రాష్ట్ర రాజధానిపై తుది నిర్ణయం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అందులో తమకు ఎలాంటి పాత్ర ఉండదని తేల్చి చెబుతూ 2020 ఆగస్టు 19న హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తేల్చి చెప్పిన కేంద్రం
రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతి
స్పోర్ట్స్ సిటీ, ఎయిర్‌పోర్టు వంటి పేర్లతో అస్మదీయులకు భూములు కట్టబెట్టేందుకు రెండో విడత భూ సమీకరణ
ఎన్నికల హామీలు, సమస్యల పరిష్కారంలో వైఫల్యంతో ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత
వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు మరో డ్రామాకు తెరతీసిన సీఎం చంద్రబాబు
రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. అందులో తమకెలాంటి పాత్ర ఉండదని తెగేసి చెప్పిన కేంద్రం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతిని కప్పిపుచ్చుకోవడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడం.. ఎన్నికల హామీలు, ప్రజా సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడమే లక్ష్యంగా రాజధాని అమరావతికి ‘చట్టబద్ధత’ పేరుతో సీఎం చంద్రబాబు ఆడుతున్న నాటకంలో మరో అంకానికి తెరతీశారు. శనివారం శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014కు సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఇక రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరంటూ తనకు తానుగా ఛాంపియన్‌గా చిత్రీకరించుకోవడానికి సీఎం చంద్రబాబు సినీఫక్కీలో డైలాగ్‌లతో చెలరేగిపోయారు.
కేంద్రానికి సంబంధం లేకపోయినా..
రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర, సంబంధం ఉండదు. ఇదే అంశాన్ని తేల్చిచెబుతూ 2020 ఆగస్టు 19న హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ పత్రం(అఫిడవిట్) దాఖలు చేసింది. టీడీపీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన తీర్మానం మేరకు.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరణ చేసే బిల్లును పార్లమెంటులో బుధవారం కేంద్రం ప్రవేశపెట్టనుంది.
భవిష్యత్‌లో రాష్ట్ర రాజధాని అమరావతికి బదులుగా మరో నగరాన్ని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరించాలని కోరుతూ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి పంపితే.. ఆ మేరకు కేంద్రం చట్టాన్ని సవరించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడుతుందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. అమరావతికి చట్టబద్ధత అంటూ సీఎం చంద్రబాబు ఆడుతున్నది నాటకం తప్ప దానికి ఎలాంటి ప్రామాణికత లేదని తేల్చిచెబుతున్నారు.
‘డబ్బుల్’ ధమాకా..
రాజధాని ప్రాంతంలో 2015లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరకే చంద్రబాబు బినావీులు, వందిమాగధులు భారీఎత్తున భూములు కాజేశారు. ఇప్పుడు ఆ భూముల ధరలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ«దాని నిర్మాణం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, నాబార్డు, హడ్కో వంటి జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు ఇప్పటికే రూ.47,387 కోట్ల రుణం తెచ్చారు. ఆ రుణంతో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టారు. కాంట్రాక్టు విలువలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారు.
రెండో విడత భూ సమీకరణకు సిద్ధమై..
రాజధాని 29 గ్రామాలు.. 53,748 ఎకరాలకు (217 చ.కి.మీ.) పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందని.. భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూసమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసిచెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు వెరసి ఏడు గ్రామాల్లో రెండో విడత 20,494 ఎకరాల్లో (82.9 చ.కి.మీ.) భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వాటితోపాటు గుంటూరు జిల్లాలోని గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు(626.67 చ.కి.మీ.) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చ.కి.మీ. పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ భూములను స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో అస్మదీయులకు కట్టబెట్టి భారీగా కాజేయాలన్నది సీఎం చంద్రబాబు ప్లాన్.
దీన్ని గ్రహించే రెండో విడత భూసమీకరణకు రైతులు ముందుకు రావడం లేదు. తొలి విడత 11 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడమే లక్ష్యంగా అమరావతికి చట్టబద్ధత డ్రామాకు సీఎం చంద్రబాబు తెరతీశారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం
రాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే ప్రస్తుత ధరల ప్రకారం రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లుకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందలేళ్లు పడతాయి?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


