు జగన్ఆనాడు అభివృద్ధికి అసలైన రూపాన్ని చూపెట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఏ విషయంలోనైనా జగన్ మార్క్ పాలన అనేది కనబడింది. అందుకు రిషికొండలో వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలే ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వ భవనాలను చూసి తొలుత అగ్లీ(చెత్త) ఏడుపు ఏడ్చింది మీరే.. ఆ తర్వాత శభాష్ అంటూ మెచ్చుకున్నది మీరే. ఇది కూటమి పెద్దల తీరు. అయితే, మరి ఈరోజు కూటమి పెద్దలు చేస్తున్నదేమిటి?, అభివృద్ధి అంటూ పైకి కల్లిబొల్లి మాటలు చెప్పే నేటి ప్రభుత్వ పెద్దలు.. అసలైన అభివృద్ధికొచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. ఇక్కడ రిషికొండ భవనాలను, అమరావతి గవర్నమెంట్ భవనాలను పోల్చి చూస్తే.. కూటమి పెద్దలది కేవలం బ్లూప్రింట్ల పాలన అనేది అందరికీ అర్థమవుతోంది. నేటి ప్రభుత్వ పాలనలో డిజైన్ల వంటి వాటికే వందల కోట్ల రూపాయిలను వెచ్చిస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. మరి ఇప్పుడు ఎవరికోసం ఈ దుబారా?అయితే ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. కేవలం డిజైన్లకే ఇంత ఖర్చు అయితే పూర్తి నిర్మాణానికి ఎంత అవుతుంది?, ఇది అభివృద్ధా… లేక దుబారా ఖర్చా?, ప్రజల డబ్బుతో డిజైన్ల పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ఖర్చులు ఏంటని చర్చించుకుంటున్నారు. -
డిజైన్లకే రూ.401.54 కోట్లు!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల వ్యయమే కాదు.. భవనాల డిజైన్ల (ఆకృతులు) ఖర్చులోనూ చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్ధలు కొడుతోందని ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ నిపుణులు నివ్వెరపోతున్నారు. డిజైన్ల పేరుతో ఒకసారి.. ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ధారపోయటాన్ని తప్పుబడుతున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం (అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్) డిజైన్ల రూపకల్పన పనులను చంద్రబాబు సర్కారు ఏకంగా రూ.401.54 కోట్లకు కన్సల్టెన్సీలకు అప్పగించటంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) డిజైన్ల రూపకల్పనకు 2016లో నిర్వహించిన టెండర్లలో జపాన్‌కు చెందిన ‘మకీ’ అసోసియేట్స్‌ను చంద్రబాబు సర్కార్ తొలుత ఎంపిక చేసింది. ఆ తర్వాత ఆ టెండర్‌ను రద్దు చేసిన సమయంలో మకీ ఛైర్మన్ పుమిహికో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, టెండర్లలో పారదర్శకత ఉండదని, లోపాయికారీ ఒప్పందాలే ఉంటాయని పుమిహికో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బ తీశాయని పేర్కొంటున్నారు.డిజైన్ల పేరుతో ఒకసారి.. ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి..రాజధానిలో నేలపాడు వద్ద 1,575 ఎకరాల్లో ‘ఏజీసీ’ని ప్రభుత్వం నిర్మిస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల (హెచ్‌వోడీ) కోసం 39 అంతస్తులతో నాలుగు టవర్లు, 49 అంతస్తులతో మరో టవర్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఈ ప్రాంగణంలో నిర్మిస్తోంది. ఈ ఏడు భవనాలతోపాటు ఏజీసీ ప్రాంతాన్ని నిర్మించడం కోసం డిజైన్లకు 2016లో చంద్రబాబు సర్కార్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను తొలుత జపాన్‌కు చెందిన ‘మకీ’ సంస్థ దక్కించుకుంది. కానీ వాటిని 2016 అక్టోబర్ 24న ఎలాంటి కారణాలు లేకుండా రద్దు చేశారని మకీ సంస్థ ఛైర్మన్ పుమిహికో అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 28న నాటి టీడీపీ సర్కారు మళ్లీ టెండర్లు పిలిచింది. లండన్‌కు చెందిన ఫోస్టర్ పార్టనర్స్‌తో కలసి హఫీజ్ కాంట్రాక్టర్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి రూ.67,86,44,683కు ఏజీసీ మాస్టర్ ఆర్కిటెక్ట్ పనులను దక్కించుకుంది. ఆ సంస్థ రూపొందించిన డిజైన్లు, గ్రాఫిక్‌లను ప్రదర్శిస్తూ.. రాజధాని నిర్మాణం పూర్తయిందనే రీతిలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ఫోస్టర్ పార్టనర్స్–హఫీజ్ కాంట్రాక్టర్(జేవీ) సంస్థ రూపొందించిన డిజైన్లతోనే భవనాల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు గతేడాది ప్రభుత్వం అప్పగించింది. హైకోర్టు, అసెంబ్లీ భవనాల సమగ్ర ఆర్కిటెక్చరల్ డిజైన్లు రూపొందించే పనులకు 2024 అక్టోబర్ 27న టెండర్ల ద్వారా రూ.136,90,74,000కు హఫీజ్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఏజీసీ ప్రాంతాన్ని జలమార్గం, బ్రిడ్జిలతో తీర్చిదిద్దే పనుల డిజైన్ రూపకల్పనకు 2025 ఆగస్టు 13న నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.59,90,00,000కు హఫీజ్ కాంట్రాక్టర్ సంస్థకే కట్టబెట్టింది.లోపాయికారీ ఒప్పందం కాకపోతే మరేమిటి?సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల కోసం ఏజీసీలో నిర్మిస్తున్న ఐదు టవర్లను కళాత్మకంగా తీర్చిదిద్ది ఆర్కిటెక్చరల్ సేవలు అందించే పనులను 2017 మే 2న చంద్రబాబు సర్కార్ నిర్వహించిన టెండర్లలో రూ.112,58,69,400కు జెనిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. కానీ.. అప్పట్లో ఐదు టవర్ల నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దాంతో ఆ టెండర్లను 2024 అక్టోబర్ 27న రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో కూడా రూ.136,88,40,800కు జెనిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే పనులు దక్కించుకోవడం గమనార్హం. దీన్ని బట్టి లోపాయికారీ ఒప్పందం జరిగిందన్నది స్పష్టమవుతోందని ఆర్కిటెక్చర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఏజీసీలో భవనాల నిర్మాణం డిజైన్ల తయారీ పనులనే రూ.401.54 కోట్లకు కన్సల్టెన్సీలకు అప్పగించడం గమనార్హం. ఆర్కిటెక్ట్స్ అందరూ ఫోర్బ్స్ మ్యాగజైన్‌లా భావించే ‘ఆర్కిటెక్చరల్ డైజెస్ట్’ మ్యాగజైన్ 2017 ఏప్రిల్‌లో ప్రచురించిన సంచికలో మకీ సంస్థ ఛైర్మన్ పుమిహికో రాసిన వ్యాసంలో వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే.. రాజధాని డిజైన్ల తయారీలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు వెల్లడవుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి దుబారా చేస్తున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. చదవండి: దళిత యువతిపై పెట్రేగిన పోలీసులు


